Suryaa.co.in

Andhra Pradesh

చెప్పడం మా ధర్మం.. వినకపోతే మీ ఖర్మం!

– సీఎంకు బాలకోటయ్య చివరి బహిరంగ లేఖ

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి, అమరావతి బహుజన ఐకాస అధ్యక్షుడు చివరి బహిరంగ లేఖ

అయ్యా!
తమరు ఎన్నో ఆశలతో, కోరికలతో పాదయాత్రలతో, ఓదార్పు యాత్రలతో ముఖ్యమంత్రి పీఠం అధిరోహించారు.‌ ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు లెక్కకు మించిన హామీలు, వరాలు ఇచ్చారు.‌మొత్తం 1875 రోజుల మీ పరిపాలనా కాలం కూడా హారతి కర్పూరం గా కరిగి ఆఖరికి ఇంకనూ 30 రోజులు మాత్రమే మిగిలాయి. గతంలో అమరావతి బహుజన ఐకాస తరఫున నేను రాష్ట్రంలోని పరిస్థితులపై, రాజధాని పై, దళితులపై జరిగిన దుర్మార్గాల పై పలు మార్లు బహిరంగ లేఖలు రాశాను. ఇప్పుడు ఈ చివరి లేఖ రాస్తున్నాను.

ఈ 30 రోజుల్లోనైనా మీరు తీసుకున్న మహా తప్పదం వంటి మూడు రాజధానుల నిర్ణయాన్ని వెనక్కి తీసుకోండి. రాష్ట్రానికి ఒక రాజధాని ఉంటే చాలు, అది అమరావతి అని చెప్పండి. ఒకవైపు రైతుల సదీర్ఘ ఉద్యమం, న్యాయస్థానాల తీర్పుల నేపథ్యంలో సుప్రీం కోర్టులో వేసిన పిటీషన్ను ఉపసంహరించుకోండి. ఈ కొత్త నిర్ణయం ప్రజలకు, రైతులకు , మూడు ప్రాంతాలకు ఉపశమనం కలిగిస్తోంది.‌

వీటితోపాటు రాష్ట్రం ఎస్సీ, ఎస్టీలపై జరిగిన దాడులు , దౌర్జన్యాలు, హత్యలు, అత్యాచారాలను కూడా తమరి దృష్టికి తీసుకు వచ్చాము.డాక్టర్ సుధాకర్ నుండి డ్రైవర్ సుబ్రహ్మణ్యం వరకు, నంద్యాల నాగమ్మ నుంచి పులివెందుల మహా లక్ష్మీ వరకు అన్నింటిపై న్యాయ విచా‌రణకు ఆదేశించండి.‌ ప్రత్యేకంగా ఈ చివరి రోజుల్లో హోదా, పోలవరం, విశాఖ ఉక్కు వంటి అత్యవసర విభజన హామీలపై గొంతెత్తి ‘సిద్ధం’ అనండి. ఇలాంటి కీలకమైన నిర్ణయాలతో రాష్ట్రంలోని పాలనా పరిస్థితులు, ఆర్థిక పరిస్థితులు కుదుట పడతాయని, చెప్పటమే మా ధర్మం, వినకపోతే మీ ఖర్మం అవుతోందని తెలియజేస్తూ……

27 ఫిబ్రవరి,2024

– పోతుల బాలకోటయ్య
అమరావతి బహుజన ఐకాస అధ్యక్షులు

LEAVE A RESPONSE