భారతదేశం అనేక మత సమూహాల, ఆచార వ్యవహారాల, తాత్విక భావజాలాల , వైవిధ్య పూరిత భాషల సంస్కృతులతో కూడిన విశాల ప్రదేశం.కేంద్రీకృత మత వ్యవస్థలుగల ఇస్లాం క్రిస్టియన్ మతాలతో పోల్చుకుని వాటిలాగే హిందూ మత నిర్మాణం అనేది కూడా ఉండి ఉంటుందను కోవటం సాధారణంగా జరుగుతూ ఉంటుంది.ఎవరైతే ముస్లింలు కారో… ఎవరైతే క్రిస్టియన్లు కారో… వారు హిందూ మతస్తులు అనే నిర్వచనం చేసి, వారిని ఒకే చట్టబద్ధ నిర్మాణ రూపంలోకి తీసుకు వచ్చిన వారు బ్రిటిష్ పాలకులు.
హిందువులంతా అనాదిగా ఒకే మతస్తులు అయితే వైష్ణవులు శైవులు నడుమ అంత సుదీర్ఘ కాలం వాద వివాదాలు, సంఘర్షణలు ఎందుకు సాగాయి! వారి నడుమ ఆధిపత్య పోరుల తదనంతరం కదా కలివిడి రూపాల దేవుళ్ళు (ఉదాహరణకు వెంకటేశ్వరుడు, అయ్యప్ప) రూపొందింది!
భారత సమాజంలో అవిచ్ఛిన్నంగా సాగుతూ వచ్చినది కుల వ్యవస్థయే గాని ఒకే మతాల వ్యవస్థ కాదు.. . వివిధ మతాల నడుమ అటు నుండి ఇటు, ఇటు నుండి అటు మార్పిడి సౌకర్యం ఉండేది. అదే కుల వ్యవస్థ నుండి మార్పు పొందటానికి ఏమాత్రం అవకాశం లేకపోవడం నాటికే కాదు నేటికీ నిజమే కదా!!
ఆధునిక పరిశ్రమలు, వాటికి అవసరమైన కొత్త కొత్త వృత్తుల పుట్టుక నాటి నుండి కొత్త కులాలు పుట్టడం ఆగిపోయింది.
సరిగా అక్కడి నుండే బ్రిటిష్ వారి పరిపాలనా సౌలభ్యం కొరకు ఏకీకృత మత వ్యవస్థగా హిందూ మతం చట్ట రూపాన్ని పొందింది.అన్య మతాలను ద్వేషించని వాడు హిందువు కాడు అన్నట్టు రాజకీయ ప్రయోజనాల కోసం దాన్ని ప్రస్తుతం వాడుకుంటున్నారు.
కుల వ్యవస్థ పోతే మతం కూడా పోతుందనే భ్రమాత్మక సందేహ భావం కలిగిన మధ్యతరగతి అభద్రతా జీవులు చాలామంది అదే నిజం అనుకుంటున్నారు. భారత సమాజం ఆధునిక ప్రజాస్వామ్య సంస్కృతిని అలవర్చుకోనంత కాలం ఈ పరిస్థితి హెచ్చుతగ్గులతో ఇలాగే ఉంటుంది.
దివికుమార్