– ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
తెలంగాణ సచివాలయానికి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ పేరు పెట్టడం పట్ల టిఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హర్షం వ్యక్తం చేశారు. ఇది చారిత్రాత్మక నిర్ణయంగా అభివర్ణించారు. అంబేద్కర్ పట్ల ఉన్న గౌరవాన్ని సీఎం కేసీఆర్ మరోసారి సగర్వంగా చాటుకున్నారని ప్రశంసించారు. పార్లమెంట్ భవనానికి కూడా అంబేద్కర్ పేరును పెట్టి బిజెపి ప్రభుత్వం తన చిత్తశుద్ధి నిరూపించుకోవాలని డిమాండ్ చేశారు.
భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 3ని అంబేద్కర్ పొందుపరచడం వల్లనే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సాధ్యమైందని, అన్ని రంగాల్లో ప్రగతి పథంలో ముందుకు సాగుతున్న తెలంగాణ పరిపాలన సముదాయమైన సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టాలని సీఎం కెసిఆర్ నిర్ణయించడం తెలంగాణకే గర్వకారణమని తెలిపారు. సీఎం కేసీఆర్ తీసుకున్న ఈ నిర్ణయం భారతదేశానికి ఆదర్శమని స్పష్టం చేశారు. అంబేద్కర్ స్పూర్తితో అన్ని వర్గాల అభ్యున్నతికి కృషి చేస్తున్న టిఆర్ఎస్ ప్రభుత్వం మరో చారిత్రక నిర్ణయాన్ని తీసుకుందని చెప్పారు.
ఢిల్లీలో నూతనంగా నిర్మిస్తున్న పార్లమెంటు భవనానికి అంబేద్కర్ పేరు పెట్టాలని సీఎం కెసిఆర్ చేస్తున్న డిమాండ్ ని, తెలంగాణ అసెంబ్లీ పంపించిన తీర్మానాన్ని బిజెపి నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం స్వీకరించాలని డిమాండ్ చేశారు. పార్లమెంటు భవనానికి అంబేద్కర్ పేరు పెడితే భారతదేశం ప్రతిష్ట గౌరవం ప్రపంచవ్యాప్తంగా మరింత పెరుగుతుందని అభిప్రాయపడ్డారు. కాబట్టి పార్లమెంట్ భవనానికి అంబేద్కర్ పేరు పెట్టి రాజ్యాంగం పట్ల ఉన్న చిత్తశుద్ధిని బిజెపి నిరూపించుకోవాలని సవాల్ విసిరారు. ఈ దిశగా తెలంగాణ బిజెపి నేతలు కూడా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని కల్వకుంట్ల కవిత సూచించారు.