Suryaa.co.in

Andhra Pradesh

ఏపీపీఎస్సీని భ్రష్టు పట్టించిన జగన్‌కి హైకోర్టు తీర్పు చెంపపెట్టు

– 2018 గ్రూప్-1 మెయిన్స్ రద్దు చేసిన హైకోర్టు
– 49 వేల ఓఎంఆర్ షీట్లు మార్చేసిన వైసిపి గ్యాంగ్
– ఏపీపీఎస్సీని వైసీపీఎస్సీగా మార్చేసిన జగన్
– నిరుద్యోగులను నిండా ముంచిన వైసీపీ సర్కారు
– టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆగ్ర‌హం

ఏపీపీఎస్సీని జగన్ వైసీపీఎస్సీగా మార్చేసి పూర్తిగా భ్రష్టు పట్టించారని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మండిపడ్డారు. 2018 గ్రూప్-1 మూల్యాంకనంలో అవ‌క‌త‌వ‌క‌ల‌ను నిర్ధారిస్తూ మెయిన్స్ ను రద్దు చేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామ‌ని బుధ‌వారం విడుద‌ల చేసిన ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు. హైకోర్టు తీర్పు ఉన్మాద పాలకుడు జగన్ కి చెంపపెట్టు అని పేర్కొన్నారు. ప్ర‌తిప‌క్ష‌నేత‌గా జ‌గ‌న్ 2.30 ల‌క్ష‌లకు పైగా ప్ర‌భుత్వ ఉద్యోగాలు భ‌ర్తీ చేస్తాన‌ని, ప్ర‌తి ఏటా జ‌న‌వ‌రి 1నే ప్ర‌భుత్వ ఉద్యోగాల ఖాళీల వివ‌రాల‌తో జాబ్ క్యాలెండ‌ర్ విడుద‌ల చేస్తాన‌ని హామీ ఇచ్చి విస్మ‌రించార‌న్నారు.

సీఎం అయ్యాక ఒక్క పోస్టూ తీయ‌లేదు, జాబ్ క్యాలెండ‌ర్ ఇస్తాన‌ని, సాక్షి క్యాలెండ‌ర్ చేతిలో పెట్టాడ‌ని ఎద్దేవ చేశారు. చివ‌రికి గ్రూప్-1 పేప‌ర్ల వాల్యూయేష‌న్‌ని ఇష్టారాజ్యంగా నిర్వ‌హించి నిరుద్యోగుల ఉసురు పోసుకుంద‌న్నారు. టిడిపి హయాంలో 169 గ్రూప్‌-1 ఉద్యోగాల భ‌ర్తీకి 2018లో నోటిఫికేషన్ ఇచ్చి, పరీక్షలు పారదర్శకంగా నిర్వహించామన్నారు. అధికారంలోకి వ‌చ్చిన వైసీపీ, గ్రూప్ 1 మెయిన్స్ ప‌రీక్ష‌ల మూల్యాంక‌నంలో అవ‌క‌త‌వ‌క‌ల‌కు పాల్ప‌డింద‌న్నారు. వైసీపీ నేతలు, త‌న బంధువుల‌తో ఏపీపీఎస్సీని నింపేసి వైసీపీఎస్సీగా మార్చేశార‌ని ఆరోపించారు.

ఎటువంటి అర్హ‌త‌లు లేకున్నా వైసీపీ నేతలు, జగన్ బంధువులు ఏపీపీఎస్సీ స‌భ్యులుగా చేరి మొత్తం ప‌రీక్ష‌ల వ్య‌వ‌స్థ‌ని, మూల్యాంక‌నాన్ని, ఇంట‌ర్వ్యూ ప‌ద్ధ‌తుల్ని పాత‌రేశార‌ని మండిప‌డ్డారు. టిడిపి హ‌యాంలో ప్రిలిమ్స్, మెయిన్స్ ప‌రీక్ష‌లు రాసిన ప్ర‌తిభావంతుల పేప‌ర్లు 3 సార్లు మూల్యాంకనం చేసి, అర్హులంద‌రినీ త‌ప్పించి, త‌మ‌వారికి పోస్టులొచ్చేలా మార్కులు మార్చేసి నిరుద్యోగుల జీవితాలతో చెలగాటం ఆడార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

49 వేల ఓఎంఆర్ షీట్లు మార్చేశార‌ని నిరుద్యోగ జేఏసీ, విద్యార్థి సంఘాలు చేస్తున్న‌ ఆరోప‌ణ‌లపై జ‌గ‌న్ స‌ర్కారు మౌనం వ‌హించ‌డం దీని వెనుక కుట్ర కోణాన్ని వెల్ల‌డిస్తోంద‌న్నారు. ప్ర‌జాఆకాంక్ష‌ల మేర‌కు త్వ‌ర‌లో కూట‌మి ప్ర‌భుత్వం ఏర్ప‌డుతుంద‌ని, కోర్టు ఆదేశాల మేరకు పార‌ద‌ర్శ‌కంగా ప్ర‌భుత్వ ఉద్యోగాల‌న్నీ భ‌ర్తీ చేస్తామ‌ని లోకేష్ హామీ ఇచ్చారు. గ్రూప్-1 అభ్య‌ర్థులు, నిరుద్యోగులు ఎవ‌రూ అధైర్య‌ప‌డొద్ద‌ని భ‌రోసా ఇచ్చారు.

LEAVE A RESPONSE