(భూమా బాబు)
మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి గారి అభ్యంతరకర వ్యాఖ్యలు రాష్ట్ర ప్రజలను తీవ్ర ఆందోళనలో పడేశాయి. “మన అభిమానస్తుడు, టీడీపీ వాళ్లను రఫ్ఫా రఫ్ఫా నరుకుతామన్నాడు. మంచిదే కదా..” అని ఒక పత్రికా సమావేశంలో ఆయన సమర్థించడం అత్యంత ఖండనీయం.
ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి, ప్రజాస్వామ్య వ్యవస్థలో అత్యున్నత బాధ్యతాయుత స్థానంలో ఉన్నవారు, బహిరంగంగా హింసను, దౌర్జన్యాన్ని ప్రోత్సహించడమంటే ఇది కేవలం మాటలు కాదు, ప్రజాస్వామ్య మనుగడకే పెను ప్రమాదం.
ఇలాంటి వ్యాఖ్యలు ఒక మాజీ ముఖ్యమంత్రి నోట రావడం చూస్తుంటే ఆయన మానసిక స్థితిపైనే తీవ్రమైన అనుమానాలు కలుగుతున్నాయి. ఇది రాజకీయ పరిపక్వత లేమిని, బాధ్యతారాహిత్యాన్ని స్పష్టంగా చాటిచెబుతోంది. ప్రజాస్వామ్యంలో విమర్శలు, ప్రతివిమర్శలు సహజం. కానీ, తనను అభిమానించే వారిని హింసకు ప్రేరేపించడం, ప్రత్యర్థులను “నరుకుతామని” చెప్పిన వారిని సమర్థించడం ఏ రకంగా సమంజసం? ఇది ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధం కాదా?
ఇది ఆయన ఫ్యాక్షనిస్టు నేపథ్యం నుంచి వచ్చిన దుష్ట వారసత్వానికి నిదర్శనమా? అహంకారంతో, అధికారాన్ని కోల్పోయిన ఆవేశంలో ఆయన ఇంత దిగజారి మాట్లాడుతున్నారా? గతంలో కూడా ఇలాంటి దౌర్జన్యపూరిత ఘటనలను, విద్వేషపూరిత వాతావరణాన్ని ప్రోత్సహించిన చరిత్ర ఆయనకు ఉంది. మొన్నటికి మొన్న తమ ఆస్థాన మీడియా ద్వారా మహిళలను వేశ్యలంటూ అగౌరవపరిచి, అలా మాట్లాడిన వారిని వెనకేసుకొని వచ్చారు.
ఇవ్వాళ ఇలాంటి హింసాత్మక వ్యాఖ్యలను సమర్థిస్తూ, పరోక్షంగా తన అనుచరులను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. ప్రజలను, వారికి ఓటు వేసినా వేయకపోయినా, మనస్ఫూర్తిగా తమ వారిగా చూసుకోవాల్సిన ఒక మాజీ ముఖ్యమంత్రి, ఇంతటి విద్వేషపూరిత, హింసాత్మక వ్యాఖ్యలను సమర్థించడం రాష్ట్ర భవిష్యత్తుకు అత్యంత ప్రమాదకరం.
ప్రజాస్వామ్యంలో ఎన్నికల ప్రక్రియ ద్వారా ప్రజాతీర్పును శిరసావహించాలి. అధికారాన్ని కోల్పోతే ఆత్మపరిశీలన చేసుకోవాలే తప్ప, ఇలాంటి రెచ్చగొట్టే, హింసను ప్రేరేపించే వ్యాఖ్యలు చేయడం అత్యంత హేయం. ఈయన రాజకీయాల కోసం ‘శవాలు కావాలనే’ తపన కనిపిస్తోంది. ఫ్యాక్షన్‌కు ఫ్యాక్షన్‌తో సమాధానం చెప్పినట్లుగా వీరి అభిమానులు రెచ్చగొట్టినట్లు, అధికారంలో ఉన్నవారు అదే విధంగా చేస్తే రాష్ట్రంలో అరాచకం తాండవిస్తుంది. ఇది ప్రజాస్వామ్య మూలాలనే కదిలిస్తుంది. ప్రజల మధ్య విద్వేషాలను పెంచి, శాంతి భద్రతలకు విఘాతం కలిగించే ఇలాంటి చర్యలను యావత్ సమాజం ముక్తకంఠంతో ఖండించాలి.
ఒకప్పుడు ఒకరికి ఒకరు ఎదురుపడని పెద్ద పెద్ద ఫ్యాక్షన్ కుటుంబాలు సైతం, రాష్ట్ర అభివృద్ధి కోసం కలిసిపోయి, ఆ పాత పద్ధతులను మానుకొని ప్రశాంతంగా పనిచేస్తున్న తరుణంలో, ఒక మాజీ ముఖ్యమంత్రి మళ్ళీ అదే ఫ్యాక్షన్ సంస్కృతిని ప్రోత్సహించడం సిగ్గుచేటు. ఓ వైపు ఫ్యాక్షన్ మాటలు, మరోవైపు నక్సలైట్లు అవుతారు అంటూ ఇలా రకరకాల బెదిరింపులు, బ్లాక్మెయిల్లూ చేస్తూ భయభ్రాంతులకు గురిచేయడం చూస్తుంటే.. ఆయన మానసిక స్థితికి ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేయడం తప్ప సామాన్యులు ఏమీ చెయ్యలేరు.
ప్రభుత్వం మాత్రం ఈయన పర్యటనలకు అనుమతి ఇచ్చే ముందు ఆయన మానసిక స్థితి గురించి ఒక డాక్టర్ సర్టిఫికేట్ అడిగి, అనుమతించి, రాష్ట్రంలో శాంతి భద్రతలను కాపాడాలని మనవి.