ఆమె కనిపిస్తే
చీకటి నిండిన
సినిమా థియేటర్లలో
వెన్నెల వెలుగు..!
ఆమె కళ్ళు
భావాల లోగిళ్ళు..
ఆమె దరహాసం
మధురఫలాల రసం..
ఆమె అభినయం
ఆద్యంతం రమణీయం..
ఇవన్నీ చూస్తే అప్పటివరకు
గమ్మునుండే ప్రేక్షకుడిలో
ఓ చురుకు..
సినిమాకి ఉరుకు..!
రేఖ..అసలామె కెవ్వుకేక..
ఈ వయసులోనే ఇలా చెమట్లు పట్టిస్తున్నావంటే
ఆ రోజుల్లో
ఇంకెంత రంజుగా ఉందేదానివో..!
ఔను..నిజమే..
ఆమె పేరు చెబితేనే
ఒకనాటి కుర్రాళ్ళ గుండెల్లో
తీయని బాధ..
బొంబాయిలో నవ్వితే ఆమె..
ఇండియా మొత్తం విరహమే..
కొందరు హీరోల మధ్య కలహమే..!
మొన్నటికి మొన్న..
టివి షోలో ఆమె చిందేస్తే
అదరహో..
ఆరు పదులు దాటినా
ఆమె అభినయంలో అష్టపదులే…
ఏ వయసులోనైనా..
ఏ వయసువారినైనా మెప్పించడమే
ఆమె దందా
అందుకే జాతి మొత్తం
ఆమెకు ఫిదా..!
సినిమాల్లోకి వచ్చిన కొత్తలో
ఏం చేసినా
అమ్మకోసం..
తొలినాళ్ళలో
బొద్దుగా ఉన్నా
తిప్పేసింది రంగులరాట్నం
ఆ తర్వాత చిక్కి..
వలపుల వలలు విసిరి
తానయింది..
హసీనోంకా దేవతా
తన అందంతో ఏకం చేసింది
జమీన్ ఆస్మాన్!
నటించడం..
అలా నటిస్తూ పడగొట్టడమే
ఆమెకు తెలిసిన
ఏక్ హీ రాస్తా..
అలా రేఖ
మత్తులో పడి
అంతటి ఠాకూర్ సాబ్..
జై కూడా ఆమె చుట్టూ
చక్కర్ పే చక్కర్..!
రేఖ జీవితమే
ఆశనిరాశల సిల్ సిలా..
జయాపజయాల
మధ్య నలిగిన
సన్నని రేఖ..
కోట్లాది అభిమానుల
ప్రేమలేఖ..
కష్టాలను ఇట్టే కరగబెట్టిన
అగ్నిశిఖ…
ఎన్ని బాధలున్నా
ఆమె వదనం
ఖూబ్ సూరత్..
వివాదాలు ఎన్నున్నా
తను ఉమ్రావ్ జాన్!
సురేష్ కుమార్ ఇ
9948546286