– తెలంగాణలో రామ రాజ్యం పేరుతో రావణ రాజ్యం చేస్తామంటే తీవ్ర చర్యలు
– జీవిత పర్యంతం ధర్మానికే కట్టుబడి జీవించిన శ్రీ రాముని జీవన విధానానికి ఈ చర్యలు విరుద్ధం
– దుండగుల దాడిలో గాయపడి నిర్వేదంలో వున్న చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధానార్చకులు రంగరాజన్ ను పరామర్శించిన మంత్రి కొండా సురేఖ
– రంగరాజన్ పై దాడికి పాల్పడిన వారి పై చట్ట పరంగా తీవ్ర చర్యలకు ఆదేశం
హైదరాబాద్ : హిందూ ధర్మం ఎన్నో నదులను తనలో కలుపుకునే మహాసముద్రం వంటిదని, అదే హిందూ ధర్మం గొప్పతనమని అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. రామరాజ్యం పేరుతో తెలంగాణ రాష్ట్రంలో అశాంతిని సృష్టిస్తూ రావణ రాజ్యం చేస్తామంటే చూస్తూ ఊరుకోమని మంత్రి స్పష్టం చేశారు.
కొందరు దుండగుల దాడిలో గాయపడి తీవ్ర విచారంలో వున్న చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధానార్చకులు రంగరాజన్ తో పాటు వారి తండ్రి సౌందర రాజన్ ను మంత్రి సురేఖ వారి నివాసానికి వెళ్ళి పరామర్శించారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం వారికి అన్నివేళలా అండగా వుంటుందని మంత్రి వారి కుటుంబానికి భరోసానిచ్చారు.
సీఎస్ రంగరాజన్ పై జరిగిన దాడిని మంత్రి సురేఖ తీవ్రంగా ఖండించారు. సంఘవ్యతిరేక శక్తులు తమ స్వప్రయోజనాల కోసం రాముని పేరుతో రాజకీయాలు చేస్తూ, ప్రశాంతంగా సాగుతున్న తెలంగాణ సమాజాన్ని అశాంతికి గురిచేసే చర్యలను ఉక్కుపాదంతో అణచివేస్తామని తేల్చి చెప్పారు. ఎంతో ప్రాచీనమైన హిందూ ధర్మంలో ఎవరి నమ్మకాలు వారివని, తమ నమ్మకాలను ఇతరుల పై రుద్దడం వారి స్వేచ్ఛను హరించడమేనని మంత్రి అన్నారు.
తన జీవిత పర్యంతం ధర్మానికే కట్టుబడి జీవించిన శ్రీరాముని పేరుతో హింసకు పాల్పడటం విచారకరమని అన్నారు. ఈ దాడికి కారకులైన వారిని చట్టబద్ధంగా శిక్షిస్తామని తేల్చి చెప్పారు. భవిష్యత్ లో ఇలాంటి చర్యలకు పాల్పడితే తీవ్ర చర్యలుంటాయని మంత్రి సురేఖ హెచ్చరించారు.