Home » తెలుగు చరిత్రకు ప్రాణం పోసిన మహా మనీషి మల్లంపల్లి సోమశేఖర శర్మ

తెలుగు చరిత్రకు ప్రాణం పోసిన మహా మనీషి మల్లంపల్లి సోమశేఖర శర్మ

తెలుగు చరిత్రకు ప్రాణం పోసిన మహా మనీషి మల్లంపల్లి సోమశేఖర శర్మ

రాగిరేకులలో, రాతి ఫలకాలలో కనుమూసిన తెలుగుల చరిత్రకు ప్రాణం పోసిన మహా మనీషి’ మల్లంపల్లి సోమశేఖర శర్మ. ఆ మహనీయుని కలం కుమ్మరించిన లక్షల అక్షరాలు తెలుగువారి చరిత్రను తేజోవంతం కావిస్తూనే వున్నాయి.
సంస్కృతులను గూర్చి ప్రస్తావన రాగానే ముందుగా స్మరణకు వచ్చే పేరు మల్లంపల్లి సోమశేఖర శర్మ గారిది. ఆయన ఏది వ్రాసినా అది శర్మదంగానే ఉంటుంది. తెలుగువారి చరిత్రను శాసనాల నుంచి వెలికి తీసిన మహామనీషి సోమశేఖరశర్మ. తెలుగు భాషా సమితి వారు ప్రచురించిన ఆంధ్రుల చరిత్ర – సంస్కృతి సంపుటంలో ఒక్క చేతిమీదుగా ఆయన సుమారు 50 అంశాల గురించి వ్రాశారు. ఇక ప్రతి పుట ఆయన ఉపజ్ఞా శోభితంగా పరిష్కృతమని వేరుగా చెప్పాల్సిన పనిలేదు.
ఎక్కడైనా శాసనం బయట పడిందని తెలిస్తే, తప్పిపోయిన తమబంధువు జాడ తెలిసినంత సంబరపడి, వెంటనే అక్కడికెళ్ళి సిరా నకలును తీసి, శాసనాల శర్మగా తెలుగునాట స్థిరపడిపోయారు మల్లంపల్లి సోమశేఖర శర్మగారు.
చిలుకూరు వీరభద్రరావు, కాశీనాథుని నాగేశ్వరరావు, కట్టమంచి రామలింగారెడ్డి వంటి మహానుభావుల సహాయసహకారాలతో మన శర్మ గారు ఒక గొప్ప పండితునిగా, చరిత్ర పరిశోధకునిగా, శాసన పరిష్కర్తలుగా, అధ్యాపకునిగా వివిధ రంగాలలో లబ్ధప్రతిష్ఠులయ్యారు.
పశ్చిమగోదావరిజిల్లా, పోడూరు మండలంలోని మనుమించిలిపాడులో 1891, డిసెంబరు 9వతేదీన జన్మించి, అక్కడ స్కూల్లో చదివిన మల్లంపల్లి సోమశేఖర శర్మ తెలుగువారు గర్వించదగ్గ జాతీయస్థాయి చరిత్రకారుడౌతాడని ఆ వూరివారెవరూ ఊహించి వుండరు. తరువాతి చదువు కోసం రాజమండ్రి చేరిన ఆయన, చిలకమర్తి లక్ష్మీనరసింహం పంతులుగారి ‘దేశమాత’ పత్రికలో చేరి రచనకు శ్రీకారం చుట్టారు. ఇంతలో ఆంధ్రదేశ చరిత్రరచనకు పూనుకున్న చిలుకూరి వీరభద్రరావు గారి శిష్యరికం చేసి, శాసనాలను చదవటం నేర్చుకున్నారు.
నికార్సయిన పరిశోధకునిగా గుర్తింపు పొందిన శర్మ గారు ‘ఆంధ్రాభ్యుదయ గ్రంథమాల’ పేరిట ‘ఆంధ్ర వీరులు’, ‘ప్రాచీన విద్యాపీఠాలు’, ‘ప్రాచీనాంధ్ర నౌకాజీవనము’ అన్న పుస్తకాల్ని ప్రచురించారు. శర్మగారి చరిత్ర రచనాతృష్ణను గమనించిన కొమర్రాజు లక్ష్మణరావుగారు, ఆంధ్ర విజ్ఞాన సర్వస్వ సంకలన కార్యక్రమానికి మద్రాసుకు రప్పించిన తర్వాత సోమశేఖరశర్మ గారు చరిత్రకారునిగా గుర్తిపు పొందారు. 1938 నాటికి విజ్ఞాన సర్వస్వం రెండు సంపుటాలను వెలువరించారు.
అటు తర్వాత ‘భారతి’ పత్రికలో చేరి ఎన్నో వ్యాసాలు రాశారు. అటు తర్వాత నేలటూరి వెంకట రమణయ్యగారితో పరిచయమేర్పడి ఆయనతో కడప, కర్నూలు, నెల్లూరు జిల్లాల్లోని శాసనాలు సేకరించి పరిష్కరించటంతో శర్మగారికి శాసనాల పట్ల మక్కువ ఎక్కువైంది. ఆ క్రమంలోనే సంస్కృతం, ప్రాకృతం, కన్నడ భాషల్లోను, లిపి చదవటంలోను ప్రావీణ్యాన్ని సంపాదించారు. రేనాటి చోళుల శాసనాలే తొలి తెలుగు శాసనాలని రుజువు చేశారు. మరుగున పడిన మన చరిత్రకు వెలుగులద్దారు.
శాసన పరిశోధనే ఆశయసాధనంగా జీవించిన శర్మగారు శాతవాహనుల ప్రాకృత శాసనాల నుంచి విజయనగర చక్రవర్తుల వరకూ తెలుగునేల నేలిన రాజన్యుల సంస్కృత, తెలుగు, కన్నడ శాసనాల ఊసుల్ని మనకందించారు. ఘంటసాల ప్రాకృత శాసనాలు, అశోకుని ఎర్రగుడి శిలాశాసనాలు, సింహవర్మ బుచ్చిరెడ్డిపాలెం శాసనం, జయసింహుని రాగిరేకు శాసనాలు అనంతవర్మ చోడగంగుని చినబాదాము శాసనం, విశ్వేశ్వరుని పంచదార్ల శాసనం, కొప్పుల వారి కోరుకొండ శాసనం, ముసునూరి ప్రోలయనాయకుని పోలవరం, విలస శాసనాలు, అహదనకర శాసనం ఆయన పరిశోధించి, పరిష్కరించిన వందల శాసనాల్లో కొన్ని.
కాకతీయుల పతనం తరువాత, పరాయి పాలకుల నెదిరించి తెలుగు వారి ఆత్మగౌరవాన్ని నిలబెట్టిన ముసునూరి వంశీకుల చరిత్రను శాసనాధారాలతో నిరూపించింది.
కొండవీడు, రాజమహేంద్రవర రెడ్డి రాజ్యాల గురించిన సమగ్ర సర్వస్వం.ఈ గ్రంథంలో దాదాపు 125 సంవత్సరాల రెడ్డి రాజ్యాల కాలంలోని సమాజ చరిత్ర చిత్రణ కన్పిస్తుంది.
ఈ రెండు గ్రంథాలు చారిత్రక విషయాలతో పాటు సమకాలీన సాహిత్యం, వర్తకం, వ్యవసాయం, ఇతర వృత్తులు, కళలు, విద్య, వైద్యం ఒకటేమిటి నాటి జనజీవన విధానానికి అద్దం పట్టాయి. మల్లంపల్లి వారి చారిత్రక దృష్టికి, పరిశోధనా పటిమకు పట్టం కట్టాయి.
కొండవీటి రెడ్డిరాజు కుమారగిరిరెడ్డిపై డా.సి.నారాయణరెడ్డి కర్పూర వసంతరాయలు పేరిట రాసిన చారిత్రక దీర్ఘకావ్యాన్ని మల్లంపల్లి వారికి అంకితమిస్తూ ‘రాగిరేకులలో, రాతి ఫలకాలలో కనుమూసిన తెలుగుల చరిత్రకు ప్రాణం పోసిన మహా మనీషి’ అని కొనియాడారు. మరో ప్రసిద్ధ రచయిత విశ్వనాథ సత్యనారాయణ, శర్మగారి పరిశోధనాపటిమను మెచ్చుకుని తాను రాసిన చారిత్రక కావ్యం ‘ఆంధ్రప్రశస్తి’ ఆయనకు అంకితమిచ్చారు.
లిపి శాస్త్రంలోనే గాక ఆంధ్ర వాస్తు శిల్ప స్వభావ నిరూపణలో, ప్రతిమా స్వరూప నిర్ణయంలో శర్మ నిష్ణాతుడు. అమరావతీ స్తూపము అన్న అతని రచన ఇందుకు తార్కాణము. మొగల్‌రాజపురంలోని దుర్గ గుహలో మూలవిరాట్ స్థానంలో అస్పష్టంగా ఉన్న కుడ్య శిల్పాన్ని గుర్తించి అది అర్ధ నారీశ్వర మూర్తి అని సహేతుకంగా నిరూపించాడు. శర్మగారు చరిత్రకారుడే కాదు; చక్కటి కథనశైలితో రాయగల రచయిత కూడా. దేశమాత, భారతి పత్రికల్లో పనిచేసినపుడు కథలు, కథానికలు, నాటికలు, నవలల్ని కూడా రాశారు.
శర్మగారి సాదా సీదా జీవితాన్ని, నిరాడంబరత, నిక్కచ్చితనాన్ని గురించి రెండు ముక్కలు చెప్పుకోవాలి. శర్మగారు ఆంధ్రా యూనివర్శిటీ, చరిత్ర విభాగంలో ఉపన్యాసకునిగా పనిచేస్తున్నప్పుడు, విశ్వవిద్యాలయ ప్రాంగణంలో కనిపించిన ఒక శిష్యుణ్ని తెల్లటి దుస్తులు ధరించి, పైన శాలువా కప్పుకుని వున్న శర్మగారు తన ఇంటికి రమ్మన్నారు.
ఆ శిష్యుడు, ఆయనతోపాటే ఆయన ఇంటికి వెళ్ళాడు. శిష్యుడ్ని కూర్చోమన్న శర్మగారు, తన భుజాలపైన కప్పుకున్న శాలువా తీసి కొంకెకు తగిలించారు. శర్మగారి తెల్ల చొక్కాభుజాలపైన చిరుగులు కనపడటంతో చిరుగుల వెనుక దాగి వున్న పేదరికాన్ని శాలువాతో కప్పి, విధులు నిర్వర్తిస్తున్న ఆయనలో మరో మహాత్ముణ్ణి చూసుకుని కళ్ళు చెమర్చుకున్నాడు ఆ శిష్యుడు. ఆ శిష్యుడెవరో కాదు, సుప్రసిద్ధ చరిత్రకారుడు వకుళాభరణం రామకృష్ణ గారు.
ఒకసారి శర్మగారు, మద్రాసు నుంచి కర్నూలు జిల్లా ఎర్రగుడిలోని అశోకుని బ్రాహ్మీ (ప్రాకృత) శిలాశాసనాల నకళ్ళను తీయటానికి అక్కడకెళ్ళారు. వెంటనే తిరిగొద్దామనుకున్న ఆయన, వర్షం వల్ల మరో మూడు రోజులు అక్కడే వుండిపోవటాన, తిరిగి వెళ్ళటానికి రైలు ఛార్జీలు తక్కువపడ్డాయి. కడపజిల్లా నందలూరులో వున్న తన మిత్రుడు రామిరెడ్డికి ఉత్తరం రాసి, డబ్బులు తెప్పించుకుని మద్రాసు వెళ్ళిన తరువాత, ఆ డబ్బుల్ని వెంటనే పంపి రుణం తీర్చుకున్న శర్మగారు, తాను పేదరికంలో వున్నా, తన పరిశోధనల ద్వారా తెలుగువారి చరిత్రను సుసంపన్నం గావించిన మహనీయుల సరసన చేరారు.
ఆంధ్ర విశ్వవిద్యాలయ చరిత్రశాఖను సమర్థుడైన అధ్యాపకులతో పరిపుష్టం చేయాలన్న తలంపుతో శర్మగారికి చరిత్రోపాధ్యాయునిగా ఉద్యోగమిచ్చిన వి.ఆర్‌.కృష్ణ గారికి, ప్రోత్సహించిన కట్టమంచి రామలింగారెడ్డి గారికి తెలుగు వారంతా కృతజ్ఞులై వుండాలి. 1963 వరకూ చరిత్రోపన్యాసకునిగా పని చేసాడు.
మేము శిలలమైనా మాకూ మనసులున్నాయి’ అంటూ శిలా శాసనాలు మూగగా రోదించిన రోజు శర్మగారు 1963 జనవరి 7వ తేదీన మనల్ని విడిచి వెళ్లినా, ఆయన కలం కుమ్మరించిన లక్షల అక్షరాలు తెలుగువారి చరిత్రను తేజోవంతం కావిస్తూనే వున్నాయి.
ప్రాచీన భారత దేశ చరిత్రకు భండార్కర్ లాగా, మహారాష్ట్ర చరిత్రకు నర్దేశాయ్ లాగా, దక్షిణ భారతదేశ చరిత్రకు నీలకంఠ శాస్త్రి వలె మన ఆంధ్రదేశ చరిత్రకు శ్రీ మల్లంపల్లి సోమశేఖర శర్మ గారు ప్రాతఃస్మరణీయులు.
Collected by
A.Srinivasa Reddy
9912731022
Zphs Munugodu Amaravathi mandal Guntur distric

Leave a Reply