గాయకుడు గద్దర్ ప్రథమ వర్ధంతి సందర్భంగా ఇటీవల కొన్ని సభలు పాత స్థూపం దగ్గర నేల చదునుచేసి ఆయనను స్మరించుకున్నారు, పాటలు పాడారు. వాటన్నింటా అతిశయోక్తులు, అర్థసత్యాలు, అసంగత విశేషణాలతో వక్తలు ఊదరగొట్టారు. నాలుగు దశాబ్దాల క్రితపు సామాజిక స్థితిని తెలిపే ఆనాటి పాటలు మరోసారి వినిపించారు. కాలం ఎంతో మారిందన్న సోయి – స్పృహ అక్కడివారెవరిలో కనిపించలేదు. వారి దృష్టిలో అర్ధశతాబ్దం క్రితమే కాలం స్తంభించినట్టుంది.
మొత్తంమీద గద్దరు ‘లార్జర్ దాన్ లైఫ్’గా చిత్రించడానికి ఆయన అభిమానులు శక్తికి మించిన ప్రయత్నంచేశారు. మసకబారిన గద్దర్ పూర్వవైభవాన్ని పునర్జీవింపజేసేందుకు శ్రమించారు. ఆ పనికి ఇదొక మంచి అవకాశంగా భావించారేగాని తొలినుంచి గద్దర్‌లో ఉన్న ద్వంద్వ ప్రమాణాలను, ద్వైదీభావాన్ని ఎవరూ ప్రస్తావించలేదు, ఉదహరించనూలేదు.
ఎంతసేపు ప్రజాగాయకుడు గద్దర్, ప్రజా యుద్ధనౌక గద్దర్, విప్లవ వీరుడు యోధుడు అంటూ…. పోటీపడి ప్రస్తుతించారు. కాని మరోపక్క తెలంగాణ రాష్ట్రప్రభుత్వం ఆయన పేరు ప్రతిష్టను హైజాక్ (అపహరణ) చేసి సొంతం చేసుకుని ముందుకు కదులుతున్నా వీరంతా మౌనంగా ఆమోదముద్రవేయడం విడ్డూరం. మరి దీన్ని గద్దర్ పాట – పరువు ప్రతిష్ట అపహరణ (హైజాక్)గా భావించాలా?….. లేక ఆత్మ సమర్పణ అనుకోవాలా?…. ఇప్పుడిది కోటి రూకల ప్రశ్న! గద్దర్ మరణానంతర ప్రచారం పెద్దఎత్తున లభిస్తోందని, అందులో కొంత తమకూ దక్కుతోందన్న అల్ప సంతోషంతో, హర్షాతిరేకాలతో అభిమానులు, గద్దర్ శిష్యులు, ప్రశిష్యులు, కుటుంబ సభ్యులు ఆ హైజాకు ఆమోదం పలకడం చూస్తే విచిత్రంగా, వింతగా ఉంది. కాలం కొత్త మలుపుతిరిగిన ‘దృశ్యం’ స్పష్టాతిస్పష్టంగా కనిపిస్తోంది.
గద్దర్ తొలినాళ్ళలో రాసి, పాడిన పాటల్లోని అర్థతాత్పర్యాలను తెలుసుకోకుండా, వాటి గూర్చి అవగాహన లేకుండా ధిక్కార భావజాలాన్ని పట్టించుకోకుండా ఆయన అభిమానులు – కుటుంబ సభ్యులు గుడ్డిగా ప్రభుత్వానికి ప్రణమిల్లుతూ ఈ ‘హైజాక్’ ప్రక్రియను స్వాగతించారా?…. ఏమని భావించాలి?… ఆధిపత్య భావనలపై – ప్రభుత్వాల పెత్తనంపై పాటను ఆయుధంగా మలచి గద్దర్ శక్తిమంతంగా ప్రయోగించాడని ఓవైపు అంటూనే మరోవైపు ఇలా ప్రభుత్వ పాదాలవద్ద మోకరిల్లడం పరస్పర విరుద్ధాంశం అవదా? వారికి ఈమాత్రం ఇంగితం లేకపోతే ఎలా?… ఇలా సరెండర్ కావడిన్ని కాలం నేర్పిందా?… స్వార్థబుద్ధి తరుముకొచ్చిందా?….
వాస్తవానికి ఇదంతా ఒకపూటలోనో, ఒక రోజులోనే జరిగిందికాదు. గద్దర్ జీవించి ఉన్నప్పుడే స్వయంగా తానే ఇందుకు మార్గం వేశాడు. భారీ ప్రణాళికను రచించాడు. అప్పుడు కూడా ఆయన అభిమానులు పసిగట్టకపోవడం ఎంతటి అమాయకత్వం?… ఆ అమాయకత్వాన్ని అదనపు అర్హతగా భావించి ముందుకు సాగడం వీరావేశం ప్రదర్శించడం వారికే చెల్లింది… చెల్లుతోంది!
గద్దర్ తన కుమారుడు సూర్యానికి ఎన్నికల్లో కాంగ్రెసుపార్టీ టికెట్ ఇప్పించుకునేందుకు నడుం బిగించి ఢిల్లీ, హైదరాబాద్ తదితర నగరాల్లో కాంగ్రెసు ముఖ్య నాయకుల ఇళ్ళ ఎక్కే గుమ్మం దిగే గుమ్మంగా తిరుగుతూ లబ్ధిపొందేందుకు పెద్ద ప్రణాళిక రచించి అమలు చేశాడు. చివరకు అలాగే అది కొనసాగింది. సంబంధాలు మరింత చిక్కబడ్డాయి. ఆ కదలికల్ని – ఆలోచనల్ని విశ్లేషిస్తే సర్కారులో లీనమైన సారాంశం ఇప్పుడు స్పష్టంగా కళ్ళకు కడుతోంది. ఎన్నికలకు ముందు భట్టి విక్రమార్క పాదయాత్రలో భాగాస్వామిగా క్రియాశీలక పాత్ర పోషించాడు.
తాను ప్రజా యుద్ధ నౌకనంటు, ప్రజల గుండె చప్పుడునంటూనే అనేక రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న, అనేక దశాబ్దాలు దేశాన్ని ఏలిన కాంగ్రెసు పార్టీ పడవలో గద్దర్ పెద్ద ప్రణాళికతోనే కాలు పెట్టాడు, కలిసి నడిచాడు. అలా ద్వంద్వ ప్రమాణాలతో, ద్వైదీ భావాన్ని గుండెలనిండా నింపుకుని రెండు పడవలపై కాళ్లు పెట్టి, ఎందరినో మభ్యపుచ్చి రెండు పడవల ప్రయాణం నేర్పుగా – చాకచక్యంతో కొనసాగించాడు. కాంగ్రెసు అగ్రనాయకుడు రాహుల్ గాంధీని బహిరంగ సభలో కలిసి బహిరంగంగా ముద్దుపెట్టి, తాను కాంగ్రెసు పార్టీ తానులోని గుడ్డనేనని తెలంగాణ ప్రజల సాక్షిగా గద్దర్ బహిర్గతం చేసినా అభిమానులెవరూ కిమ్మనలేదు. ద్వంద్వ ప్రమాణాలే జీవనసారం…. సారాంశమని బలంగా నమ్ముతూవచ్చే వెన్నుముకలేని వారికిది ఏమాత్రం ఆశ్చర్యం కలిగించలేదు.
తాజాగా తెలంగాణ “ప్రభుత్వ యుద్ధ నౌక గద్దర్” అని తేటతెల్లమై, గద్దర్ ఫౌండేషన్‌కు మూడు కోట్ల రూపాయలు ఇవ్వడమే గాక, స్మృతివనం కోసం హైదరాబాద్ నెక్లెస్ రోడ్డులో ఎకరం స్థలాన్ని కేటాయిస్తామని అధికారికంగా ప్రకటించినా జరిగిన – జరుగుతున్న మార్పు, పరివర్తన కొత్త ఫ్లెక్సీ మాదిరి ప్రభుత్వ యుద్ధ నౌక గద్దర్ మెరుస్తున్నా డీప్ స్టేట్ పొలిటికల్ డిజిటల్ కుట్రను గద్దర్ అభిమానులు గుర్తించకపోవడం ఘోర తప్పిదం…. అయినా ఆ లోపాన్ని అంగీకరించేందుకు ఎవరూ సిద్ధంగా లేకపోవడం మహా విషాదంగాక ఏమవుతుంది?…. పైగా ఆ ‘హైజాక్’ ప్రక్రియకు, ఆత్మ సమర్పణకు మరింత ‘హైప్’ సృష్టించడానికిగాను అభిమాన గణం రాత్రి – పగలును ఏకం చేస్తోంది. కదిలించాల్సిన తీగల్ని పకడ్బందీగా కదుపుతోంది.
అహరహం శ్రమిస్తూ కొత్త సమీకరణకు ప్రతి ఉషోదయాన స్వాగతాంజలి పలికేందుకు సర్వ సన్నద్ధమవుతోంది. ఎవరిలోనూ వీసమెత్తు ‘వెరుపు’లేదు….. ‘లజ్జ’ అంతకన్నా అగుపించడంలేదు. పైగా అతిపెద్ద పర్వతాన్ని, కలలో కూడా ఊహించని ఎత్తైన కీర్తి పర్వతాన్ని సునాయాసంగా అధిరోహించామన్న సంతోషం… సంబురం వారిలో కనిపిస్తోంది. మైమరిచిన ఆ మైకంలో గద్దర్ ఆశయాల్ని, కన్న కలల్ని సాకారం చేస్తాం – సాధిస్తాం….. అని ఎర్రెర్రదండాలు పలుకుతూ, విప్లవ గీతాలతో నివాళులు అర్పిస్తూ స్వామిభక్తిని చాటుకుంటున్నారు. అక్షరార్చనలు, స్వరార్చనలు చేస్తున్నారు. సామాన్యుల చెవిలో పూలు పెడుతున్నారు.
1972 నుంచి గద్దర్ పాట మాట – ఆట ఎరిగిన వారికి, తొలినాళ్ళలో పాటనే పాశుపతాస్త్రంగా మలిచి ప్రభుత్వాలపై సంధించేందుకుగాను ఆయనకు సహకరించినవారికి, సత్యం – ధర్మం, నిజాయితీ, నిబద్ధత – నిమగ్నతకు పెద్దపీట వేసి సమాజ కల్యాణం, పరోపకారంతో పెద్దమార్పు (విప్లవం) తీసుకొచ్చేందుకు భుజం కాచినవారికి, ప్రజాయుద్ధనౌకగా నిర్మాణం అయ్యేందుకు సహకరించిన ఆనాటి వారికిది ఆశనిపాతంలాంటి పరిణామం! అభ్యుదయ / విప్లవోద్యమ చరిత్రలో ఇదో చెరిగిపోని ‘మరక’గా మిగిలిపోతుంది తప్ప సకారాత్మక పరిణామంగా గుర్తింపు పొందదు. వామపక్ష తీవ్రవాద భావజాలం గల పీపుల్స్వర్ గ్రూపు ప్రభావంతో నాలుగున్నర దశాబ్దాల క్రితం పాటను పదునైన ఆయుధంగా మలిచి, దశాబ్దాల పాటు పాలకులపై ఆయుధాన్ని ఎక్కుపెట్టి తిరుగుబాటుకు – ధిక్కారానికి ప్రతీకగా – చిహ్నంగా నిలిచిన పాటను – ఆయన ప్రతిష్టను ఇప్పుడు ప్రభుత్వ రథచక్రాలను కట్టి ఊరేగడం విభ్రమ గొలుపుతోంది. అందుకు ఊడిగం చేసేందుకు అభిమానులు కట్టకట్టుకుని ముందుకు తోసుకురావడం, అలా తమ ఉనికిని చాటుకునేందుకు తాపత్రయపడటం మహావిషాదమనిపిస్తోంది.
దశాబ్దాల క్రితపు గద్దర్ పాటను – ఆహార్యాన్ని అభిప్రాయాన్ని అనుకరిస్తూ, అనుసరిస్తూ పాలకుల మెప్పుకోసం ఇప్పుడు ప్రదర్శనల్విడంలో పసలేదు – ప్రాసంగికత అసలే లేదు. అర్ధశతాబ్దం క్రితపు తెలంగాణ ఇప్పుడు అంజనమేసి చూద్దామన్నా ఎక్కడా ఆటను కొనసాగిస్తామనడం, అలా నివాళులు అర్పిస్తామనడం భావ దారిద్య్రంతప్ప మరొకటి కనిపించదు కాని ఆనాటి పాట–
కాదు. సమకాలీన సామాజిక స్థితిగతులపై, స్ఫూర్తిదాయకంగా స్పందించడంలో, సాంకేతిక పరిజ్ఞానాన్ని – డిజిటల్ టెక్నాలజీతో పాటు కృత్రిమ మేధ (ఏఐ)ను బడుగు – బలహీన వర్గాలకు పరిచయం చేస్తూ, ఆవిధంగా ప్రజలు సాధికారత సాధించడానికి కృషి చేయడంలోనే సార్ధకత ఉంది.
కృత్రిమ మేధ ఆధారిత మర మనుషులు – రోబోలు మనమధ్య తిరుగుతున్నవేళ, చాట్ జిపిటి, ఇతర సౌకర్యాల ద్వారా మారిన ప్రపంచ ముఖచిత్రాన్ని తెలంగాణ సామాన్యులకు పరిచయం చేయడంలోనే నిజమైన విప్లవం నిక్షిప్తమైందని గద్దర్ అభిమానగణం ఎప్పుడు గుర్తిస్తుందో?…. అలనాటి గద్దర్ సహచరులు గాయకులు – కళాకారులు, వాయిద్యకారులు, గద్దర్ ఇచ్చిన పిలుపునకు స్పందించి ఎందరో అభిమానులు ఇప్పుడు దండకారణ్యంలో భుజాలకు తుపాకులేసుకుని తిరుగుతున్నారు. మరెందరో ప్రాణ త్యాగాలు చేశారు. జనారణ్యంలో ఇక్కడ సర్కారు చంకనెక్కి నెక్లెస్ రోడ్డులో స్మృతి వనం ఏర్పాటుకు, ట్యాంక్‌బండ్‌పై ఆయన విగ్రహం కోసం కొందరు గొంతెత్తి పాడుతున్నారు. ‘ప్రభుత్వ యుద్ధ నౌక గద్దర్” అన్న భావనను మరింత బలపరుస్తున్నారు, చిక్కబరుస్తున్నారు. ఇది ఎంతటి పరస్పర విరుద్ధ వర్ణ చిత్రమో కదా? …..
-వుప్పల నరసింహం,
సీనియర్ జర్నలిస్టు
9985781799