Suryaa.co.in

Andhra Pradesh

మేం అప్పులు చేస్తున్నది కూడా అభివృద్ధికి పనికివచ్చే సంక్షేమం కోసమే

– షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలకు వెళతాం..
– పీఆర్సీపై రేపు స్పష్టత వచ్చే అవకాశం.
– ప్రభుత్వ సలహాదారు(ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి ప్రెస్ మీట్

బాబు ఎన్ని కథలు చెప్పినా ప్రజలు నమ్మరు
జూమ్‌ కాన్ఫరెన్సులు, వీడియో కాన్ఫరెన్స్‌ల ద్వారా స్వేచ్ఛ, కాల పరిమితి, సమయాభావం అనేది ఉండదు కాబట్టి చంద్రబాబు నాయుడు కోవిడ్‌ వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకూ.. రోజువారి తన దినచర్యలో భాగంగా గంటో, రెండు గంటలో రాష్ట్రం గురించి, గతంలో తను చేసిన పాలన, ఇప్పటి పాలన, హైదరాబాద్‌కు తాను చేసిన అభివృద్ధి అంటూ చాగంటివారి ప్రవచనాల్లా చెప్పుకుపోతున్నారు. అప్పుడప్పుడు బిల్‌ క్లింటన్‌ను కూడా తలచుకుంటున్నారు. బాబు మాటలను మీడియా కూడా ఎంతోకొంత ప్రజల్లోకి తీసుకుపోయే ప్రయత్నం, వన్‌వే ట్రాఫిక్‌లా చేస్తుంది.

తాను అధికారంలో ఉన్నప్పుడు ఏ తప్పులు అయితే చేశారో… వాటి ద్వారా ప్రజలు ఆయనను మీరు వద్దంటూ ఎలా సాగనంపారో.. వాటన్నింటిని కళ్లు మూసుకుని… జగన్‌ మోహన్‌ రెడ్డిగారి పాలన మీద, జగన్ గారి మీద వ్యక్తిగతంగా నిందలు వేస్తూ, అసత్యాలు ప్రచారం చేస్తున్నారు. దేనికీ ఆధారం ఉండదు, బాబుది ఒక్కటే థీమ్‌.. డార్క్ రూల్ అని చెప్పడమే.

చంద్రబాబు ఎన్నికథలు చెప్పినా, ఎన్ని అబద్ధపు ప్రచారాలు చేసినా ప్రజలు నమ్మలేదు. మా పార్టీ 2014లో అడుగులు వేస్తున్న చిన్నపార్టీ. ఎలాంటి వనరులు లేని పార్టీ మాది అప్పట్లో. 2019 వచ్చేసరికి ఒక ఆర్గనైజేషన్‌లా రూపుదిద్దుకుని ఎన్నికల్లోకి రాగలిగాం. అలాంటి పార్టీని, ఆ నాయకుడిని నమ్మి ప్రజలు అంత భారీ మెజార్టీతో తీర్పు ఇచ్చారంటే.. చంద్రబాబు ఇప్పటికైనా తమలో ఉన్న లోపాలను ఆత్మపరిశీలన చేసుకుని, దానికి తగినట్లు మార్పులు చేసుకుంటారని అనుకుంటే అది భ్రమే అని పదేపదే రుజువు చేస్తున్నారు.

రెండున్నరేళ్లలో వచ్చిన ఎన్నికల ఫలితాలు చూసి అయినా చంద్రబాబుకు ఇంకా బుద్ధి రాలేదు. అదే టోన్‌, అదే టోనర్‌. పైగా విజృంభించి మరీ విషం కక్కడం ఎక్కువ అయింది. తెలుగు సినిమాల్లో చూస్తే విలన్‌ల ముఠా ఎప్పుడూ సణుక్కుంటూ కూర్చునేది. చిన్నపాటి అవకాశం దొరికినా శాపనార్థాలు పెట్టుకుంటా ఉంటారు. ఉబుసుపోక చెట్టుకింద కూర్చుని కళ్లు మూసుకుని వల్లెవేయడంలా చంద్రబాబు పరిస్థితి కూడా తయారైంది. ఈరోజు చంద్రబాబు రెండు గంటల ప్రసంగం చూస్తే.. అలాగే ఉంది. ఆయన ఏ బేసిస్‌ మీద మాట్లాడారో తెలియదు. పిల్లి శాపాలు పెట్టడం ఏంటి..?

కుప్పంలోనే అభ్యర్థిని మార్చాలి కదా..
సీనియర్‌ నాయకుడు అని చెప్పుకునే చంద్రబాబు వల్ల రాష్ట్రానికి ఏమైనా ప్రయోజనం కలుగుతుందా….? వారి, అధికారిక పత్రికల్లో, టీవీల్లో ఒక గంట స్పేస్‌ ఇవ్వడం తప్ప. ఎప్పుడైతే కుప్పంలో ఓటమి పాలయ్యారో… ఎస్‌, మనం ఇక పైకి లెగవలేమని వాళ్ల కార్యకర్తలకు కూడా అర్థమైంది. రాబోయే ఎన్నికల్లో ఢీ అంటే ఢీ అనగలగే నాయకులకే టిక్కెట్లు ఇస్తానని చంద్రబాబు అన్నారట. అలాంటప్పుడు ముందుగా

మార్చాల్సింది కుప్పంలోనే కదా. అక్కడ పార్టీ మొత్తంగా గల్లంతు అయింది. మీరు ఎంతగా దిగజారిపోయారంటే ఆఖరికి ఒక వార్డు, మండలమో గెలిచామని చెప్పుకోవడం చూస్తుంటే సిగ్గుచేటు. మరి కుప్పంలో ఓటమి గురించి ఎవరు వివరణ ఇస్తారు…? మరి అక్కడ కూడా నాయకుడిని మార్చాలి కదా? యూ ఆర్‌ ఏ ఫెయిల్డ్‌ పార్టీ, ఫెయిల్డ్‌ లీడర్‌ మీరు. ఎందుకంటే ఎలాంటి కష్టం లేకుండా అప్పనంగా వచ్చిన అధికారం, కష్టపడి నిర్మించుకున్న పార్టీ కూడా కాదు.

ఒరిజినల్‌ పార్టీ పెట్టిన ఎన్టీఆర్‌ ఎంతో కష్టపడ్డారు. ఆయనకు వెన్నుపోటు పొడిచి పార్టీని, పదవిని లాక్కున్న తర్వాత, సుదీర్ఘ కాలం టీడీపీ చంద్రబాబు నాయుడు చేతిలో ఉంది. అది సీబీఎన్‌ పార్టీ. సీబీఎన్‌-టీడీపీ… ఆ క్రెడిటో, డెబిటో ఆయననే తీసుకోమని చెప్పండి. ఎన్టీఆర్‌ అంటే ఒక మండలి వ‍్యవస్థను చెబుతారు. అదే చంద్రబాబు క్రెడిట్‌ ఏంటో ఒక్కమాట చెప్పమనండి. చంద్రన్న కానుక, రంజాన్‌ తోఫా, అన్న క్యాంటిన్‌ లు తీసేశారు అని మాత్రమే చెబుతారు. రూ.3లక్షలలు ఖర్చయ్యే క్యాంటీన్ ను రూ.30 లక్షలకు కట్టి, అందులో అయిదారువందల మందికి భోజనాలు పెట్టడమా? ఇదేనా పరిపాలన, రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా తీసుకువెళ్ళటం అంటే..? ఎన్నికలు దగ్గరకు వస్తున్నాయని ఓట్లకోసం, చివరిలో పసుపు-కుంకుమ పథకం పేరుతో డబ్బులు పంచిపెడితే.. ప్రజలు ఏ విధంగా ఛీ కొట్టారో చూశాం.

రాజకీయం అంటే అమ్మడాలు… కొనడాలు అని అర్థం మార్చింది బాబే
చంద్రబాబు నాయుడు క్రియేట్‌ చేసిన చెడు సంప్రదాయాలు, 1980 తర్వాత, లేదా టీడీపీ రీజనల్‌ పార్టీ అయిన తర్వాత, ఎక్కడాలేని గల్లీ రాజకీయాలు తెచ్చి, ఇదే రాజకీయం అంటే అమ్మడాలు… కొనడాలు, రాత్రికి రాత్రి పొత్తులు పెట్టుకోవడంగా మార్చేశారు. ఒక్కసారి అయినా ఎన్నికల్లో ఒంటరిగా బరిలోకి దిగుతామని.. ప్రజల్లో మాపై విశ్వాసం ఉంది, ప్రజల్లోకి వెళ్లి తెలుగుదేశం పార్టీకి ఓటు వేయండి అని చెప్పగలిగే ధైర్యం మీకు లేదు. మీ బతుకు అంతా, అటూ ఇటూ ఎవరో ఒకర్ని పెట్టుకుని ఊతకర్రల మీద డిపెండ్‌ అవడమే.

ఎన్నికల సమయంలో ఎవర్ని అయినా సరే వాడుకుని, అవతలి వారివి నాలుగు ఓట్లు చీల్చాలి, లేకుంటే ఎవరైనా ఓట్లు తెచ్చిస్తారా?… అనే ధోరణితోనే వ్యవహరించడం బాబుకు బాగా అలవాటు. కాదు మొర్రో అని జనం బుద్ధి చెప్పినా.. చంద్రబాబు అదే అచ్చేసుకుంటూ వచ్చారు. ప్రజాస్వామ్యంలో ఎలాంటి దుష్ట సంప్రదాయాలు, విష సంస్కృతి ఉండకూడదో వాటికి జగన్‌ మోహన్‌ రెడ్డి అధికారంలోకి వచ్చాక, సంపూర్ణంగా స్వస్తి పలికారు. వర్గ, కుల, మతాలకు, ప్రాంతాలకు సంబంధించి మా ముఖ్యమంత్రిగారు లెక్కలు వేయడం లేదు. అందుకే ఆయన ఒక్క బటన్‌ నొక్కి సంక్షేమాన్ని అందించగలుగుతున్నారు. అట్టడుగు వర్గాలకు, మహిళలకు ప్రాధాన్యత ఇస్తూ ముందుకు వెళుతున్నారు. ఆ ఆత్మవిశ్వాసం ఎక్కడ నుంచి వచ్చిందంటే ప్రజల్లో తాను కూడా వారి కుటుంబసభ్యుల్లో ఒకడిగా ఓన్‌ చేసుకోగలిగిన రోజే వస్తుంది.

ఆరోజుల్లో వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి తన పరిమితి మేరకు రెండు అడుగులు ముందుకు వేస్తే ప్రజలు హత్తుకున్నారు. ఇక ఆయన తనయుడు పూర్తిగా ప్రజా సేవకే అంకితమై, ప్రజలతో మమేకం అయితే ఎంతగా హత్తుకుంటారో అని చేసిన ఎక్స్‌పరిమెంట్‌ సత్ఫలితాలను ఇస్తోంది.
మనం అందించే ఫలాలు ప్రజలకు, భవిష్యత్‌ తరాలకు ఉపయోగపడితే వాళ్లు మనల్ని ఓన్‌ చేసుకుంటారని ముఖ్యమంత్రి అన్న మాటలు ప్రూవ్‌ అయ్యాయి. ఇంత కచ్చితంగా ప్రజా తీర్పు వస్తున్నా… బాబుకు ఇవేమీ పనికిరావంటే ఏంచెప్పాలి.

అభివృద్ధికి పనికివచ్చే సంక్షేమం కోసమే అప్పులు
మీ దుష్ట సంప్రదాయాన్ని వదిలేసి, మీ పార్టీ నాయకుల్ని, కార్యకర్తల్ని ప్రజల్లోకి వెళ్లి పనిచేయమని చెప్పంది. చంద్రబాబు అవునన్నా…కాదన్నా సంక్షేమం కోసమే అప్పులు చేశాం. ఆ సంక్షేమం కూడా అభివృద్ధికి పనికివచ్చేదే. ఇందులో డీబీటీ ద్వారా, ఇప్పటివరకూ రూ. లక్షా 21వేల కోట్లు లబ్దిదారుల ఖాతాల్లో జమ అయింది. పెన్షన్లు కూడా నెలవారీగా ఠంఛన్‌గా అందుతున్నాయి.

దిక్కుమాలిన పత్రిక ఆంధ్రజ్యోతి రాతలు చూస్తే… 37శాతం కూడా పెన్షన్ల పంపిణీ పూర్తి కాలేదంటూ అడ్డగోలు రాతలు రాసింది. అదే చంద్రబాబు పాలనలో నెలంతా చూసినా ఐదు, పది శాతం పూర్తి కాదు కదా.. రాయడానికి అయినా, చెప్పడానికైనా సిగ్గు ఉండాలి కదా? వీళ్లు ఎంతవరకూ పోతున్నారంటే ప్రజాస్వామ్యంలో విఫలమైన నాయకులే గొప్పవాళ్ళు అని అంటున్నారు.

సంక్షేమ యజ్ఞం ఆగకూడదని ముందుకు వెళుతున్నాం
జగన్‌ మోహన్‌ రెడ్డిగారి సంక్షేమ – అభివృద్ధి బాట దేశమంతా ప్రశంసిస్తోంది. దాన్ని కాదనలేని వాస్తవం. ఇందులో కచ్చితంగా ఎవరో ఎత్తిచూపాల్సిన అవసరం లేదు. కేంద్రం నుంచి వచ్చే నిధులు ఉంటాయి. ఇవ్వాల్సిన క్రెడిట్‌ వాళ్లకు ఇస్తున్నారు. కోవిడ్‌ వల్ల ఆర్థిక భారం పెరిగినప్పటికీ ఏమాత్రం వెనకడుగు వేయకుండా, జాగ్రత్తగా అడుగులు వేస్తూ వనరుల కోసం తాత్కాలికంగా అప్పలు చేసి అయినాసరే ఈ సంక్షేమ యజ్ఞం ఆగకూడదని ముందుకు సాగిస్తున్నారు. అది ఆగదు. ఇలాంటి తాటాకు చప్పుళ్లకు బెదరం. పిల్లిశాపాలు పనిచేయవు.

మీ దుగ్ధ, కడుపుమంట ఎంతగా బయటపడుతుందంటే వాళ్ల లెక్కల ప్రకారం.. ‘ఈ రాష్ట్రానికి ఒక నయాపైసా అప్పు పుట్టకూడదు. ఆదాయం రాకూడదు. ఉన్నవన్నీ దోచుకుపోవాలి, వీళ్లు నాశనం కాను’ అన్నట్లుగా వాళ్ల మాటలను బట్టి స్ఫురిస్తున్నాయి. మీరు తిడుతున్నది జగన్‌గారిని, రాష్ట్ర ప్రభుత్వాని అనుకుంటున్నారే కానీ మీరనేది రాష్ట్రాన్ని, రాష్ట్ర ప్రజల్ని. రాష్ట్రానికి ఆదాయం తగ్గినా, అప్పులు పుట్టకపోయినా దాని ఫలితం, ఆ పాపం తగిలేది ప్రజలకే. మేము చేసే అప్పులు అయినా ఇంకోటి అయినా లబ్దిదారులకే అందుతున్నాయో తప్ప, మీమాదిరిగా పోలవరం, అమరావతి మాదిరిగా డ్రాయింగ్‌లు గీసి… టెండర్లు పిలిచి ఇన్నివేల కోట్లతో ఇది పెడతాం.. అది పెడతామంటూ గాలిలో లెక్కలు చెప్పడంలేదు.
మీరు అపచారం చేస్తున్నది ప్రజలకే అనేది గుర్తించాలి. అసలు ప్రజలు లేకుంటే చరిత్ర అనేది ఎలా ఉంటుంది? ఆ జ్ఞానం కూడా లేకపోతే ఎలా? మంచి చేశారు కాబట్టే జగన్‌గారిని కీర్తిస్తున్నారు… మీరు చెడు చేశారు కాబట్టే మిమ్మల్ని చెత్తబుట్టలో పడేశారు ప్రజలు. ఈ ఇంగితం కూడా మీకు లేదు.

విజయవాడలో ఒక్క బ్రిడ్జి అయినా కట్టారా..
అధికారంలో ఉన్నప్పుడు సైబరాబాద్‌ కట్టానని చెప్పుకునే చంద్రబాబు.. ఆ బిల్డంగ్‌ తప్ప మీరు చేసింది ఏమీ లేదు. ఔటర్‌ రింగ్‌ ఎవరి హయాంలో వచ్చింది, పూర్తి చేసి శంషాబాద్‌ విమానాశ్రయం వరకూ పొడిగించింది ఎవరు? వీటితోపాటు పీవీ నరసింహారావు ఎక్స్‌ప్రెస్‌హైవే కూడా పూర్తి చేసింది రాజశేఖర్‌ రెడ్డి . మీ బతుక్కు ఒక్కటన్నా బ్రిడ్జ్‌ కట్టారా? ఔటర్‌ రింగ్‌ రోడ్డు ద్వారా వచ్చే 40ఏళ్ల పాటు హైదరాబాద్‌ అవసరాలు తీర్చేలా వైయస్సార్‌ పునాదులు వేశారు.

ఇవన్ని వదిలేద్దాం.. 2014-19 మధ్య మీ పాలన చూస్తే.. రాజధాని అంటూ అమరావతికి వచ్చిన మీరు విజయవాడకు ఒక్క బ్రిడ్జ్‌ అయినా కట్టారా? వైయస్సార్‌ హయాంలో ఫైనలైజ్‌ అయిన బ్రిడ్జ్‌ని కనీసం పూర్తి చేయలేకపోయారు. కనకదుర్గమ్మ ఫ్లైఓవర్‌, బెంజ్‌ సర్కిల్‌ వద్ద ఫ్లైఓవర్‌ కూడా పూర్తి చేయలేదు. వీటిని పూర్తి చేసింది మా ప్రభుత్వమే. అలాగే బెంజ్‌ సర్కిల్‌ వద్ద మరో ఫ్లైఓవర్‌ను ఈ రెండున్నరేళ్లలో పూర్తి చేసిన ఘనత జగన్‌గారిది. మీ వైఫల్యాలకు, చేతగానితనానికి ఇంతకంటే నిదర్శనం కావాలా?

తొలిసారి ముఖ్యమంత్రి అయిన వ్యక్తి ఫ్లైఓవర్‌ల ను ఎలా పూర్తి చేయగలిగారు. ఇన్నేళ్ల పాటు పాలించిన మీరెందుకు పూర్తి చేయలేకపోయారు. మీ హయాంలో ఔటర్‌ రింగ్‌ రోడ్డు అంటూ హడావుడి చేసి, గూగుల్‌ మ‍్యాప్‌లో ఓ సర్కిల్‌ గీసి, కాకి లెక్కలు వేశారు. అమలు కానివి, కలగనేవి చెప్పుకుంటున్నారంటే మిమ్మల్ని ఏమనుకోవాలి. ఆచరణలోకి తీసుకువచ్చే ప్రయత్నం కూడా చేయకుండా ప్రజల్ని మభ్యపెట్టి, భ్రమల్లో పెట్టి… నేను కలలుగంటాను అంటే జనం ఎలా కనిపిస్తున్నారు మీకు? మాకు స్పృహ, తెలివి ఉందని వాళ్లు జగన్ మోహన్ రెడ్డి నాయకత్వాన్ని ఎన్నుకుని చూపించిన తర్వాత అయినా మీకు తెలివి రాలేదా చంద్రబాబూ. మీ స్వర్గంలో మీరు ఉన్నారు.

బాబుకు విజయవాడ, గుంటూరు మీద ప్రేమ లేదు
చంద్రబాబుకు అటు విజయవాడ మీద, ఇటు గుంటూరు మీదగానీ ప్రేమ లేదు. ఆయన పెట్టిన 29 గ్రామాలు తప్ప, కృష్ణాజిల్లాలో మిగిలినదంతా గ్రీన్‌ జోన్‌ పెట్టేశాడు. కేవలం వ్యవసాయం తప్ప అక్కడ పరిశ్రమలు ఏమీ రాకుండా గ్రీన్‌ జోన్‌ పెట్టేశారు. కృష్ణాజిల్లా ప్రజల మీద ఇంతకంటే ద్వేషం ఉందని చెప్పడానికి తార్కణం లేదు. ఆయనకు ఎడారిలో తయారు చేసిన ఐలాండ్‌ మీదే ప్రేమ. ఆయన అనుకున్నట్టు…అక్కడ భూముల ధరలు పెరిగి లక్ష, రెండులక్షల కోట్లు రావాలి.

చంద్రబాబు రంగుల స్వప్నాన్ని జగన్‌ మోహన్‌ రెడ్డి భగ్నం చేశారు. అదీ ఆయన కోపం. జగన్‌ చేస్తున్నట్లు.. చంద్రబాబు అభివృద్ధి చేసి ఉంటే.. విజయవాడ, గుంటూరు ప్రాంతాలు ఇప్పటికే కలిసిపోయి ఉండేవి. చంద్రబాబుకు తన కులం మీద కూడా నమ్మకం లేదు. కేవలం తన చిన్న సర్కిల్‌ అయిన నెట్‌వర్క్‌ లో భాగస్వాములైన కొద్దిమంది మద్దతు, కులాన్ని వాడుకుని కుల పెద్దలను భ్రమలలోపెట్టి వారి రక్తం తాగి భూములన్ని లాక్కున్నాడు. కృష్ణా, గుంటూరు జిల్లా ప్రజల మీద ప్రేమలేదు. ఇక రాష్ట్రం మీద అసలే లేదు. తనకు తానే శాపాలు పెట్టడం.. గతంలో తప్పులు చేశాం.. ఇకముందు చేయొద్దని చెప్పడం అలవాటుగా మారింది.

నిరసన కార్యక్రమాలకు పిలుపునివ్వడం సిగ్గుచేటు
నిరసన కార్యక్రమాలకు చంద్రబాబు పిలుపునివ్వడం సిగ్గుచేటు. నిత్యావసర ధరల పెరుగుదల అనేది దేనిమీద బేస్‌ చేసుకుని ఉంటాయో తెలిసిందే. ఇంధన ధరల పెరుగుదల అనేది ట్రాన్స్‌పోర్టు రంగం మీద ఉంటుంది. దాని ప్రభావం ప్రత్యక్షంగా, పరోక్షంగా ఇతర రంగాల మీద పడుతుంది. వీటిని తట్టుకోవడానికి ప్రభుత్వం ఏరకంగా పనిచేస్తోంది అనేది ప్రధానం అయితే… జగన్‌ మోహన్‌ రెడ్డి ఊహించినదానికంటే చాలా బ్రహ్మాండంగా పనిచేస్తున్నారనేది ప్రజలందరికీ తెలుసు. వాళ్లు కూడా ఇప్పటికే దాన్ని అర్థం చేసుకున్నారు కాబట్టే ఇప్పటివరకూ జరిగిన ఎన్నికల్లో అద్భుతమైన ఫలితాలను ఇచ్చారనేది చాలా స్పష్టంగా కనిపించింది.

విలేకరుల ప్రశ్నలకు సమాధానమిస్తూ….
టీడీపీ హయాంలో 5లక్షల ఉద్యోగాలు సృష్టించారని మీరే అన్నారన్నారు. మేమేమీ అయిదు లక్షల ఉద్యోగాలు సృష్టించామనలేదు. మీ హయాంలో అయిదు లక్షల మంది ఉంటే, మా హయాంలో అవి 6లక్షల 47వేలు అయ్యాయని చెప్పాం. చంద్రబాబు మాటలు చూస్తే ఆయన దేన్ని అయినా వక్రీకరించగలిగేవాడు. నిద్రపోయేవాడిని లేపొచ్చు కానీ, నటించేవాడిని ఏమీ చేయలేం. ఇప్పుడు నటించడం కూడా కాదు.. అంతకుమించి ఆయన నటన స్టేజ్‌ కూడా దాటిపోయి.. ఒక సంధి ప్రేలాపన లెక్కగా వెళ్లిపోయారు. టీడీపీలో మిగతా నాయకులు కూడా గత్యంతరం లేక బాబు లెక్కలోకే వెళ్లిపోయారు. టీడీపీ నాయకులకు దిశానిర్దేశం చేసే చంద్రబాబును, వేదిక ముందు కూర్చున్నవాళ్లు.. కుప్పంలో చంద్రబాబు ఏం చేశారు? మాకు నీతులు చెబుతారా అని అనుకోకుండా ఉంటారా? అవేవీ చంద్రబాబుపట్టించుకోకుండా తుడుచుకుపోయే రకం.

వంగవీటి రాధా అనే వ్యక్తి నామీద రెక్కి అంటే పోలీసుల విచారణలో కాదని తేలింది. కారు తిరిగింది అంటారు, మరికొద్దిసేపు స్కూటీ అంటారు … ప్రతిపక్ష నాయకుడిగా నేను చెబితే మీరు పరిగణనలోకి తీసుకోరా అంటారు? మరోవైపు ఒంగోలులో సుబ్బారావు గుప్తా ఘటన అయినా, గుంటూరు జిల్లా దుర్గిలో ఎన్టీఆర్‌ విగ్రహం ధ్వసం ఘటన అయినా, వెంటనే చర్యలు తీసుకున్నాం. దీనిపై రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమం అంటే జనాలకు పనీపాటేమీ లేదనా చంద్రబాబు అభిప్రాయం…?

ఎన్టీఆర్‌ బతికుండగానే సుత్తితో కొట్టికొట్టి ప్రాణాలు తీసినమీరు.. విగ్రహం విధ్వంసం అంటూ మాట్లాడతారా? మీ హయాంలో దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ ఓ మహిళా అధికారిణిపై దాడి చేస్తే.. ఆమె కళ్లనీళ్లు పెట్టుకుంటే ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న మీరు సర్దుకుపోవాలని సలహా చెప్పారు.
జగన్‌ వచ్చాకే ఒక వెలుగు వచ్చింది, ప్రజలు ఇది శాశ్వతంగా నిలబడాలనుకుంటున్నారు. ఇది వాస్తవం.
ఏది జరిగినా ఇక్కడ దాచుకోవాల్సిన అవసరం లేదు. కాపర్‌ డ్యామ్‌ అనేది చంద్రబాబు పిచ్చికల. డ్యామేజ్‌ కాకుంటే అనుకున్న సమయానికే పోలవరం పూర్తయేది. ముంపు ప్రాంతాల్లో నీళ్లు ఎలా వచ్చాయనేది మీ మీడియా ప్రతినిధులే రిపోర్టు చేశారు. కచ్చితంగా నీళ్లు అనేయి వస్తాయి. ఆ బరువును మోయాల్సిందే.

బాబు చేసిన పని వల్ల మళ్లీ మొదటికే వచ్చింది. మీరు బురద వేయను… మేము తుడుచుకోను అన్నట్టుగా తయారైంది. ప్రజలకు కూడా ఇది తెలిసిపోయింది. పోలవరంపై ఇదే శ్వేతపత్రం విడుదల చేస్తే చంద్రబాబు ఒప్పుకుంటారా? నన్ను తీసుకువెళ్లి సీఎం సీటులో కూర్చోబెడితే లెక్కలు తీస్తా అంటాడు. ఈ రెండేళ్లుపాటు తిట్టిన తిట్లు తిడుతూనే ఉంటాడు. తిట్టిస్తూనే ఉంటాడు. అవన్నీ మాకు ఆశీస్సులే.. ఇక ఆయనకు చెందిన మీడియా ఎంతబాగా అక్కసు, కడుపు మంట వ్యక్తం చేస్తే జగన్‌ మోహన్‌ రెడ్డిగారు అంతబాగా పనిచేస్తున్నట్లే. దాన్ని తట్టుకోలేకే వాళ్లు విషం కక్కుతున్నారు.

షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు
ముందస్తు ఎన్నికలకు వెళ్లడం అనేది పిచ్చా? అలాంటి ఆలోచనలు ఏమీ లేవు. జగన్‌ గారు ప్రజలు ఇచ్చిన తీర్పును పూర్తిగా సద్వినియోగం చేసుకుంటారు. షెడ్యూల్‌ ప్రకారమే ఎన్నికలకు పోతాం.
ఉద్యోగులకు ఎంతైనా ఇవ్వాల్సిందే అనుకోవడం బాగుంటుంది. అయితే బాధ్యతాయుతమైన ముఖ్యమంత్రిగా వాస్తవ పరిస్థితులను అర్థం చేసుకుని, బ్యాలెన్స్‌ చేసుకుని వ్యవహరిస్తున్నారు. అదే మా ముఖ్యమంత్రి చేస్తున్నారు. అదే చంద్రబాబు మాత్రం ఓట్లును దృష్టిలో పెట్టుకునే ఏపనైనా చేసేవారు. రెండింటి మధ్య తేడా అదే. పీఆర్సీపై అధికారులతో సమావేశం ఇవాళ ఉంటుంది. రేపటికి స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ముఖ్యమంత్రి కూడా ఉద్యోగ సంఘాలతో సమావేశం అయ్యే అవకాశం ఉంది.

LEAVE A RESPONSE