Suryaa.co.in

Telangana

వరి విత్తన విక్రయాలపై హైకోర్టు రిలీఫ్

– సిద్దిపేట కలెక్టర్ పై కోర్టు ధిక్కరణ చర్యలకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సిఫారసు
– వరి విత్తన విక్రయాలపై కోర్టు తీర్పును స్వాగతించిన బిజెపి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్..
వరి విత్తనాలు అమ్మితే షాపు సీజ్ చేసి లైసెన్స్ రద్దు చేస్తానని, నేను ఉన్నంత వరకు మళ్లీ షాప్ తెరిచే అవకాశం కూడా ఉండదంటూ సిద్దిపేట జిల్లా కలెక్టర్ వెంకట్రామిరెడ్డి చేసి వ్యాఖ్యలపై రాష్ట్ర హైకోర్టు తప్పుపట్టింది.
వరి విత్తనాలు అమ్మే విషయంలో హైకోర్టు , సుప్రీంకోర్టు చెప్పినా తాను వినను అని కలెక్టర్ చేసిన వ్యాఖ్యలు కోర్టు ధిక్కరణగా తాను భావిస్తున్నానని దీనిపై చర్య తీసుకోవాల్సిందిగా హైకోర్టు ఏకసభ్య ధర్మాసనం ఈ విషయాన్ని రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి నివేదించింది. రైతులను భయపెట్టేలా, వరి విత్తనాల వ్యాపారులను బెదిరిస్తూ వెంకట్రామరెడ్డి చేసిన వ్యాఖ్యలపై సిద్దిపేటకు చెందిన రైతు బత్తుల నారాయణ హైకోర్టును ఆశ్రయించారు.
మంగళవారం జస్టిస్ వినోద్ కుమార్ సారథ్యంలోని ఏక సభ్య బెంచ్ ఆయన పిటిషన్ ను విచారించింది..సిద్దిపేట కలెక్టర్ చేసిన వ్యాఖ్యలను తప్పు బడుతూ ఈ వాజ్యాన్ని స్వీకరించి వరి విత్తనాలను లైసెన్స్ ఉన్న ఎవరైనా అమ్ముకోవచ్చని వ్యాపారులకు అభయమిచ్చింది. వరి విత్తనాల విక్రయాన్ని ఆపేందుకు ఎలాంటి నిబంధనలు లేవని స్పష్టం చేసింది.
కలెక్టర్ వ్యాఖ్యలను కోర్టు తప్పుబట్టడాన్ని బిజెపి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ స్వాగతించారు. అధికార పార్టీకి లాలూచీగా వ్యవహరించి రైతులను భయభ్రాంతులకు గురి చేస్తున్న అధికారులు శిక్షకు అర్హులని సంజయ్ చెప్పారు. గౌరవ కోర్టు సిద్దిపేట జిల్లా కలెక్టర్ ను తప్పుబట్టడంతో న్యాయం బతికే ఉందని మరోసారి నిరూపితమైందన్నారు.
రైతు బత్తుల నారాయణ తరఫున బిజెపి లీగల్ సెల్ న్యాయమూర్తి చిన్నోళ్ల నరేశ్ రెడ్డి అద్భుతంగా వాదించారని సంజయ్ అభినందించారు.ఇకనైనా అధికారులు నిబంధనలకు లోబడి వ్యవహరించాలని సంజయ్ సూచించారు. అధికార పార్టీకి కొమ్ము కాసేలా వ్యవహరించి ప్రజలకు నష్టం కలిగిస్తే భవిష్యత్ లో వాళ్లను ఎవరూ కాపాడలేరన్న విషయాన్ని గుర్తించుకోవాలి బిజెపి చీఫ్ హెచ్చరించారు.

LEAVE A RESPONSE