పిఠాపురం శాసనసభ స్థానం నుంచి పోటీ చేస్తా

  • ఎంపీగా పోటీపై త్వరలో నిర్ణయం
  • జనసేన పోటీ చేస్తున్న 21 స్థానాల్లో వంద శాతం స్ట్రైక్ రేట్ తో గెలిచి తీరుతాం
  • పొత్తును ఆశీర్వదించండి… కూటమిని గెలిపించండి
  • శాంతి, సుస్థిర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం
  • జగన్ ది అధికార మదం… సిద్ధం గ్రాఫిక్స్ లతో జగన్ అడ్డంగా దొరికిపోయాడు
  • ప్రభుత్వ ఆదాయంలో సగం జగన్ నొక్కేస్తాడు… ఇంకొంత సిద్ధం సభలకు, పోస్టర్లకుపోతుంది
  • శ్రీలంక ప్రధానమంత్రి నివాసంలాగే తాడేపల్లి ప్యాలెస్ కావచ్చు
  • జనసేన ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మంగళగిరి కేంద్ర కార్యాలయంలో సోషల్ మీడియా ప్రతినిధుల సమావేశంలో ప్రసంగించిన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్  

‘వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేయమని కొందరు… ఎమ్మెల్యేగా అసెంబ్లీకి వెళ్లాలని మరికొందరు కోరుతున్నారు. నాకు మాత్రం ఎమ్మెల్యేగా పోటీ చేయాలని ఉంది. పిఠాపురం అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేస్తాను. దత్తాత్రేయుడి అవతారం అయిన శ్రీపాద శ్రీవల్లభుడి జన్మించిన పవిత్రమైన నేలగా పేరుగాంచినది పిఠాపురం. అక్కడి నుంచి పోటీకి నిలబడుతున్నాను. అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తాను. ఎంపీగా కూడా పోటీ చేయాలని చాలా మంది సూచిస్తున్నారు. దానిపై త్వరలోనే ఒక నిర్ణయం తీసుకుంటాన’ని జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్  స్పష్టం చేశారు. 2014లోనే పిఠాపురం నుంచి పోటీ చేయాలని ప్రతిపాదన వచ్చింది. అయితే అప్పట్లో బీజేపీ, తెలుగుదేశం గెలుపు కోసం మద్దతు ఇవ్వడంతో పోటీ చేయలేదు.

2024 ఎన్నికల్లో జనసేన పోటీ చేసే 21 స్థానాల్లో వందశాతం స్ట్రైక్ రేట్ ఉండేలా ప్రతి కార్యకర్త, నాయకుడు పనిచేయాలని పిలుపునిచ్చారు. టీడీపీ, బీజేపీలతో కూడిన పొత్తును అందరూ ఆశీర్వదించి… కూటమి అభ్యర్థులను గెలిపించాలని కోరారు. జనసేన ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గురువారం మంగళగిరి కేంద్ర కార్యాలయంలో జనసేన సోషల్ మీడియా ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్  మాట్లాడుతూ… “జనసేన పార్టీ దశాబ్ద కాలంలో ఎన్నో కష్టాల కోర్చి ముందుకు సాగింది. ఇక కష్టాల సమయం అయిపోయింది. వచ్చే ఎన్నికల్లో మనం గెలుస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకు భరోసా ఇచ్చేలా ముందుకు సాగుదాం. జనసేన ధైర్యంతో శాంతి, సుస్థిరత కోసం వచ్చే ఎన్నికల్లో యుద్ధం చేస్తోంది. జనసేన వంటి స్ఫూర్తి ఉన్న సమూహం గత దశాబ్ద కాలం రాష్ట్రం కోసం ధైర్యంగా నిలబడింది.

జనంతో కన్నీరు పెట్టించిన ప్రభుత్వం కూలిపోతుంది
 జగన్ చేసిన తప్పులు కర్మల రూపంలో అనుభవించక తప్పదు. ఇంతమంది జనంతో కన్నీరు పెట్టించిన ప్రభుత్వం ఆ కన్నీటితోనే కూలిపోతుంది. జగన్ ది అధికార దాహం, అధికార మదం. అధికారం కోసం ఎంతకైనా దిగజారే వ్యక్తి జగన్. భవిష్యత్తులో ఎవరిని వదిలేది లేదు. నమ్మక ద్రోహం చేసిన వారిని కాళ్లవేళ్లపడినా వదలం. జనసేన పార్టీ నా బిడ్డ. ఆ బిడ్డను గుండెల్లో పెట్టుకొని ఇంత దూరం తీసుకొచ్చాను. పార్టీ కోసం కష్టపడే జన సైనికులు, వీరమహిళల మీద పడే ప్రతి దెబ్బకు కచ్చితంగా సమాధానం చెప్పి తీరుతాం. ప్రజల కన్నీళ్లు నా కన్నీరు అనుకున్నాను. వాళ్ల వేదనలు నా వేదనలు అనుకున్నాను. 25 ఏళ్లు పార్టీ కోసం బలంగా పనిచేయాలని నిర్ణయించుకొని రాజకీయాల్లోకి వచ్చాను. 2019లో నా వ్యూహం ప్రకారం పోటీ చేసి ఉంటే జనసేన పార్టీ గుర్తింపు పొందిన పార్టీగా ఈ రోజు ఉండేది.

శ్రీలంక అధ్యక్షుడికి పట్టిన గతేపడుతుంది
అప్పు చేసి డబ్బు పంచితే సంక్షేమం అవ్వదు. ఆ అప్పులను మళ్లీ కట్టాల్సింది ప్రజలే. రాష్ట్రం కోసం తెచ్చిన డబ్బుల్లో సగం డబ్బులు జగన్ నొక్కేస్తుంటే… మరికొంచెం ఆయన సభలకు, సమావేశాలకు, ప్రచారాలకు సరిపోతోంది. కొంత మొత్తం ప్రజలకు పంచిపెట్టి ఏదో ఉద్దరించినట్లు చెప్పుకుంటున్నారు. అప్పు చేసి డబ్బులు పంచుకుంటూపోతే తాడేపల్లి ప్యాలెస్ లో కూడా శ్రీలంక అధ్యక్షుడి ప్యాలెస్ లోకి ప్రజలు వెళ్లి ఎలా ఆక్రమించారో అలాగే జరుగుతుంది. శ్రీలంక దేశ అధ్యక్షుడికి జరిగిన గతే ఈ ముఖ్యమంత్రికి పడుతుంది. ప్రజలు తిరగబడితే వచ్చే కోపం మాములుగా ఉండదు. జనసేన, బీజేపీ, తెలుగుదేశం  ఉమ్మడి ప్రభుత్వంలో అభివృద్ధి చేసి చూపిస్తాం. దాని నుంచి సంపదను సృష్టించి జగన్ కు మించి సంక్షేమం అందిస్తాం. ఏ ఒక్క పథకం ఆగిపోకుండానే ప్రజలకు తగిన విధంగా సంక్షేమ పథకాలను అందిస్తాం.

గ్రాఫిక్స్ కూడా సరిగా చేయలేదు
సిద్ధం సభకు 15 లక్షల మంది హాజరయ్యారంటూ రకరకాల గ్రాఫిక్స్ మాయలను ఉపయోగించి ప్రజలను మభ్యపెట్టడానికి వైసీపీ వాళ్ళు తెగ ప్రయత్నించారు. అయితే వైసీపీ బృందానికి సరిగ్గా గ్రాఫిక్స్ చేయడం కూడా చేతకాలేదు. ఆరేడు లక్షల మంది జనం వస్తేనే ఊళ్లు స్తంభిస్తాయి. భారీగా సభలకు జనం వచ్చినట్లు చూపి జగన్ అడ్డంగా దొరికిపోయాడు. సరిగా గ్రాఫిక్స్ కూడా చేయలేని జగన్ తన ఓటమి ఇప్పటికే అర్ధమైంది.  జగన్ సిద్ధం… సిద్ధం అంటున్నాడు. ఓడిపోవడానికి సిద్ధంగా ఉన్నట్లు ఉన్నాడు. మనం గెలవడానికి సిద్ధంగా ఉన్నాం.  పవన్ కళ్యాణ్ కు సలహాలు ఇవ్వడం కొందరికి చాలా బాగుంటుంది. ఎక్కడ ఎవరిని నిలబెట్టాలో వారే చెబుతారు. పెద్దలకు పూర్తి గౌరవం ఇస్తాను. వారికి సముచిత స్థానం కూడా ఉంటుంది. కానీ వైసీపీని తిట్టాల్సిన సమయంలో మనల్ని తిడితే ఎలా? అది వారు ఆలోచించుకోవాలి. నేను కూడా జనసేనకు ఓట్లు పెరిగాయి, బలం పెరిగింది అని ప్రత్యేక ఈగోతో వెళ్తే సీట్లు పెరిగేవి. కానీ సగటు మధ్యతరగతి మనిషి ఈ వైసీపీ ప్రభుత్వం పోవాలని బలంగా కోరుకునే కోరికకు అడ్డంకులు ఏర్పడేవి.

రాష్ట్ర ప్రజల క్షేమం కోసం త్యాగాలు తప్పలేదు
విదుర నీతి ప్రకారం ఒక రాజ్యం క్షేమం కోసం ఒక గ్రామం పోయినా ఫర్వాలేదు అంటారు. అలాగే ఐదు కోట్ల ఆంధ్రుల భవిత కోసం ఎన్నికల్లో పోటీ చేసే సీట్లు కొన్ని త్యాగం చేయక తప్పలేదు. రాష్ట్రం బాగుండాలనే తపనతోనే ఈ త్యాగం చేశాను. 2019లో ఎంతోమంది యువతకు అవకాశం ఇచ్చాం. ప్రస్తుతం రాష్ట్ర భవిష్యత్తు కోసం పొత్తులో భాగంగా కొందరికి అవకాశం ఇవ్వలేకపోయాం. ఆఖరుకు నా సొంత అన్నయ్య నాగబాబు గారికి కేటాయించిన సీటు కూడా వదులుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. జనసేన నాయకులు, జనసైనికులు, వీరమహిళల ఆవేదన నాకు తెలుసు.  నన్ను నేను అర్ధం చేసుకున్నంతగా ఎవరూ అర్ధం చేసుకోలేరు. నా బలం, బలహీనత ఏమిటో పూర్తి అవగాహన ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో తగ్గడం చాలా అవసరం. తగ్గిన వాడు ఎప్పుడు నాశనం అవ్వడు. తగ్గే కొద్ది ఎదుగుతాం తప్ప ఏ అనర్ధం ఉండదు. తనను తాను తగ్గించుకున్న వాడు హెచ్చింప బడును అని చిన్నప్పుడే చదువుకున్నాను.

పని చేసిన వారిని గుర్తిస్తాను… బ్లాక్ మెయిల్ చేస్తే సహించను
నా చుట్టూ కోటరీ కట్టాలని చూస్తారు. దానిని నేను ఎప్పటికప్పుడు బద్ధలుకొడతాను. పైకి మెత్తగా కనిపిస్తాను ఆడేసుకుందాం అనుకుంటే … నేను వాళ్లతో ఆడేసుకుంటాను. టీ, కాఫీలు అందించి ఎమ్మెల్యేలు అయిపోదాం అనుకుంటే కుదరదు. నన్ను బ్లాక్ మెయిల్ చేయాలనుకుంటే దానికి తగిన మూల్యం చెల్లించాల్సి ఉంటుంది. పార్టీలో ఉండి కోవర్టులుగా పని చేసే వాళ్లను వదిలేది లేదు. పనిచేసే వాళ్లను ఎలా గుర్తిస్తానో… నా చుట్టు ఉండి నమ్మక ద్రోహం చేసిన వారిని వదిలిపెట్టను. నేను పెద్దలందరికి సులభంగా అర్ధమవుతాను. కొందరు మాత్రం నన్ను అర్ధం చేసుకోలేరు. ఒక మధ్యతరగతి సగటు మనిషికి కోపం వస్తే ఎలా ఉంటుందో వైజాగ్ లో చూశారు. ఆంధ్ర, తెలంగాణ బోర్డర్ లో చూశారు. 2009లో ఓ మార్పు కోసం మొదలైన రాజకీయ ప్రయాణాన్ని కొందరు వ్యక్తులే మధ్యలో ముగించారు. బలమైన సర్పాన్ని చలి చీమలు కూడా తినేస్తాయి అన్నట్లు రాజకీయ ప్రయాణం ఆగిపోయింది. ఒక సమూహాన్ని ప్రభావితం చేసే వ్యక్తి రాజకీయాల్లోకి వస్తే అప్పటికే రాజకీయాల్లో ఉన్న వారు వారి వికృత రూపాన్ని ఎలా చూపిస్తారో 2006లోనే అర్ధమైంది.

సోషల్ మీడియా బలమైన వేదిక
సోషల్ మీడియా అనేది నేటి సమాజంలో బలమైన వేదిక. కత్తిని తీసుకెళ్లి జగన్ చేతిలో పెడితే బాబాయ్ ని చంపేస్తాడు. అలాగే సోషల్ మీడియా కూడా తప్పుగా ఉపయోగించకుండా జాగ్రత్తగా వినియోగిస్తే అద్భుతాలు జరుగుతాయి. పొత్తులో బీజేపీ చేరడం వల్ల జగన్ తోక కత్తిరిస్తాం. అలాగే సోషల్ మీడియా వేదికగా నిజాలను నిర్భయంగా చెప్పడానికి వినియోగించాలి. నేను సోషల్ మీడియా చాలా తక్కుగా వినియోగిస్తాను. కామెంట్లు, సూచనలు చేసే సమయంలో భాష విషయంలో జాగ్రత్త వహించండి. లైకులు, షేర్లు కోసం తాపత్రయపడకుండా నిజం మాత్రమే చెప్పే వేదికగా సోషల్ మీడియా పనిచేయాలి. శతఘ్ని అనేది జనసేన పార్టీకి గొడుగులాంటింది. కేవలం ఇది కొంతమంది సమూహం కాదు. అన్యాయం మీద పోరాడే ప్రతి వ్యక్తి శతఘ్నిలో భాగం. ఇప్పటి వరకు చేతిలో దీపం లేదు అని మాట్లాడాం. ఇప్పుడు జనసేన రాష్ట్రానికి వెలుగులు విరజిమ్మే కాగడాగా మారాలి.

మీ బంగారు భవిష్యత్తుకి నాదీ బాధ్యత
ఈ పదేళ్ళ కాలంలో ఎప్పుడూ అడగలేదు. కానీ ఇప్పుడు అడుగుతున్నాను రాష్ట్ర భవిష్యత్తు కోసం ఈసారి పొత్తును గెలిపించండి. జనసేనను ఆశీర్వదించండి. అధికారం లేనప్పుడే ప్రజల కోసం ఆలోచించే వాడిని వారికోసం మేలు చేసేవాడిని. అధికారం ఉంటే వారికి మరింతగా ఉపయోగపడొచ్చు అనే ఉన్నత ఆశయంతో వచ్చిన వాడిని. ఈసారి జనసేన పార్టీకి బలంగా నిలబడండి. మీకు బం భవిష్యత్తు ఇచ్చే బాధ్యత తీసుకుంటాను” అన్నారు.

Leave a Reply