Suryaa.co.in

Political News

విజనరీ చంద్రన్న

(లింగమనేని శివరామ ప్రసాద్)

సమాజంలో మార్పులు సహజం. ఆ మార్పులకు ప్రతిఘటనా అంతే సహజం. మానవ జాతి చరిత్ర సమస్తం ఇలాంటి మార్పులు ప్రతిఘటనల మయమే అనడం అతిశయోక్తి కాదు. సంస్కరణలది ఎప్పుడు ముళ్లబాటే. సంస్కర్తలు కష్టనష్టాలకు ఓర్చి సమాజంలో ఎన్నో మార్పులు తెచ్చారు. ఆదిలో ప్రతిఘటించినా తరువాత వాటి సహేతుకతను, ప్రయోజనాలను గుర్తించిన తరువాత ప్రజలు వాటిని ఆమోదిస్తారు.

కానీ దూరదృస్థితో సామాజిక కోణంలో అన్ని వర్గాలు అభివృద్ధి, సంక్షేమ పధంలో పురోగమించాలంటే సంస్కరణలు ఆవశ్యం. స్వచ్చంధ సేవకులు, సామాజిక వేత్తలు సంస్కరణలు,మార్పు కోసం ప్రయత్నిస్తారు కానీ, సహజంగా రాజకీయ నాయకులు సంస్కరణల తేనె తుట్టెను కదల్చి తమ రాజకీయ జీవితాన్ని ఫణంగా పెట్టరు. దీనికి భిన్నంగా ప్రజా ప్రయోజనం కోసం ఆర్ధిక, సామాజిక, పాలనాపరమైన సంస్కరణలు చేపట్టిన దార్శనికుడు, విజనరీ మన చంద్రబాబు నాయుడు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా తరువాత విభజిత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఆయన అమలుచేసిన సంస్కరణలు, విధానాల వలన ఉభయ తెలుగు రాష్ట్రాలు ఎంత అభివృద్ధి సాధించాయో అందరికి విదితమే.

బి ఎ చదువుతున్నప్పుడే ఆయన ‘వినాయక సంఘం’ పేరిట గ్రామాభివృద్ధి కమిటీలను ఏర్పాటు చేసి సామాజికాభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేవారు. 1972 ప్రాంతంలో జనాన్ని సమీకరించి అయిదున్నర కిలోమీటర్ల పొడవున – భీమవరం వరకు రోడ్డు వేయించారు. తరువాత కాలంలో ‘జన్మభూమి’ ఆవిర్భావానికి పునాది ఆనాడే పడింది. 1995 లో ఒక రాజ్యాంగేతర శక్తి బారి నుండి తెలుగుదేశం పార్టీని కాపాడుకునే
babu-ntr-sr నాయకులు, కార్యకర్తల ‘ పార్టీ పరిరక్షణ ఉద్యమం’ ఫలితంగా టీడీపి అధ్యక్షునిగా, రాష్ట్ర ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టిన నారా చంద్రబాబు నాయుడు అన్న ఎన్టీఆర్ ఆశయాలను కొనసాగించడమే కాకుండా శ్రమదానం, పచ్చదనం – పరిశుభ్రం, ప్రజల వద్దకు పాలన వంటి వినూత్న కార్యక్రమాల ద్వారా ప్రజలకు అభివృద్ధిలో భాగస్వామ్యం కలిపించారు.

ఈ కార్యక్రమాలన్నిటిని కలగలిపి ఒక ప్రజా ఉద్యమాన్ని తీసుకురావాలన్న ఆయన సంకల్ప ఫలితమే ‘ జన్మభూమి’ ఆవిర్భావం. ఆర్థిక అసమానతలు లేని ఆరోగ్యకరమైన, ఆనంద దాయకమైన అభ్యుదయాంధ్రప్రదేశ్‌ నిర్మాణమే కర్తవ్యంగా ఎంచుకొని 1997 జనవరి 1న జన్మభూమి కార్యక్రమాన్ని రూపొందించాడు చంద్రబాబు. శ్రమదానం, ప్రజల వద్దకు పాలన, మైక్రో లెవెల్ ప్లానింగ్ – అనే మూడు అంశాల మిశ్రమంగా జన్మభూమి కార్యక్రమం ఆవిర్భవించినా, అగ్రాసనం మాత్రం శ్రమదానానిదే. సమాజంలో పని సంస్కృతి ని పెంచాలనే లక్ష్యంతో ఉమ్మడి రాష్ట్రంలోని 60 వేల గ్రామాలలో ఒకేసారి ఈ కార్యక్రమాన్ని చేపట్టడం అద్భుతం, ఈ అద్భుతాన్ని సాకారం చేసింది నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు గారి విజన్.

ఆర్ధిక, పారిశ్రామిక రంగంలో క్రమశిక్షణ కోసం సుబ్రహ్మణ్యం కమిటీ సిఫారసుల ఆధారంగా కొన్ని కార్పొరేషనులను రద్దు చేయడం వంటి చర్యలు కార్మికులలో కొంతమేర అలజడికి, అశాంతికి కారణమయ్యాయి. ఇక విద్యుత్ బోర్డు పునర్వ్యవస్తీకరణ నిర్ణయం ఏటికి ఎదురీదడం వంటిది. విద్యుత్ సంస్కరణల వలన ప్రయోజనాలను ప్రజలకు విశదీకరించి వారి ఆమోదం పొందగలిగిన మేటి నాయకుడు చంద్రబాబు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ‘రైతు బజార్ల’ ఆవిర్భావం రాష్ట్ర చరిత్రలో ఒక నూతన అధ్యాయం. పంట పండించిన రైతుకు గిట్టుబాటు ధర రావడానికి, వినియోగదారునికి సరసమైన ధరలకు, తాజా సరుకులు లభించే విధంగా రాష్ట్రంలో రైతు బజార్లు ఏర్పడినాయి.

చంద్రబాబు గారి ఆలోచనతో ఏర్పడిన రైతు బజార్లు ఆనతి కాలంలోనే ప్రజాదరణ పొందాయి. మహిళల సాధికారిత కోసం, ఆర్ధిక స్వావలంబన కోసం నాడు ఏర్పాటు చేయబడిన డ్వాక్రా సంఘాలు దినదిన ప్రవర్ధమానమై నేడు దాదాపు 97 లక్షల మహిళలకు సహాయకారిగా ఉండటం చంద్రబాబు దార్శనికతకు నిదర్శనం. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే రహదారులు సౌకర్యవంతంగా ఉండాలనే ఆలోచనతో అనేక ప్రతిఘటనలు ఎదుర్కొని చంద్రబాబు ప్రభుత్వం సంకల్పించిన పట్టణాలు, రాష్ట్ర ప్రధాన రహదారుల విస్తరణ కార్యక్రమం కూడా ప్రజల మన్ననలు పొందింది.

ఆహార ధాన్యాల నిలువలు ఎక్కువగా ఉన్నందున వాటిని ధ్వంసం చేయాలనే కేంద్ర సంకల్పన్ని గ్రహించి, నాటి ప్రధాని వాజపేయిని ఒప్పించి, పనికి ఆహార పధకం ద్వారా బియ్యాన్ని పేదలకు అందించిన విజ్ఞుడు చంద్రబాబు.రాష్ట్ర అభివృధ్ధికోసం చిత్తశుద్ధితో చంద్రబాబు అమలు చేస్తున్న సంస్కరణలకు ప్రజామోదం లభించిన ఫలితంగా 1999 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ తిరిగి విజయం సాధించింది.

హైదరాబాద్ హైటెక్ సిటీ ఒక అంతర్జాతీయ సంచలనం.1998లో హైటెక్‌ సిటీని ప్రారంభించి, అనతి కాలంలోనే ఐటి రంగంలో అగ్రగామిగా నిలబెట్టి ఆంధ్రప్రదేశ్‌కు ప్రపంచ స్థాయిలో గుర్తింపును తెచ్చారు.ఈ ‘హైటెక్ సిటీ ‘ భవనాన్ని ప్రారంభిస్తూ ప్రధాని వాజపేయి ఐ.టి అంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీయే కాదు – ఇండియా టుమారో అని, దానికి మారుపేరు ‘సైబరాబాద్’ అని అంటూ చంద్రబాబు నాయుడు దార్శనికతను, కృషిని అభినందించారు.

నిజానికి చంద్రబాబు రాష్ట్రంలో ఐ.టి పరిశ్రమ అభివృద్ధికి చేసిన వ్యయం అతి స్వల్పం, కేవలం ఆయన కృషి, దార్శనికత మాత్రమే పెట్టుబడి. ఐ.టి పరిశ్రమకు అవసరమైన మంచి రోడ్లు, నిరంతర విద్యుత్ మరియు కమ్యూనికేషన్ సరఫరా, స్నేహపూర్వక వాతావరణం కలిపించారు. తాను స్వయంగా బిల్ గేట్స్ ను కలసి , మెప్పించి, ఒప్పించి, మైక్రోసాఫ్ట్ కార్పొరేషన్ హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంటు సెంటర్‌ను స్థాపించేటట్లు చేశారు చంద్రబాబు. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలోని సీయాటెల్ నగరంలో ఉన్న సంస్థ తరువాత ఇది రెండవ కేంద్రం.

చంద్రబాబు నాయుడు ఇతర ఐ.టి కంపెనీలను (ఐ.బి.ఎం., డెల్, డెలోఇట్ట్‌, కంప్యూటర్ అసోసియేట్స్ అండ్ ఓరాకిల్) హైదరాబాదులో నెలకొల్పడానికి ప్రోత్సాహాన్నందించారు. 1998 లో నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విజ్ఞత, కృషి వలన అతి తక్కువ పెట్టుబడితో కేవలం 200 ఎకరాలలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజి అభివృద్ధి కొరకు ఏర్పడిన హైటెక్ సిటి ఈరోజు 15000 ఎకరాల సైబరాబాద్ గా విస్తరించి ప్రపంచ పటంలో హైదరాబాద్ నగరానికి గుర్తింపు తీసుకురావడమే కాకుండా, తెలంగాణ రాష్ట్ర ఆర్ధిక వ్యవస్థకు మూల స్తంభంగా నిలుస్తోంది. కరోనా మహమ్మారి విజృభించిన తరుణంలో హైదరాబాద్ జీనోమ్ వ్యాలీలోని భారత్ బయోటెక్ , విశాఖ లోని మెడ్ టెక్ జోన్ కరోనా వాక్సిన్ తయారీలో మరియు పి పి ఈ కిట్ల తయారీలో ముందుండి మానవాళిని ఆదుకోగలిగాయంటే ముందు చూపుతో వాటి నిర్మాణానికి కృషి చేసిన చంద్రబాబు దార్శనికతే కారణం.

రాష్ట్ర విభజన జరిగిన క్లిష్ట తరుణంలో పాలనలో అనుభవజ్ఞుడైన చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ పాలనా పగ్గాలు చేపట్టారు. వ్యవసాయ ఆధారిత రాష్ట్రం కాబట్టి నీటి కష్టాలు అధిగమించా లనే ముందుచూపుతో.. పోలవరం సాకారం చేయాలనే లక్ష్యంతో.. తెలంగాణాలోని ఏడు ముంపు మండలాలను ఆంధ్రప్రదేశ్ లో విలీనం చేసిన తరువాతే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తానని షరతు పెట్టి సాధించి పోలవరం నిర్మాణానికి మార్గం సుగమం చేశారు.

అలాగే కృష్ణా నదిలో నీటి లభ్యత తగ్గుతున్న సమయంలో, పోలవరం నిర్మాణానికి కనీసం 5సం. పడుతుం దన్న విషయాన్ని గ్రహించి పట్టిసీమ పథకం ద్వారా కృష్ణా గోదావరి నదుల అనుసంధానం చేసి కృష్ణా డెల్టాలోని దాదాపు 13 లక్షల ఎకరాల సాగు భూములను స్థిరీకరించి, కృష్ణా డెల్టాకు ఇవ్వాల్సిన కృష్ణా నికరజలాలలో కొంత భాగం రాయలసీమకు మళ్ళించడం ద్వారా సీమ ప్రాంతానికి త్రాగు నీరు, సాగు నీరు అందించగలిగారు. తద్వారా వ్యవసాయం లో అధిక దిగుబడులు సాధించడం జరిగింది. రాష్ట్రానికి ఎంతో ఆదాయాన్ని సమకూర్చే కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాలోని చేపలు, రొయ్యల చెరువులకు పుష్కలంగా నీరు అందించి నీలి విప్లవం సాధించ గలిగాం.

వ్యవసాయ ప్రాధాన్యతను గుర్తించి సాగు నీటి ప్రాజెక్టులపై రూ 64 వేల కోట్లు ఖర్చు చేసి, 23 ప్రాజెక్టులను పూర్తి చేసి 32 లక్షల ఎకరాలకు సాగు నీరు అందించడం జరిగింది. చంద్రబాబు హయాంలో పోలవరం పరుగులెత్తితే, జగన్ రెడ్డి హయాంలో పోలవరం పడకేసింది. ఇప్పటికి కూడా కృష్ణా డెల్టా రైతులను ఆడుకుంటోంది చంద్రన్న సాధించిన పట్టిసీమే.

చంద్రబాబు ఏ బృహత్తర ప్రణాళిక సాధించాలనుకున్నా పెట్టుబడి ఆయన మేధస్సు, కృషి మాత్రమే, నిధుల పాత్ర స్వల్పమే. సైబరాబాద్ రూపకల్పనలో అమలు చేసిన విధానాన్ని రాజధాని అమరావతి నిర్మాణంలో కూడా అమలు చేశారు చంద్రబాబు. రాజధాని ‘అమరావతి’ కోసం రాష్ట్రం వద్ద నిధులు లేని తరుణంలో ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా .. రైతుల సహకారంతో.. భూ సమీకరణ విధానంలో 34 వేల 323 ఎకరాలు సమీకరించారు. దాదాపు రు 9165 కోట్లు ఖర్చుతో రాజధానికి కావలసిన ప్రాధమిక హంగులన్నీ అమరావతి లో ఏర్పాటు చేశారు.

దీనిలో రాష్ట్ర ప్రభుత్వ వాటా కేవలం రూ.1103 కోట్లు మాత్రమే. మొత్తం అమరావతి రెండు దశల ప్రణాళికల ప్రకారం పూర్తి చేసినా 16 ఏళ్లలో ప్రభుత్వ ఖర్చు షుమారు రూ. 14,000 కోట్లయితే, వివిధ పన్నుల రూపంలో ప్రభుత్వానికి తిరిగి వచ్చే ఆదాయం రూ. 45000 కోట్లు! రాజధాని పరిధిలో ప్రభుత్వ అధీనంలో ఉన్న షుమారు 51 వేల ఎ.ల భూమిలో ( భూసమీకరణ మరియు ప్రభుత్వ భూములు) దాదాపు లక్షన్నర కోట్ల విలువైన 10 వేల ఎకరాల ల్యాండ్ బ్యాంక్ నికరంగా ప్రభుత్వానికి మిగులుతుంది.దీనిని బట్టి చూస్తే అమరావతికి రాష్ట్రం ఖర్చు చేయడం కాదు .. రాష్ట్రానికే అమరావతి సంపద సృష్టించి పెడుతోంది, ఇదీ చంద్రన్న దార్శనికత!

తన దార్శనికతతో రాష్ట్రానికి సంపద సృష్టించడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య. ఒక దార్శనికుడు, ఒక నిత్య కృషీవలుడు, ఒక విజనరీ జన్మదిన సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ, ఆయన నాయకత్వంలో పనిచేయడం మనందరి అదృష్టంగా భావిస్తున్నా. రాష్ట్ర పురోభివృద్ధి కోసం చంద్రన్న నాయకత్వం అనివార్యం, దాని సాకారం కోసం మనందరం పునరంకితం కావాలి. కృషితో నాస్తి దుర్భిక్షం.

LEAVE A RESPONSE