Home » పిన్నెల్లిని పట్టుకోలేరా?.. హవ్వ! వీళ్లేం పోలీసులు?

పిన్నెల్లిని పట్టుకోలేరా?.. హవ్వ! వీళ్లేం పోలీసులు?

– సోషల్‌మీడియాలో పోస్టింగులు పెట్టిన వారిని వేరే రాష్ట్రానికి వెళ్లి మరీ పట్టుకొచ్చారే?
– ఎంపి రఘురామకృష్ణంరాజును అర్ధరాత్రి అరెస్టు చేశారే?
– జగన్‌పై రాయి వేసిన వారిని గుర్తించారే?
– మరి పిన్నెల్లిని మాత్రం పట్టుకోలేరా?
– ఆయన ఫోన్లపై ఇంటలిజన్స్ నిఘా ఉండదా?
– ఆరోజే పోలింగ్ ఆఫీసర్ ఎందుకు ఫిర్యాదు చేయలేదు?
– ఈవీఎం ధ్వంసంపై సీఈఓ ఎందుకు ప్రకటన చేయలేదు?
– మీడియాలో వచ్చేవరకూ పోలీసు-ఈసీ నిద్ర పోతోందా?
– పిన్నెల్లి విధ్వంసాన్ని సిట్ ఎందుకు గుర్తించలేదు?
– పిన్నెల్లికి పోలీసు బాసులే సహకరిస్తున్నారా?
– హైదరాబాద్‌లో పిన్నెల్లికి ఓ మీడియా సంస్థ సహకరించిందా?
– జాతీయ స్థాయిలో ఏపీ పోలీసు పరువు పోయిందా?
– సోషల్‌మీడియాలో పోలీసు-ఈసీపై విమర్శల వర్షం
( మార్తి సుబ్రహ్మణ్యం)

పోలింగ్‌బూత్‌లోకి వెళ్లి ఈవీఎంను ధ్వంసం చేసి.. అడ్డుకున్న పోలింగ్ ఏజెంట్‌పై హత్యాయత్నం చేసి.. తిరగబడిన మహిళలను బూతులు తిట్టిన మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడిని పట్టుకోవడంలో ఏపీ పోలీసులు విఫలమయ్యారా? జగన్ సర్కారుకు వ్యతిరేకంగా సోషల్‌మీడియాలో పోస్టింగులు పెట్టిన వారిని.. సరిహద్దులు దాటి అరెస్టు చేసిన పోలీసులు, పిన్నెల్లిని అరెస్టు చేయడంలో చేతులెత్తేశారా? జగన్‌పై రాయి దాడి చేసిన వారిని దుర్భిణి వేసి పట్టుకున్న ఆంధ్రా పోలీసులు, హైదరాబాద్ పరారయిన పిన్నెల్లి ఎక్కడున్నారో కనిపెట్టలేరా? ఖాకీల ఇంటలిజెన్సీ అంద మందగించిందా? అసలు పోలీసుశాఖలోని ఒక వర్గమే పిన్నెల్లిని రక్షిస్తోందా?

హైదరాబాద్‌లో పిన్నెల్లికి వైసీపీకి అనుబంధ చానెల్ ఆశ్రయమిచ్చిందా? ఆ చానెల్ వాహనాల్లో పిన్నెల్లి స్వేచ్ఛగా సంచరించారా? దేశం దాటేందుకు ఆ ఛానెల్ ప్రతినిధి సహకరించారా? ఫోన్ నెంబర్లపై కన్నేసి ఆనుపానులు కనిపెట్టాల్సిన నిఘా విభాగం, పిన్నెల్లి ఎక్కడుందో తెలుసుకోలేనంత మొద్దు నిద్ర పోతుందా? అంటే అధికార పార్టీ ఎమ్మెల్యేకు పోలీసులే సహకరిస్తున్నారా?.. ఇవీ మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్టు అంశంలో, పోలీసుల వైఫల్యంపై సోషల్‌మీడియాలో వె ల్లువెత్తుతున్న దాడి.

పోలింగ్ స్టేషన్‌లో ఈవీఎంను ధ్వంసం చేసి, అడ్డుకున్న బూత్ ఏజెంట్‌పై గొడ్డలితో దాడి చేసిన మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్టులో పోలీసుల వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోంది. ఆ మేరకు పోలీసుల నిర్లక్ష్యంపై సోషల్‌మీడియా వేదికగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

అర్ధరాత్రివరకూ అందిన సమాచారం ప్రకారం.. పిన్నెల్లిని అరెస్టు చేశారన్న పుకార్లు తప్ప, అధికార ప్రకటన వెలువడనే లేదు. ఆయన తన గన్‌మెన్, డ్రైవర్‌ను విడిచిపెట్టి, ఒక ఫ్యాక్టరీ గెస్టుహౌస్‌లో తలదాచుకున్నాడని, హైదరాబాద్‌లో పిన్నెల్లి.. వైసీపీకి అనుబంధ మీడియాగా వ్యవహరిస్తున్న ఒక పెద్ద చానెల్ వాహనంలోనే స్వేచ్ఛగా తిరిగారని, అందుకు అందులో పనిచేసే ఒక సీనియర్ జర్నలిస్టు సహకరించారన్న వార్తలు సోషల్‌మీడియాలో హల్‌చల్ చేశాయి. తర్వాత నేపాల్, లేదా దుబాయ్ పారిపోయేందుకు పిన్నెల్లి చేసుకున్న ఏర్పాట్లను, ఆయనే భయంతో రద్దు చేసుకున్నారన్న వార్తలు వెలువడ్డాయి. ఇప్పుడు పిన్నెల్లి ఎక్కుడున్నారన్నది భేతాళ ప్రశ్న.

మరోవైపు పిన్నెల్లి దాదాగిరిపై సీఈసీ కన్నెర్ర చేసింది. ఆయనపై 10 కేసులు నమోదుచేసి, లుకౌట్ నోటీసు జారీ చేసింది. ఇది సిగ్గుమాలిన చర్యగా అభివర్ణించడం అటు పోలీసు శాఖకు, ఇటు సీఈఓ పనితీరుపై చెంపపెట్టు. సూటిగా చెప్పాలంటే ఇది ఏపీ అధికార వ్యవస్థకే సిగ్గుచేటు. నిజానికి ఘటన జరిగిన రోజు ఈవీఎం పగలకొట్టారని పోలింగ్ ఆఫీసర్ ఎందుకు ఫిర్యాదు చేయలేదు?

గ్రామంలోనే ఉండే వీఆర్‌ఓ గుర్తు తెలియని వ్యక్తులపై ఫిర్యాదు ఇవ్వడమే వింత. పోలింగ్‌బూత్ సిబ్బంది నుంచి వివరాలు తీసుకుని, వీఆర్‌ఓ నివేదిక ఎందుకు ఇవ్వలేదు? ఇప్పటిదాకా అక్కడ భద్రతకు బాధ్యత వహించిన పోలీసులు, వారిని పర్యవేక్షించే పోలీసు ఉన్నతాధికారులపై ఎందుకు చర్యలు తీసుకోలేదు?

పిన్నెల్లి ఈవీఎంను పగలకొట్టారని సంబంధిత పోలీసు అధికారి డీఎస్పీ, జిల్లా ఎస్పీకి నివేదిక ఎందుకు ఇవ్వలేదు? విచారణకు వెళ్లిన సిట్ అధికారులు ఈ దౌర్జన్యాన్ని ఎందుకు గుర్తించలేదు? చెదురుమదురు సంఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగా జరిగిందని చెప్పిన సీఈఓ ముఖేష్‌కుమార్, మాచర్ల ఘటన గురించి మీడియాకు అదేరోజు ఎందుకు చెప్పలేదు? అంటే అప్పటికి ఆ సమాచారం ఆయనకు తెలియదా? మీడి యాలో వచ్చిన తర్వాతనే మేల్కొన్నారంటే, అప్పటివరకూ పోలీసులు-ఈసీ నిద్రపోయినట్లే కదా? అని నెటిజన్లు సోషల్‌మీడియాలో ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.

నిజానికి నిందితులను పట్టుకోవటం పోలీసులకు పెద్ద పనికాదు. కానీ చిత్తశుద్ధి ఉండాలంతే! అదిలేకనే పిన్నెల్లి దర్జాగా రాష్ట్రం విడిచిపోయినట్లు కనిపిస్తోంది. పోలీసులు అనుకుంటే పిన్నెల్లి గన్‌మెన్‌ను విచారిస్తే,ఆయన కదలికలు తెలిసిసోయేవి. అదికాదంటే పిన్నెల్లి సెల్‌ఫోన్‌ను ట్రాక్ చేయవచ్చు. అది కూడా చేయలేదు.

సహజంగా ఎవరైనా నిందితుడు పారిపోతే, వారి కుటుంబసభ్యులను పోలీసుస్టేషన్లకు తీసుకువచ్చి వేధించే పోలీసులు.. పిన్నెల్లి విషయంలో ఆ పని ఎందుకు చేయలేదన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. వైసీపీ ప్రత్యర్ధుల ఫోన్లపై నిఘా వేసేంత శ్రద్ధ, పిన్నెల్లి ఎక్కడున్నారో తెలుసుకుంటే ఆయన ఎప్పుడో అరెస్టయ్యేవాడని మాజీ ఐపిఎస్ అధికారి ఒకరు వ్యాఖ్యానించారు.

‘ఈ ఘటనలో అందరి వైఫల్యం ఉంది. సీఎస్ కూడా పట్టించుకోలేదు. డీజీపీ కూడా సీరియస్‌గా తీసుకోలేదు. పిన్నెల్లి ఫోన్ ట్రాక్ చేసి ఎక్కడున్నారో పట్టుకోవాలన్న పట్టుదల అటు ఇంటలిజన్స్ చీఫ్‌లో కూడా కనిపించలేదు. హైదరాబాద్‌లో పిన్నెల్లి స్వేచ్ఛగా తిరుగుతున్నారని మీడియాలో వస్తున్నా, అక్కడ ఆయనకు సహకరిస్తున్న వారెవరో కనిపెట్టడంలో పోలీసులు విఫలమయ్యారని’ ఆ మాజీ ఐపిఎస్ అధికారి వ్యాఖ్యానించారు.

గతంలో సీఎం జగన్‌కు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసిన ఎంపీ రఘురామకృష్ణంరాజును.. హైదరాబాద్ నుంచి అర్ధరాత్రి తెచ్చిన పోలీసులు, ఇప్పుడు అదే హైదరాబాద్‌లో ఉన్న పిన్నెల్లిని ఎందుకు అరెస్టు చేయలేకపోయారన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. జగన్‌పై కామెంట్లు పెట్టే వారిని ఎక్కడున్నా తెచ్చి అరెస్టు చేసే పోలీసులు, ఈవీఎంను పగలకొట్టిన పిన్నెల్లిని కూడా, అంతే అత్యుత్సాహంతో ఎందుకు అరెస్టు చేయలేదని సోషల్‌మీడియాలో నెటిజన్లు నిలదీస్తున్నారు.

కాగా డీజీపీ, ఇంటలిజన్స్‌చీఫ్, కొందరు ఎస్పీలు, ఇంకొందరు కలెక్టర్లను మార్చినప్పటికీ.. అధికార యంత్రాంగం అంతా అధికార పార్టీకే సాగలబడిందన్నది పోలింగ్ అనంతర ఘటనలు స్పష్టం చేస్తున్నాయి. ‘‘అసలు సీఎస్ జవహర్‌రెడ్డి దీనికి బాధ్యత వహించాలి. ఆయనను మార్చనందుకే ఈ ఘటనలు జరుగుతున్నాయి. ఆయన అండ లేకపోతే ఇలాంటి సంఘటనలు జరిగేవా? ఇప్పటి డీజీపీ కూడా మెతకవైఖరి అవలంబిస్తున్నారు. ఈ మొత్తం పరిణామాలకు సీఎస్-డీజీపీ-సీఈఓ బాధ్యత వహించాల’’ని మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు డిమాండ్‌ చేశారు.

Leave a Reply