Suryaa.co.in

Features

గుండె పగిలిన హిందువులు

– నిలదీసి ప్రశ్నించి నిరసనలు

రిజర్వేషన్ల అంశంపై మొదలైన వివాదం మతవిద్వేషంగా రూపుదాల్చి బంగ్లాదేశ్‌లోని హిందువులపై విచక్షణారహితంగా జరిగిన దాడులు, అత్యాచారాల వీడియోలు, ఫొటోలు, వార్తలను మీడియాలోను, సోషల్ మీడియాలోను చూసిన ప్రపంచ హిందూ సమాజం గుండె చెరువైంది.

ఏ హిందూ ప్రజలైతే 50 ఏళ్ల కిందట ప్రత్యేక బంగ్లాదేశ్ దేశ ఏర్పాటుకు అండగా నిలిచారో ఆ హిందువులపైనే జరిగిన హింసాకాండ, దారుణ మారణకాండను చూచిన హిందువులు… మానవత్వపు ఛాయలు ఏమాత్రం లేని ఛాందసవాద ముస్లింల తీరుపై తీవ్రస్థాయిలో మండిపడుతూ నిరసనలు తెలియజేస్తున్నారు.

బంగ్లాదేశ్‌లో ఇప్పుడు ఎక్కడ చూసినా రక్తమోడుతున్న బాధిత హిందూ స్త్రీ, పురుషుల ఆర్తనాదాలే… మంటల్లో కాలి ధ్వంసమైన కష్టార్జితాన్ని చూసి కన్నీటి కడలిలో మునిగిపోయి రక్షించండంటూ చేస్తున్న రోదనలు మిన్నంటుతున్నాయి. హిందువుల భవిష్యత్తును కళ్లకు కట్టినట్టు చూపించిన ఈ పరిణామాలతో మేలుకున్న వివిధ దేశాలలోని హిందువులు పెద్ద సంఖ్యలో రోడ్లమీదికి వచ్చారు… ఇస్లాం పేరిట సాగుతున్న నరమేధాన్ని తీవ్రస్థాయిలో నిరసించారు.

అమెరికాలోని హ్యూస్టన్ నగరంలో ఉన్న సుగర్ ల్యాండ్ సిటీ హాలులో దాదాపు 300 మందికి పైగా ఇండియన్ అమెరికన్స్, బంగ్లాదేశ్ సంతతి హిందువులు పాల్గొని ఇస్లామిక్ ఛాందసవాదుల ఘోరాలపై “Save Hindus in Bangladesh” అంటూ తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. అమెరికాలోని Maitri, Vishwa Hindu Parishad of America, Hindu Action, Hindu Pact, Houston Durgabari Society, ISKCON, Global Kashmiri Pandit Diaspora తదితర సంస్థలన్నీ కలసి Global Voice for Bangladesh Minorities పేరిట సంస్థగా ఏర్పడి ఈ నిరసన కార్యక్రమాన్ని నిర్వహించాయి.

న్యూయార్క్‌లోని టైమ్స్ స్క్వేర్ వద్ద ఒక బాలిక బంగ్లాదేశ్ హిందువులకు మద్దతుగా ప్రసంగించి చైతన్యాన్ని రగిలించే ప్రయత్నం చేసింది. హిందువులపై మారణకాండ ఆపాలని, ఆలయాలను ధ్వంసం చెయ్యవద్దని, న్యాయం జరగాలని ఆమె నినదించింది. భారతదేశపు విశ్వవిద్యాలయాల ప్రాంగణాలలో హిందూ చైతన్యాన్ని ఎప్పుడు చూడగలమనే ప్రశ్నను ఈ పరిణామం లేవనెత్తింది.

యుఎస్‌లోని ప్రముఖ నగరం కాలిఫోర్నియా రాష్ట్ర రాజధాని శాక్రమెంటోలోనూ బంగ్లాదేశ్ హిందువులకు మద్దతుగా మాట్లాడాలని స్థానిక, రాష్ట్ర, జాతీయ స్థాయి ప్రజాప్రతినిధులను హిందూ అమెరికన్ ఫౌండేషన్ నేతలు కోరారు.

కెనడాలోని టొరంటో నగరం డౌన్‌టౌన్‌లోను, డెటోనియా పార్క్ వద్ద భారీ సంఖ్యలో హిందువులు చేరుకుని బంగ్లాదేశ్ హిందువులకు సంఘీభావం తెలిపారు. బంగ్లాదేశ్ హిందువుల పట్ల జరుగుతున్న అకృత్యాలను తీవ్రంగా వ్యతిరేకిస్తూ అక్కడి హిందువులకు మద్దతుగా నిలవాలని కెనడా ప్రభుత్వాన్ని కోరారు.

బ్రిటన్‌లో సైతం వివిధ ప్రాంతాలకు చెందిన హిందువులు సమావేశమై బంగ్లాదేశ్ హిందువులకు మద్దతుగా నిలిచారు. UNతో పాటుగా భారత్‌లోని మానవహక్కుల సంఘ కార్యకర్తలు, ప్రతిపక్షాలు, కొన్ని మీడియా సంస్థలు ఈ పరిణామాలపై మానవతా స్పందనను సైతం వ్యక్తం చెయ్యకపోవడాన్ని ఖండించారు.

న్యూయార్క్‌లోని ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యాలయం బయట కూడా బంగ్లాదేశ్ హిందువులు సహా మైనార్టీలకు రక్షణ కల్పించే దిశగా చర్యలు తీసుకోవాలని ఆందోళనకారులు గళమెత్తారు. న్యూయార్క్ నగరంలోని మరి కొన్ని ప్రాంతాలలో కూడా నిరసనలు జరిగాయి. వాషింగ్టన్ కేంద్రంగా పని చేసే HinduACTion అనే సంస్థ నిర్వహించిన నిరసన కార్యకలాపాల్లో వివిధ వర్గాలకు చెందిన హిందువులు పాల్గొని హిందూ సమాజ పరిరక్షణ ఆవశ్యకతను స్పష్టం చేశారు.

ఫిన్లాండ్ దేశంలోని హిందూ సంస్థలు కూడా బంగ్లాదేశ్ పరిణామాలపై స్పందించి ఆందోళన ప్రదర్శనలను నిర్వహించాయి. బంగ్లాదేశ్ హిందువులకు మద్దతుగా అక్కడి పరిణామాలను వివరిస్తూ, ప్రజలను అప్రమత్తం చేస్తూ ప్రకటనను విడుదల చేశాయి.

బంగ్లాదేశ్ హిందూ సమాజానికి మద్దతుగా వివిధ దేశాలలోని హిందువులు పెద్ద సంఖ్యలో తమ నిరసనగళాన్ని వినిపించగా… మరోవైపు బంగ్లాదేశ్ హిందువులు సైతం అంతటి కష్టం, బాధలోనూ తమ కర్తవ్యాన్ని గుర్తెరిగి సమైక్యతతో రోడ్లపైకి వచ్చారు. ఛత్రగ్రామ్ ప్రాంతంలో ఇస్కాన్ ఆలయమైన పుండరీక్ ధామ్ ఆలయ సాధువు చిన్మయ్ కృష్ణ దాస్ ప్రభు హిందూ నిరసనకారులను ఉద్దేశించి ప్రసంగించారు.

సుమన్‌గంజ్ ప్రాంతంలో పెద్ద ఎత్తున నిరసన ర్యాలీ జరిగింది. రంగ్‌పూర్ జిల్లా తారాగంజ్ ఉప్ జిల్లాలో పెద్ద ఎత్తున నిరసనలు జరిగాయి. బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో షహీద్ మినార్ వద్ద హిందువులు మానవహారంగా ఏర్పడి దాడులను నిలదీశారు. నీల్‌ఫమారీ జిల్లాలోనూ నిరసన దృశ్యాలు కనిపించాయి.

మరోవైపు స్వదేశంలో… దేశరాజధాని ఢిల్లీ సహా అయోధ్య, వారణాసి, కలకత్తా తదితర ప్రముఖ నగరాలు, పట్టణాలతో పాటు వివిధ రాష్ట్రాలలో పట్టణాలు, గ్రామాల స్థాయిలో బంగ్లాదేశ్ హిందువులకు మద్దతుగా ర్యాలీలు, ప్రదర్శనలు ప్రారంభమయ్యాయి. చాలాచోట్ల విశ్వహిందూ పరిషత్ (విహెచ్‌పీ), హిందూ సురక్షా మంచ్, జన్ జాగరణ్ పథ్‌సభ వంటి సంస్థల నేతృత్వంలో ప్రదర్శనలను నిర్వహించారు. ఢిల్లీలోని జెఎన్‌యు (JNU)లో విద్యార్థులు బంగ్లాదేశ్ హిందువులకు మద్దతుగా కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు.

పశ్చిమ బెంగాల్‌లో పలువురు బెంగాలీ మేధావులు, పరిశోధకులు సైతం ముందుకువచ్చి బంగ్లాదేశ్‌లో హిందువులపై జరిగిన మారణకాండను నిరసించారు. ఇంకా యూపీ, రాజస్థాన్, మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్, అస్సాం, ఉత్తరాఖండ్ ఝార్ఖండ్, త్రిపుర, హర్యానా తదితర రాష్ట్రాలలో హిందువులు ఆందోళనలు నిర్వహించారు.

ఇలా బంగ్లాదేశ్ హిందువులకు మద్దతుగా యావత్ ప్రపంచంలోని హిందువులు క్రమక్రమంగా సంఘటితం అవుతున్నప్పటికీ హిందువుల రక్షణ కోసం వీరి మధ్య ఐక్యత దిశగా జరగాల్సింది ఇంకా చాలా ఉందన్న అభిప్రాయం బలంగా వినిపిస్తోంది.
– విశ్వసంవాదకేంద్ర సౌజన్యంతో

LEAVE A RESPONSE