– జగన్ తప్పులను చరిత్ర క్షమించదు
– క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా పనిచేసే నేతలకే పార్టీలో గుర్తింపు
– ఈ ఏడాది మనకు కీలకం…త్వరలో కార్యక్రమాలపై కార్యాచరణ
– కరోనా కంటే జగన్ వైరస్ రాష్ట్రానికి ప్రమాదకరం
– పార్లమెంటు, అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ చార్జిల సమావేశంలో తెలుగుదేశంపార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు ప్రసంగం
ప్రత్యర్థులపై మనం చేస్తున్నది రాజకీయ యుద్ధమే…భౌతిక యుద్ధం కాదు. ప్రభుత్వ విధానాలపై ప్రజల్లో చైతన్యం తెచ్చి ఎండగట్టాల్సిన బాధ్యత అందరిదీ. క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా పనిచేసే నాయకులకే పార్టీలో గుర్తింపు ఉంటుంది. తెలుగుదేశం పార్టీకి 70లక్షలమంది సైన్యం ఉంది. వారికి ఏ ఇబ్బంది వచ్చినా మేమున్నామని నాయకులు భరోసా ఇవ్వాలి. తెలుగుజాతి అభివృద్ధి కోసం తెలుగుదేశం పార్టీ ఎంతో కృషి చేసింది. త్వరలో మెంబర్ షిప్ డ్రైవ్ ప్రారంభిస్తాం…. మార్చి 29నాటికి పార్టీ ప్రారంభించి 40 సంవత్సరాలు అవుతుంది, ఆ తర్వాత మహానాడు ఉంటుంది. మే 28న దివంగతనేత ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు నిర్వహించాల్సి ఉంది.
స్థానిక కమిటీలను ఎన్నుకొని సంస్థాగతంగా బలోపేతంకావాల్సిన అవసరం ఉంది. మారుతున్న కాలానికి అనుగుణంగా సోషల్ మీడియాపై కూడా దృష్టి సారించాలి, కమ్యూనికేషన్ లో వస్తున మార్పులకు అనుగుణంగా మన పంథా మారాలి. 2022 మనకు అత్యంత కీలకమైన సంవత్సరం. త్వరలో రాబోయే ఏడాదికి సంబంధించి నిర్వహించాల్సిన కార్యక్రమాలపై కార్యాచరణ తయారు చేస్తాం. సమాజమే దేవాలయం, పేదవారే దేవుళ్లు అనే మూల సిద్ధాంతంతో స్వర్గీయ ఎన్టీఆర్ పార్టీని స్థాపించారు. టీడీపీకి ఎన్టీఆర్ బలమైన పునాదులు వేశారు. ఆయన ఆశయసాధనకు యావత్ తెలుగుదేశం పార్టీ కుటుంబం పునరంకితం కావాల్సిందిగా కోరుతున్నాను.
జగన్ రెడ్డి పాలన ప్రారంభమై 32 నెలలు గడిచింది. ఇంకా సుమారు రెండేళ్ల కాలం మిగిలి ఉంది. రాష్ట్రానికి వైసీపీ గ్రహణం పట్టింది. అన్ని వ్యవస్థలను భ్రష్టు పట్టించారు. విధ్వంసం చేశారు. ఎవరైనా మాట్లాడితే తప్పుడు కేసులు పెడుతున్నారు. టీడీపీని నిర్వీర్యం చేయాలనే కుట్ర పన్నారు. ఒక పక్క బాధ, మరోపక్క ఆవేదన ఉంది. ఇక్కడ ఈ వేదికపై ఉన్న నాయకులందరిపై అక్రమ కేసులు ఉన్నాయి ఎన్నో సేవా కార్యక్రమాలు చేసిన, భూములు దానం చేసిన అశోక్ గజపతిరాజుపైనా అక్రమ కేసులు పెట్టారు. ఆయన ఎక్కడా ఒక్క పైసా అవినీతికి పాల్పడలేదు. రామతీర్థంలో ధర్మకర్త పేరే లేదు. ఎందుకు లేదు అని ప్రశ్నిస్తే కేసు పెట్టారు. శాసనసభ జరిగే పరిస్థితి లేదు. జరిగినా ప్రజాసమస్యలపై చర్చించకుండా ప్రత్యర్థులపై బూతులతో ఎదురుదాడికి దిగుతూ చట్టసభల గౌరవాన్ని మంటగలుపుతున్నారు.
శాసనమండలి ఛైర్మన్ గా ఉన్నప్పుడు షరీఫ్ గారి పట్ల ఏవిధంగా వ్యవహరించారో చూశాం. పోలీసు వ్యవస్థను భ్రష్టు పట్టించారు. అడ్డగోలు నిర్ణయాలపై తీర్పులిచ్చిన న్యాయవ్యవస్థపైనా దాడికి దిగారు.
టీడీపీకి అధికారం కొత్తకాదు, ప్రతిపక్షం కొత్తకాదు. అయితే నేడు అనేక నూతన సవాళ్లు ఉన్నాయి. రాష్ట్రం కోలుకోలేని పరిస్థితిలో ఉంది. ఇంత దారుణ పాలన గతంలో ఎప్పుడూ లేదు. జగన్ రెడ్డికి విశ్వసనీయత లేదు. తండ్రి అధికారంలో ఉన్నపుడు ఆయనను అడ్డుపెట్టుకుని పెద్దఎత్తున అవినీతికి పాల్పడ్డాడు. 11 సీబీఐ కేసులు ఉన్నాయి. చాలా మంది ముఖ్యమంత్రులను చూశా. ఇంత పనికిమాలిన, మూర్ఖపు ముఖ్యమంత్రిని ఇప్పుడే చూస్తున్నా. రాష్ట్ర విభజన కంటే జగన్ రెడ్డి చేసిన నష్టం ఎక్కువ. కోలుకోవడానికి చాలా ఏళ్లు పడుతుంది. రూ.22,945 కోట్ల రెవెన్యూ లోటుతో రాష్ట్రం ఏర్పడింది.
2014-19 మధ్య టీడీపీ సుపరిపాలన అందించింది. టీడీపీ అమలు చేసిన సంక్షేమ కార్యక్రమాలు ఎవరూ అమలు చేయలేదు. అయిదేళ్లలో ఎప్పుడూ పన్నులు పెంచలేదు. ఇరిగేషన్ కు రూ.64వేల కోట్లు ఖర్చు చేశాం. అమరావతి ద్వారా రాష్ట్రానికి రూ.2లక్షల కోట్ల సంపద వచ్చింది. పోలవరం ప్రాజెక్ట్ పనులను
చిత్తశుద్ధితో చేపట్టి 70శాతానికి పైగా పూర్తిచేశాం కియా, హీరో మోటార్స్ వంటివి వచ్చాయి. 5 లక్షల మందికి ఉద్యోగాలు వచ్చాయి. రూ.5 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. 16 లక్షల కోట్ల పెట్టుబడులకు ఎంవోయూలు జరిగాయి. నేడు ఒక్క పరిశ్రమ రావడం లేదు. అప్పు మాత్రం రూ.7 లక్షల కోట్లకు చేరింది. ఉద్యోగులకు తెలంగాణతో సమానంగా 43శాతం ఫిట్ మెంట్ ఇచ్చాం. చరిత్రలో ఇంత పెద్ద మొత్తంలో ఉద్యోగులకు ఎవరూ లబ్ధి చేకూర్చలేదు.
నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగాయి. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరల్లో దేశంలోనే ఏపీ నెం.1. రాష్ట్రప్రజలు సంక్రాంతి కూడా జరుపుకోలేని పరిస్థితి. టీడీపీ ఇచ్చిన సంక్రాంతి, క్రిస్మస్, రంజాన్ కానుకలను రద్దు చేశారు. నేడు ఆర్టీసీ, మున్సిపల్ ట్యాక్స్, హౌస్ ట్యాక్స్, ప్రాపర్టీ ట్యాక్స్, ప్రొఫెషనల్ ట్యాక్స్,.. చివరకు చెత్తపైనా పన్నువేసిన దుర్మార్గపు ప్రభుత్వం జగన్ రెడ్డి ప్రభుత్వం. చెత్త పన్ను కట్టకపోతే వారి ఇంట్లోనే వేయాలని వైసీపీ ఎమ్మెల్యే చెబుతున్నారు. పేదవారికి అరచేతిలో స్వర్గం చూపించి ఇప్పుడు పన్నుల భారంతో వారి నడ్డి విరిచారు. మరుగుదొడ్డిపైనా పన్ను వేశారు. ఓటీఎస్ పేరుతో పేదలను దోచుకున్నారు. దేశంలో ఎవరూ కట్టని విధంగా రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం ఇళ్లు నిర్మించింది. పేదవారికి ఆస్తి సృష్టించాం. దేశంలోనే ఎక్కడా లేనివిధంగా పేదలకు 2.65 లక్షల విలాసవంతమైన టిడ్కో నిర్మిస్తే అవి ఇవ్వడానికి జగన్ రెడ్డికి మనసు రావడం లేదు.
జగన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో అన్ని వ్యవస్థలు దెబ్బతిన్నాయి, ఉపాధి లేదు, ఉద్యోగాల కోసం పొరుగు రాష్ట్రాలకు వలస వెళ్తున్నారు. జగన్ రెడ్డి పాలనలో రైతులు చితికిపోయారు. జగన్ ఒక ఫేక్ ముఖ్యమంత్రి… ఆయన చెప్పేవన్నీ అబద్ధాలు. ప్రధాని ఇచ్చే పీఎం కిసాన్ సాయం రూ.6వేలకు జగన్ రెడ్డి రూ.7,500 కలుపుకుని రూ.13,500 తామే ఇస్తున్నామని అబద్ధాలు చెబుతున్నారు. టీడీపీ
హయాంలోనే రూ.2వేలు పెన్షన్ ఇచ్చాం. టీడీపీ వచ్చి ఉంటే 3వేలు ఇచ్చేది. రూ.2వేలు తామే ఇచ్చామని జగన్ రెడ్డి సిగ్గు లేకుండా అబద్ధాలు చెబుతున్నారు. రాష్ట్రంలో ఏ ఆసుపత్రిలో కూడా మందులు లేవు. ఏజెన్సీలో గర్భిణీలకు ప్రసవాలకు ఆసుపత్రుల్లో సౌకర్యాలు లేని పరిస్థితి. తల్లీ- బిడ్డా ఎక్స్ ప్రెస్ అటకెక్కింది. విద్యారంగాన్ని కూడా భ్రష్టు పట్టించారు.
ఇంగ్లీషును టీడీపీ వ్యతిరేకిస్తోందని దుష్ప్రచారం చేస్తున్నారు. ఆయన చెప్పేదే నిజమైతే ఇంగ్లండ్, అమెరికాలో ఇంగ్లీషు మాట్లాడే వారికే అన్ని ఉద్యోగాలు రావాలి కదా. మనవారికి ఎందుకు వస్తున్నాయి? భాష కంటే జ్జానం ముఖ్యం. నాడు-నేడు పేరుతో పెద్దఎత్తున అవినీతికి పాల్పడుతున్నారు. నాసిరకం పనులు చేస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలలను నాశనం చేస్తున్నారు. 32నెలల్లో ఒక్క కొత్త టీచర్ ను నియమించలేదు. బెస్ట్ అవైలబుల్ స్కూల్స్, విదేశీ విద్య పథకాన్ని నాశనం చేశారు. పేద పిల్లలు చదువుకోలేని పరిస్థితి. జగన్ రెడ్డి పిల్లలు విదేశాల్లో చదువుకోవచ్చు కానీ.. పేద పిల్లలు చదువుకోకూడదా? తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఐటీని అభివృద్ధి చేయడం వల్ల లక్షలాది మంది పిల్లలు విదేశాలకు వెళ్లగలిగారు, తద్వారా పేదరికం నుంచి బయటపడ్డారు.
టిడిపి ప్రభుత్వం ఇసుకను ఉచితంగా ఇస్తే.. నేడు 5 రెట్లు ధరలు పెంచారు. నేడు ఎక్కడా ఇసుక లభించే పరిస్థితి లేదు. ఇతర రాష్ట్రాల్లో మన ఇసుక దొరుకుతోంది. జగన్ రెడ్డి తమవారికి చెందిన నాసిరకం మద్యం బ్రాండ్లను రాష్ట్రంలో తీసుకువచ్చారు. దీంతో అనేక మంది అనారోగ్యం పాలయ్యారు. డిస్టలరీలు కూడా
జగన్ రెడ్డి మనుషులవే. పంపిణీ కూడా ఆయనదే. మద్యం దుకాణాల్లో ఆన్ లైన్ పేమెంట్స్ ఎందుకు అనుమతించడం లేదు? 5వతేదీ వచ్చినా ఉద్యోగులకు ఈ రోజుకు కూడా జీతాలు రాలేదు, పెన్షన్లు రాలేదు. పీఆర్సీ, సీపీఎస్, డీఏలు ఎటో పోయాయి. ఉద్యోగుల పీఎఫ్ సొమ్ము వాడేసుకున్నారు. దీనివల్ల భవిష్యత్ లో పెన్షన్ కూడా వచ్చే పరిస్థితి ఉండదు.
టిడిపి ప్రభుత్వ హయాంలో నరేగా పథకంలో పనులుచేసిన వారిని బిల్లులు ఇవ్వకుండా వేధించారు. పార్టీపరంగా, న్యాయపరంగా మనంచేసిన పోరాటం వల్ల 70శాతం వరకు ఇచ్చారు. చివరి రూపాయి అందేవరకు తెలుగుదేశం పార్టీ పోరాటం కొనసాగిస్తుంది.ప్రజలకోసం మనం అన్న క్యాంటిన్లు పెడితే జగన్ రెడ్డి రద్దుచేశారు. తమిళనాడులో గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన అమ్మ క్యాంటీన్లను కొనసాగిస్తున్నారు.
కరోనా కంటే జగన్ రెడ్డి వైరస్ ప్రమాదకరం. అనేక మంది ఆర్థికంగా, శారీరకంగా, మానసికంగా చితికిపోయారు. ఎంత భయపెట్టినా టీడీపీ కార్యకర్తలు వీరోచితంగా పోరాడుతున్నారు. నాయకులు అండగా నిలబడితే కేడర్ మరింత ఉత్సాహంగా పనిచేస్తుంది. ఈ ఏడాది మనకు చాలా కీలకమైనది.
సమస్యలపై క్షేత్రస్థాయిలోకి వెళ్లి ప్రజలను చైతన్యం చేయాలి. పోరాటాలకు ప్రజలను సంసిద్ధం చేయాలి.
జగన్ రెడ్డి అరాచకాన్ని ఎదుర్కోవాలంటే అందరం కలిసి ఉద్యమించాలి. ఆర్యవైశ్యులు సమావేశం పెట్టుకుని జగన్ రెడ్డి నుంచి మనల్ని మనం కాపాడుకోవాలి అనే పరిస్థితి వచ్చింది. అటువంటి వారికి టీడీపీ మద్దతుగా నిలవాలి. వైసీపీ నేతల అవినీతిని, స్థానికంగా జరుగుతున్న అరాచకాల్ని ఎక్కడికక్కడ ఎండగట్టాలి.