అట్లా నవ్వమాకండ్రా… కాస్త సప్పట్లు కొట్టండ్రా బాబూ..

Spread the love

( మార్తి సుబ్రహ్మణ్యం)

మా జగ నన్న సీఎం అయి మూడేళ్లు కావస్తున్నా ఇంతవరకూ చెప్పినది ఒక్కటీ చేయలేదని తెగ ఎక్కిరించమాకండ్రా.. మా మనసు ఇకలమవుతుంది మరి!
సీపీఎస్ రద్దు చేస్తామన్నాడు… చేయలేదు. ఓకే. అప్పటికీ సజ్జలన్న చెప్పాడు కదా.. అప్పట్లో దాని గురించి మాకు అవగాహన లేదని! దానిపైనా ఎదవ ఎటకారాలేంట్రా బాబూ?
ఓకే .. ఓకే.. అమరావతి రాజధాని నగరాన్ని రద్దు చేస్తూ, మూడు రాజధానుల యవ్వారం తెరపైకి తెచ్చారు. మళ్లీ మనసు మార్చుకున్నారు. అసెంబ్లీలో తీర్మానం చేశారు. అది కూడా ఓకే. మంచిపనిచేసిన మారాజుకు దండాలెట్టకుండా, ఈ నీలుగుడేందిరా బాబూ?
ఎన్నికల ముందు జగనన్న, క్రమంగా సంపూర్ణ మద్యపాన నిషేధం విధిస్తామన్నారు.. ఓకే. కానీ ఖజానా మరీ సిక్స్‌పాక్ మాదిరిగా మారడంతో సంక్షేమపథకాల భారాన్ని మందుశాఖపై మోపారు. అది కూడా ఓకే. ఖజానాకు కిక్కు ఇచ్చినందుకు జగనన్న ఓదార్పు మార్కు మాదిరిగా కిస్సవ్వకుండా, ఈ కితకితలేంట్రా బాబూ?
ఇన్ని చెప్పిన పనులు చేయనందుకు తెగ బనాయిస్తున్న జగనన్న చేసిన ఆ ఒక్క రద్దునయినా కనీసం మెచ్చుకోండ్రా బాబూ..
ఏందంటారా.. అదే చింతామణి నాటకాన్ని నిషేధించారు కదా! కనీసం దానికయినా చప్పట్లుకొట్టండ్రా బాబూ! కాస్తంత పాజిటివ్‌గా మారండ్రా బాబూ?
సపోజ్.. పర్ సపోజ్.. అది కూడా నిషేధించకపోతే, చింతామణి ఆత్మ తాడేపల్లి టు నర్సీపట్నం వరకూ తెగ తిరిగి అలసిపోయేది కదా?
మన వైశ్యరత్న మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు కూడా తెగ ఫీలయ్యేవారు కదా?
అసలు చింతామణి నాటకం వల్ల వైశ్యులు ఎంత నామర్దా ఫీలవుతున్నారని?! దాన్ని ఇప్పటి వరకూ ఏ ఒక్క దుర్మార్గ పాలకుడూ పట్టించుకోకపాయె?! అందరూ వైశ్యులను ఓటుబ్యాంకుగా చూస్తే, మన జగనన్నయ్య ఒక్కరే వారిలో దాగున్న ‘చింతామణి నాటక నిషేధపు కోరిక’ను గుర్తించి నిషేధించారు. అలాంటిది ఎన్నికల హామీలో లేకపోయినా… నవరత్నాల్లో లేకపోయినా.. జగనన్న దయతలచి చింతామణి నాకటాన్ని నిషేధిస్తే, సంతోషించి సంబరాలు చే సి జగనన్నకు గండపెండేరాలు తొడిగి, వైశ్యజనబాంధవుడన్న బిరుదులివ్వకుండా ఇట్లా వెక్కిరిస్తారేంట్రా బాబూ?! అది మంచి పద్ధతా చెప్పండి? కాస్త మారండ్రా.. ఎవరికయినా చూపించుకోండి!

సరే.. జగనన్న ఎన్నికల ముందు చెప్పిన సవాలక్ష నిషేధాలు, సవాలక్ష సమస్యలు, కోటి వర్రీసు కారణంగా అమలుచేసి ఉండకపోవచ్చు. సీపీఎస్ రద్దు చేస్తానని ఉద్యోగులకు మాటిచ్చి, పవర్‌లోకి వచ్చిన తర్వాత జెల్ల కొట్టి ఉండొచ్చు. పాపం అప్పటికీ చాలా వరకూ ప్రయత్నించి చూసినా, వర్కవుట్ కాకపోతే జగనన్నను నిందించడం ఎందుకు? సీపీఎస్ రద్దు అయ్యేదేనా? కాదా? నిజంగా రద్దు చే సేంత సిన్మా ఉంటే అప్పుడు చంద్రబాబే రద్దు చేసేవాడు కదా అన్న లైట్లు ఉద్యోగులకు వెలగొద్దూ?! అసలు జగనన్న చేతికి ఎముకే ఉండదన్నది, అన్నతో సహా జగమంతా తెలిసిందే. అలాంటిది ఏ పరిస్థితిలో సీపీఎస్ రద్దు హామీ ఇచ్చారో అర్ధం చేసుకోకుండా, ఇట్లా రోడ్లమీదకొచ్చేస్తే ఎట్లా?

అవును. మద్య నిషేధం విధిస్తామని ఎన్నికల ముందు హామీ ఇచ్చారు. మరి అమ్మఒడికి డబ్బిచ్చి, నాన్నతడి పథకంతో వసూలుచేయకపోతే బడ్జెటు బండెలా నడుస్తాది? ఓటరును సంక్షేమ పథకాలతో ముప్పొద్దులా పందెం కోడిలా మేపుతుంటే, ఉద్యోగులకు జీతాలెట్లా ఇయ్యాలీ అంట? ఆ మాత్రం ‘మందుజాగ్రత్త’ లేకపోతే కొంప కొల్లేరయిపోదూ? అయినా మద్యనిషేధం అమలుచేస్తే ఆ పథకాలకు పైసలెవరిస్తారు? అందుకే కదా.. సంక్షేమ పథకాలను పూర్తి చేసే మహత్తర బాధ్యతను మందుబాబులకు అప్పగించింది? ఆ మాత్రం అర్ధం చేసుకోకుండా ఎడా పెడా సెటైర్లేస్తే జగనన్న తట్టుకోవద్దూ?!

క్షవరం అయితే గానీ వివరం తెలియదన్నట్లు.. జగనన్నకు మూడేళ్లకు గానీ క్షవరం కాలేదు. అందుకే వివరం తెలుస్తోంది. అట్లా అన్నియ్యను తెలుసుకోనీయండ్రా బాబూ. ఇంకొన్ని వివరాలు తెలుస్తాయి!
అట్లా బనాయించకండి. నిషేధిస్తామని చాలా చెప్పి ఉండొచ్చు. వీలు కాలేదు. అవన్నీ చేతకాకపోయినా కనీసం చింతామణి నాటకాన్నయినా నిషేధించారు కదా? అంటే ఏదో ఒకటి నిషేధించారు కదా? సంతోషించి సంబరాలు చేసుకోకుండా ఈ ఎకసెక్కాలు, ఎదవ గోదారి సెటైర్లు ఏందంట? అట్లా ఇరగబడి నవ్వమాకండ్రా.. గుండె ఇత్తడవుతోంది. సింతామణిని నిషేధించింనందుకు జగనన్నకు సప్పట్లు కొట్టండ్రా బాబూ! ‘నీదేంపోయింది నిమ్మగడ్డ భానుమూర్తి’ అని వెనకటికి సిన్మాలో చెప్పినట్లు.. సప్పట్లు కొడితే నీ ముల్లేంపోతుంది?

Leave a Reply