పవన్‌పై పోటీకి దిగేదెవరు?

– పిఠాపురం నుంచే పవన్ పోటీ
– లోక్‌సభకు పోటీచేయనట్లే?
– పవన్‌పై వైసీపీ పోటీకి దిగేదెవరు?
– వైసీపీ పరిశీలనలో ముద్రగడ, వంగాగీత
– తనయుడికి సీటు అడుగుతున్న ముద్రగడ
– గీతనే బెటరంటున్న వైసీపీ శ్రేణులు
– ముద్రగడకు కాపుల్లో ఇమేజ్ లేదంటున్న వైసీపీ కాపులు
-వ్యూహత్మకంగా పిఠాపురంను ఎంచుకున్న పవన్
– పిఠాపురంలో 90 వేలకు పైగా కాపు ఓటర్లు
– 80 వేలకు పైగా బీసీ ఓటర్లు
– గత ఎన్నికల్లో వైసీపీకి 83 వేల ఓట్లు
– టీడీపీ-జనసేనకు కలిపి 96 వేల ఓట్లు
– ఆ లెక్కలతోనే అక్కడ బరిలోకి దిగిన జనసేనాధిపతి?
( మార్తి సుబ్రహ్మణ్యం)

జనసేన దళపతి పవన్ కల్యాణ్ పిఠాపురం అసెంబ్లీ నుంచి పోటీ చేయడం ఖాయమయింది. గత అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను బేరీజు వేసుకున్న తర్వాతనే పవన్ వ్యూహాత్మకంగా పిఠాపురం ఎంచుకున్నట్లు కనిపిస్తోంది. ఆయన కాకినాడ ఎంపీగా కూడా పోటీ చేస్తారన్న ప్రచారం జరిగింది. అయితే తాను అసెంబ్లీకే పోటీ చేస్తానని చెప్పి, ఊహాగానాలకు తెరదించారు. కాగా పవన్ పోటీ ఖరారు కావడంతో.. ఆయనపై వైసీపీ నుంచి ఎవరు బరిలోకి దిగుతారన్న అంశం ఆ పార్టీ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.

గత ఎన్నికల్లో టీడీపీ-జనసేన విడిగా పోటీ చేసిన సందర్భంలో.. ఆ రెండు పార్టీలకూ కలిపి 96 వేల ఓట్లు రాగా, వైసీపీ అభ్యర్ధికి 83 వేల ఓట్లు వచ్చాయి. వైసీపీ అభ్యర్ధి దొరబాబుకు 44.71 శాతంతో 83459 ఓట్లు రాగా, టీడీపీ అభ్యర్ధి వర్మకు 36.68 శాతంతో 68467 ఓట్లు వచ్చాయి. జనసేన అభ్యర్ధి శేషుకుమారికి 15 శాతంతో 28011 ఓట్లు వచ్చాయి. టీడీపీ-జనసేనకు కలిపి 51 శాతం ఓట్లు వచ్చాయన్నమాట.

అంటే టీడీపీ-జనసేన ఓట్లు చీలిపోవడం వల్ల, వైసీపీ లబ్థిపొందిందని స్పష్టమవుతోంది. తాజాగా పవన్ ఈ లెక్కలు బేరీజు వేసుకుని, స్థానికంగా ఉన్న కాపు నేతలతో చర్చలు జరిపిన తర్వాతనే, పిఠాపురం నియోజకవర్గాన్ని ఎంచుకున్నట్లు తెలుస్తోంది. కాగా పిఠాపురంలో కాపు ఓటర్లు 96 వేల పైచిలుకు ఉండగా, బీసీ ఓటర్ల సంఖ్య 83 వేలకు పైగా ఉంటుందని గణాంకాలు చెబుతున్నాయి. టీడీపీ-జనసేన కలవడంతో కాపుల ఓట్లతోపాటు- బీసీల ఓట్లు కూడా కలిస్తే, పవన్ 50 వేల మెజారిటీతో సులభంగా గెలుస్తారని కాపు నేతలు విశ్లేషిస్తున్నారు.

ఇక పవన్‌పై పిఠాపురంలో బలమైన అభ్యర్ధి కోసం వైసీపీ కొంతకాలం అన్వేషణలో ఉంది. ఆయన పిఠాపురం నుంచే పోటీ చేస్తారన్న వార్తల నేపథ్యంలో, వైసీపీ నాయకత్వం మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం, ఎంపి వంగాగీత పేర్లు పరిశీలిస్తోంది. ముద్రగడ ఈ నెల 15 లేదా 16 న వైసీపీలో చేరనున్నారు. అయితే ఆయన తన కుమారుడికి టికెట్ అడుగుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. అదే జరిగితే పోటీ తేలిపోతుందని, పవన్ 80 వేల మెజారిటీతో గెలుస్తారని వైసీపీ వర్గాలే చెబుతున్నాయి.

ఈ క్రమంలో ముద్రగడ లేదా గీతలో ఒకరిని నిలబెడితే, కనీసం పవన్‌కు పోటీ ఇచ్చే అవకాశం ఉంటుందని పార్టీ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. అందులో ముద్రగడ కంటే గీత బెటర్ అని పార్టీ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. గీత అయితే ఎలాంటి భేషజాలు లేకుండా ఇంటింటి ప్రచారంలో పాల్గొని, ఓట్లు అడుగుతారని చెబుతున్నారు. పైగా మహిళ కాబట్టి కొంత సానునూతి ఉండే అవకాశం లేకపోలేదంటున్నారు.

అదే ముద్రగడ అయితే పవన్‌కు అంత పోటీ ఇవ్వలేరంటున్నారు. దానికి సంబంధించి బయట జరుగుతున్న ప్రచారంలో నియోజకవర్గంలో సగం కూఆడా ఉండదని స్పష్టం చేస్తున్నారు. ముద్రగడకు రాష్ట్ర వ్యాప్త ప్రచారం, కీర్తి ఉన్నప్పటికీ ప్రస్తుతం ఆయనకు నియోజకవర్గంలో పెద్ద ఇమేజ్ లేదని స్పష్టం చేస్తున్నారు. కాపు ఉద్యమం నుంచి తాను తప్పుకున్నట్లు గతంలో ముద్రగడ ప్రకటించారు.

చంద్రబాబు హయాంలో కాపు రిజర్వేషన్ల కోసం పోరాడిన సమయంలో ముద్రగడ ఇమేజ్ ఆకాశమంత ఎత్తు ఎదిగిందని గుర్తు చేస్తున్నారు. అయితే జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత.. బాబు ఇచ్చిన రిజర్లేషన్లు అమలు చేయాలని ఉద్యమించకపోవడంతో, ముద్రగడ ఇమేజీ కాపుల్లో భారీగా డామేజీ అయిందని కాపునేతలు విశ్లేషిస్తున్నారు. పైగా కాపులకు రిజర్వేషన్లు ఇచ్చేది లేదన్న జగన్ పార్టీలో చేరడం కూడా విమర్శలకు దాదితీస్తోంది. ఈ నేపథ్యంలో కాపు ఉద్యమ నేత ముద్ర కాకుండా, సాధారణ రాజకీయ నేత ముద్ర మాత్రమే ఉన్న.. వంగా గీతనే సరైన అభ్యర్ధి అని వైసీపీ కాపు నేతలు విశ్లేషిస్తున్నారు.

Leave a Reply