Home » మమత వ్యూహానికి హైకోర్టు మొట్టికాయ.. ఎందుకలా?

మమత వ్యూహానికి హైకోర్టు మొట్టికాయ.. ఎందుకలా?

(రఘువంశీ)

కలకత్తా హైకోర్టు నిన్న ఒక తీవ్రమైన తీర్పు ఇచ్చింది. ఏ తరగతినైనా OBCగా వర్గీకరించే రాష్ట్ర అధికారాన్ని నియంత్రించే 2012 స్కీమ్‌లో “శాసన విధానం” పూర్తిగా లేకపోవడాన్ని బెంచ్ ఎత్తి చూపించి, బెంగాల్ ప్రభుత్వం 2010 నుండి ఇప్పటివరకు ఇచ్చిన సుమారు 5 లక్షల ఓబీసీ సర్టిఫికెట్లు అన్నిటినీ రద్దు చేసింది.

అయితే, ఈ సర్టిఫికెట్లు ఆధారంగా ఇప్పటికే ఉద్యోగం పొంది ఉద్యోగాల్లో ఉన్నవారు అలాగే సెలెక్ట్ అయ్యి ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న వారికి ఈ ఉత్తర్వులు వర్తించవని తీర్పు లో పేర్కొంది. ఇకపై ఆ సర్టిఫికెట్లను ప్రభుత్వ ఉద్యోగాలకు అప్లై
చేయడానికి ఉపయోగించకూడదు అని చెప్పింది. అలాగే 2010 ముందు వాటికి ఈ తీర్పు వర్తించదు అని కూడా పేర్కొంది.

ఎందుకు హై కోర్ట్ ఈ ఉత్తర్వులు ఇవ్వవలసి వచ్చింది అంటే 2012లో మమత ప్రభుత్వం ఓబీసీ రిజర్వేషన్లు చేస్తూ దానిలో 77 ముస్లిం వర్గాలను ఓబీసీ లుగా గుర్తించి ఓబీసీ కేటగిరీలో లో కలిపేసింది.

అయితే ఇలా ఈ ముస్లిం వర్గాలను ఓబీసీ కేటగిరీ లో చేర్చడానికి ఎటువంటి సర్వే నిర్వహించలేదు మరియు అలా చేర్చడానికి ఎటువంటి ఆధారాలు చూపలేదు.

బెంగాల్ ప్రభుత్వం జారీ చేసిన 2012 చట్టం ప్రకారం ఓబీసీ గుర్తింపు పద్దతి సరికాదు అందువలన ఆ గుర్తింపు పద్దతి రద్దు చేయాలి అంటూ కలకత్తా హై కోర్ట్ లో పిల్ దాఖలు చేయబడింది.

ఈ పిల్ పై తీర్పు ఇస్తూ ఇలా 77 తరగతుల ముస్లింలను వెనుకబడిన వారిగా ఎంపిక చేయడం మొత్తం ముస్లిం సమాజాన్ని అవమానించడమే. ఈ సమాజం రాజకీయ ప్రయోజనాల కోసం ఒక వస్తువుగా పరిగణించబడిందనే సందేహం వస్తోందని, 77 తరగతులను ఓబీసీలుగా వర్గీకరించి, వారిని ఓటు బ్యాంకుగా పరిగణించేందుకు దారితీసిన సంఘటనల గొలుసును బట్టి ఇది స్పష్టమవుతుంది’’ అని కోర్ట్ ఉత్తర్వుల్లో పేర్కొంది.

అందువల్ల 2010 తర్వాత జారీ చేసిన అన్ని ఓబీసీ సర్టిఫికెట్స్ ని రద్దు చేయడమే కాక, 1993 లో బెంగాల్ ప్రభుత్వం జారీ చేసిన ఓబీసీ కమిషన్ చట్టం ఆధారంగా మళ్ళీ కొత్తగా ఓబీసీ వర్గీకరణ చేపట్టి మార్పులు చేర్పులు చేసి సర్టిఫికెట్లు జారీ చేయలి అని చెప్పింది. అలా తయారు అయిన లిస్ట్ ని రాష్ట్ర అసెంబ్లీలో పెట్టి అసెంబ్లీ అనుమతి తీసుకున్న తరువాతే ఫైనల్ లిస్ట్ ని ప్రకటించాలి అని కోర్టు ఆదేశించింది. మమత మాత్రం కోర్టు ఇచ్చిన ఈ తీర్పు ని మేం అమలు చేయం. పై కోర్టు కు పోతాం అని చెప్పింది.

Leave a Reply