– సాక్ష్యాలు చూపలేకపోయిన సీఐడీ
– ఆధారాలుంటే ఎందుకు చూపలేదు?
– ఇక సీఐడీని నమ్మేదెవరు?
– బాబుకు బెయిల్ న్యాయానికి దక్కిన విజయం
– అండగా నిలచిన ఎంపి రఘురామకృష్ణంరాజుకు కృతజ్ఞతలు
– తెలుగుమహిళ రాష్ట్ర అధ్యక్షురాలు షకీలారెడ్డి, పార్టీ అధికార ప్రతినిధి హిమబిందు
టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబునాయుడుకు స్కిల్ కేసులో బెయిల్ లభించడం న్యాయానికి దక్కిన విజయమని తెలంగాణ తెలుగుమహిళ రాష్ట్ర అధ్యక్షురాలు భవనం షకీలారెడ్డి, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మిన్నెకంటి హిమబిందు వ్యాఖ్యానించారు. ఇది వేధింపులకు కేరాఫ్ అడ్రసయిన జగన్ సర్కారుకు చెంపదెబ్బ అన్నారు. చంద్రబాబును 53 రోజులు జైల్లో ఉంచి సీఐడీ సాధించింది ఏంటని వారు ప్రశ్నించారు. ఇన్ని రోజుల్లో, ఇన్ని వాయిదాల్లో ఒక్క ఆధారం చూపలేని సీఐడీ ప్రజలకు ఏం సమాధానం చెబుతుందని నిలదీశారు. చంద్రబాబు గానీ, ఆయన కుటుంబసభ్యుల బ్యాంకు ఖాతాలకు గానీ, నయాపైసా మళ్లించిన ఆధారం కూడా చూపని సీఐడీ విచారణపై నమ్మకం పోయిందన్నారు.
జగన్ జేబుసంస్థగా మారిన సీఐడీ ఇకనైనా కళ్లుతెరవాలన్నారు. జగన్ మెప్పుకోసం పనిచేస్తే తర్వాత మూల్యం చెల్లించుకునేది అధికారులేనని స్పష్టం చేశారు. చంద్రబాబు విడుదల కోసం పోరాడిన సాఫ్ట్‌వేర్ నిపుణులు, తెలంగాణ జిల్లాల్లో ఆందోళనలు నిర్వహించిన కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సంక్షోభ సమయంలో కార్యకర్తలకు దన్నుగా నిలిచిన చంద్రబాబు ఆనయుడు సతీమణి భువనేశ్వరి గారి ఆత్మస్థైర్యం మహిళలకు మార్గదర్శకం కావాలని ఆకాంక్షించారు. ఒక వైపు చంద్రబాబు జైల్లో ఉన్నారన్న వార్త తెలిసి, ఆగిన గుండెల కుటుంబానికి భువనేశ్వరి గారు భరోసా ఇవ్వడం గొప్ప విషయమన్నారు. చంద్రబాబు పోరాట స్ఫూర్తితో తెలంగాణలో టీడీపీ మరింత ముందుకు వెళుతుందన్నారు.
ప్రధానంగా టీడీపీ కార్యకర్తలు, చంద్రబాబు అభిమానులు నిర్వహించిన వివిధ ఆందోళన కార్యక్రమాల్లో పాల్గొని, అందరిలో సమరోత్సాహం నింపిన ఎంపి రఘురామకృష్ణంరాజుకు కృతజ్ఞతలు తెలిపారు. హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమాలకు ఆయన రాక తమకు ఉత్సాహం నింపిందన్నారు. రాజు గారి పోరాటపటిమ కార్యకర్తలకు స్ఫూర్తిదాయకం కావాలని షకీలారెడ్డి, హిమబిందు పిలుపునిచ్చారు.