Suryaa.co.in

Andhra Pradesh

కుప్పంకు కృష్ణా జలాలు ముచ్చుమర్రి నుండి వచ్చే ఏర్పాటు చేశారా?

– ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఆంధ్రప్రదేశ్ సమగ్రాభివృద్ధి అధ్యయన వేదిక బహిరంగ లేఖ

కరవు పీడిత రాయలసీమ ప్రాంతంలోని మెట్ట ప్రాంతాలకు కృష్ణా నది వరద జలాలను శ్రీశైలం జలాశయం నుంచి తరలించడానికి హంద్రీ – నీవా సుజల స్రవంతి ప్రాజెక్టు మూడున్నర దశాబ్దాలుగా నిర్మాణంలో ఉన్నది. నంద్యాల జిల్లా, నందికొట్కూర్ మండలంలోని మల్యాల గ్రామం సమీపంలో నిర్మించిన ఎత్తిపోతల పథకం ద్వారా 40 టియంసిలను, 120 రోజుల్లో తరలించి, 6,02,500 ఎకరాలకు సాగునీరు అందించే పథకంగా హంద్రీ – నీవాను రూపొందించారు.

కృష్ణా నదిలో వరద ప్రవాహ రోజులు తగ్గిపోయాయని, హంద్రీ – నీవా ప్రధాన కాలువను ముచ్చుమర్రి నుంచి 6,300 క్యూసెక్కుల ప్రవాహ సామర్థ్యంతో జీడిపల్లి రిజర్వాయరు వరకు విస్తరిస్తామని, రు.6,502 కోట్ల వ్యయ అంచనాతో 2021 జూన్ 7న మీ ప్రభుత్వం జీ.ఓ.యం.ఎస్. నెం.29 జారీ చేసింది. కానీ, ఆచరణలో అడుగు ముందుకుపడలేదు.

కుప్పం బ్రాంచ్ కెనాల్ (ఉపకాలువ) హంద్రీ – నీవా సుజల స్రవంతి ప్రాజెక్టు వ్యవస్థలో చివరి భాగంలో ఉన్నది. హంద్రీ – నీవా ప్రధాన కాలువ 400.5 కి.మీ. వద్ద నుంచి పుంగనూరు ఉపకాలువ నిర్మించబడుతున్నది. ఆ పుంగనూరు ఉపకాలువ 207.8 కి.మీ. వద్ద నుంచి కుప్పం ఉపకాలువ నిర్మించబడుతున్నది. దాని పొడవు 123.641 కిలోమీటర్లు. అంటే, శ్రీశైలం జలాశయం నుంచి కృష్ణా నది వరద జలాలు మొత్తం 732 కి.మీ. దూరం ప్రయాణించాలి. హంద్రీ – నీవా ప్రధాన కాలువ ప్రవాహ సామర్థ్యాన్ని పెంచకుండా కుప్పం ఉపకాలువకు కృష్ణా వరద జలాలను ఎలా సరఫరా చేస్తారన్నది శేష ప్రశ్న.

మీరేమో, కుప్పంకు కృష్ణా నదీ జలాలను తీసుకొచ్చేశామని నిన్న గొప్పగా చెప్పుకొన్నారు. కుప్పం ఉపకాలువ ఆయకట్టుకు సాగునీరు, కుప్పం మరియు పలమనేరు శాసనసభ నియోజకవర్గాల ప్రజానీకానికి త్రాగునీటి సమస్య తీరిపోయిందన్న భ్రమ రాష్ట్ర ప్రజలకు కల్పించడం తీవ్రఅభ్యంతరకరం.

కుప్పం ఉపకాలువ ప్రవాహ సామర్థ్యం 216 క్యూసెక్కులు. కుప్పం ఉపకాలువపై మూడు ఎత్తిపోతల పథకాలు నిర్మించి, వాటి ద్వారా 110 చెరువుల క్రింద ఉన్న 6,300 ఎకరాల ఆయకట్టుకు సాగునీటిని, ప్రజలకు త్రాగునీటిని అందించాలి. ఈ లక్ష్యం త్వరితగతిన సాకారం కావాలని ప్రజలు ఏళ్ళతరబడి కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు.

కుప్పం ఉపకాలువ నిర్మాణం యొక్క అంచనా వ్యయం 2015-16 ధరల ప్రకారం రు.293.11 కోట్లు. అది కాస్తా రు.560.29 కోట్లకు పెరిగిందని, 2019 ఏప్రిల్ నాటికి ప్రభుత్వం చేసిన ఖర్చు రు.460.88 కోట్లని, మీరు అధికారంలోకి వచ్చే నాటికి మిగిలి ఉన్న పనుల విలువ రు.99.41 కోట్లని, నిన్న సాక్షి దినపత్రికలో వార్త చదివాను.

మీరు నిన్న కుప్పం ఉపకాలువ 70 కి.మీ. వద్ద నుండి కేవలం 350 ఎకరాల ఆయకట్టు ఉన్న నాలుగు చెరువులకు కొద్దిపాటి నీటిని లాంఛనంగా విడుదల చేశారు. అంటే, కుప్పం ఉపకాలువ మొత్తం నిర్మాణ పనులు పూర్తికాలేదని ఎవరికైనా బోధపడుతుంది. ప్రజలను వంచించడం ప్రభుత్వాధినేతలకు తగునా!

– టి. లక్ష్మీనారాయణ
ఆంధ్రప్రదేశ్ సమగ్రాభివృద్ధి అధ్యయన వేదిక

LEAVE A RESPONSE