( మార్తి సుబ్రహ్మణ్యం)
‘నేరం నాది కాదు.. ఆకలిది’ అప్పుడెప్పుడో ఎన్టీఆర్ హీరోగా వచ్చిన సినిమా ఇది. అందులో ఆకలి కారణంగా నేరస్తుడయిన వ్యక్తి ఇతివృత్తంగా సినిమా తీశారు. అది సూపర్‌హిట్. ఇప్పుడు జనరేషన్లు మారిన నేపథ్యంలో.. ‘నేరం నాది కాదు. అమ్మ పెంపకానిది’ అన్న టైటిల్‌తో సినిమా తీస్తే బాగానే వర్కవ టవుతుందేమో?! ప్రయత్నిస్తే మంచిది. ఆలసించిన ఆశాభంగం!
* * *
‘‘ జగన్ 11 కేసులతో 16 నెలలు జైల్లో ఉండటానికి విజయమ్మ పెంపకమే కారణమా? తుమ్మపూడిలో ముగ్గురు పిల్లల తల్లిపై అఘాయిత్యం జరిగింది. బెజవాడ ప్రభుత్వాసుపత్రిలో బాలికపై 36 గంటలపాటు
అత్యాచారం చేశారు. పులివెందులలో నాగమ్మను హత్య చేశారు. రేపల్లె రైల్వేస్టేషన్‌లో భర్త ముందే రేప్ చేశారు. వీటికి తల్లుల పెంపకమే లోపమని మీ ప్రభుత్వ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకుంటారా? ఇంతజరిగినా నోరుమెదపని మూగవ్యక్తి జగన్ ఈ రాష్ట్రానికి సీఎంగా ఉండటం ఏపీ ప్రజల దౌర్భాగ్యం’’
– తెలుగుమహిళ రాష్ట్ర అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే వంగలపూడి అనిత ఆగ్రహం.
‘‘ గన్ కంటే ముందే జగన్ వస్తానన్నారు కదా? మరి జగన్ రావడం లేదేంటి? జ‘గన్’ ఉత్తి అట్ట తుపాకీనేనా’’
– టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్
భర్తని కట్టేసి భార్యపై సామూహిక అత్యాచారం-వార్త
– ‘‘ఈ భర్తను కూడా వాళ్లమ్మ సరిగా పెంచకపోవడం వల్లే ఇలా జరిగింది’’
– ‘‘ మేమేం తప్పు చేయలేదు జడ్జిగారూ. వాళ్లమ్మ సరిగ్గా పెంచలేదు. కాబట్టి మేము ఆ అమ్మాయిని రేప్ చేసి చంపడం జరిగింది’’
‘‘ నేను మాట్లాడినవి మొత్తం ప్రసారం చేయకుండా.. ఎల్లో మీడియా ముందు, వెనుక ఎడిట్ చేసి కాపీపేస్ట్ చేసింది. ఆడపిల్లలను ఇంట్లో ఉన్న తల్లులు కనిపెట్టుకుని ఉండాలి. ఆ బాధ్యత తల్లులు మాత్రమే తీసుకోవాలన్నది నా భావన. నేను ఒక తల్లిగా చెప్పింది కూడా అదే’’
– ఏపీ హోం మంత్రి వనిత
* * *
ఇవన్నీ ఏపీ కొత్త హోంమంత్రి వనిత చేసిన వ్యాఖ్యల అనంతరం రాజకీయ పార్టీలు, సోషల్ మీడియాలో వెల్లువె త్తుతున్న వ్యంగ్యాస్త్రాలు. ఇవి ఇప్పుడు తెగ వైరల్ అవుతున్నాయి. వనిత కామెంట్ల ఆధారంగా తమ సొంత వ్యాఖ్యలు జోడించి, మహిళలపై జరుగుతున్న దాడులను ఖండిస్తూ, మహిళల రక్షణలో విఫలమయిన సర్కారును నెటిజన్లు గ్రాపిక్స్‌తో ఫుట్‌బాల్ ఆడేస్తున్నారు.
ఆడపిల్లల తల్లులు జాగ్రత్తల్లో ఉండాలని, వారిని కంటికి రెప్పలా కాపాడుకునే బాధ్యత తీసుకోవాలన్నది మహిళా మంత్రి వనిత కవిహృదయం కావచ్చు. తాను కూడా ఒక తల్లినే కాబట్టి, సాటి తల్లులకు ఆమె
వ్యాఖ్యలను హితోపదేశంగా తీసుకోవడంలో తప్పేమీలేదు. కాదు కూడా! ఒక తల్లిగా వనిత వేదన అర్ధం చేసుకోదగ్గదే. ఆడబిడ్డలను జాగ్రత్తగా పెంచాలని ఆమె కోరుకోవడం మంచిదే.
నిజానికి చాలామంది తల్లులు తమ పిల్లలు.. ముఖ్యంగా ఆడపిల్లలు ఎక్కడికి వెళుతున్నారు? ఏం చేస్తున్నారు? తామిచ్చిన సెల్‌ఫోన్‌ను ఎలా వాడుతున్నారు? వాళ్లు కాలేజీకి వెళుతున్నారా? లేదా? అక్కడ వారి ప్రవర్తన ఏమిటి? ఆడపిల్లలు కాలేజీ అయిపోయిన తర్వాత కూడా ఎందుకు ఆలస్యంగా వస్తున్నారు? రాత్రి వేళ బెడ్‌రూమ్‌లో దుప్పటి ముసుగేసుకుని ఎందుకు చాటింగ్ చేస్తున్నారు? అని ఈ తరం తల్లులు ఆలోచిస్తున్నారా?
మొన్నామధ్య హైదరాబాద్‌లో ఒక పబ్‌లో డ్రగ్స్ తీసుకుంటూ, పట్టుబడ్డ వారిని పోలీసుస్టేషన్‌కు తీసుకువెళితే… వారిని నాలుగు తగిలించి, ‘‘పొద్దుపోయేవరకూ పబ్బుల్లో ఏం పనంటూ’’ నాలుగు తగిలించి, ఇకపై ఇలా జరగదని పోలీసులను ప్రాధేయపడాల్సిన తలిదండ్రులు.. ‘‘ మా పిల్లలను స్టేషన్‌కు ఎందుకు తీసుకువచ్చారు? మా పిల్లలు పబ్‌కు సరదాకు వచ్చారు. కానీ మీరు స్టేషన్‌కు తీసుకువచ్చి మా పరువుతీశారంటూ’’ నానా రచ్చ చేసిన దృశ్యాలు చూశాం. అలాంటి త లిదండ్రుల పెంపకంలో.. చిరంజీవుల నుంచి సత్ప్రవర్తన ఆశించడం అత్యాశ. అది వేరే విషయం!
అయితే.. ప్రపంచం అంతా ఒకేలా ఉండదు కదా? రాష్ట్రమంతా వైసీపీ కళ్లతో, జగనన్న- ప్రశాంత్ కిశోర్ మెదడు, ఆ పార్టీ సోషల్‌మీడియా వింగ్ వ్యూహాలతో ఆలోచించదు కదా? గతంలో విపక్షంలో ఉన్నప్పటి ‘వైసీపీ కళ్లజోడు’నే.. ఇప్పుడు విపక్షాలు పెట్టుకుని, ఆ కోణంలోనే చూస్తున్నాయి. అది రాజకీయ పార్టీల సహజ లక్షణం. అధికారంలో ఉన్నప్పుడు తెదేపా హయాంలో జరిగిన దారుణాలపై విపక్ష వైసీపీ ఎలాగయితే చెలరేగిందో.. ఇప్పుడు విపక్ష తెదేపా కూడా అలాగే చెలరేగిపోతోంది. సేమ్ టు సేమ్! కాబట్టి.. ఈ విషయంలో నైతిక-రాజకీయ విలువలు, సున్నిత సంఘటనలు… మానవీయ కోణాలు… హక్కులు.. బాధ్యతలు.. బొంగు బోషాణాల వంటి పదాలకు స్థానం లేదు. ఎందుకంటే రాజకీయాలే అలా అఘోరించాయి కాబట్టి. ఎవరి కోణంలో వారిదే కరెక్టు అనుకుంటున్నారు కాబట్టి. మరి సోషల్‌మీడియాదీ అదే కోణం. ఆ ప్రకారంగా అందరూ కరెక్టేనేమో?!
హోంమంత్రి వనిత చెప్పింది నిజమే కావచ్చు. కానీ.. తలిదండ్రులే అన్నీ చూసుకుంటే ఇక పోలీసులు, ప్రభుత్వం ఉంది ఎందుకు? రక్షణలో తలిదండ్రుల పాత్ర ఎక్కువే అయినా, ఆడబిడ్డ బయటకొచ్చిన తర్వాత ఆమె రక్షణకు ప్రభుత్వం పోలీసులే కదా పూచీకత్తు? కోట్ల రూపాయలు పోసి కొనుగోలు చేసిన సీసీ టీవీ కెమెరాల పనే అది కదా? అంటే ఆ కెమెరాలు పనిచేయకుండా బజ్జున్నాయా? చివరకు రైల్వేస్టేషన్లు, ప్రభుత్వాసుపత్రులు, బహిరంగ స్థలాల్లో కూడా మహిళలపై హత్యాచారాలు జరుగుతుంటే, ఇక పాలకులు ఉన్నది ఎందుకు.. ఏడవడానికా? తల్లులు అక్కడ కూడా అన్ని పనులూ మానేసి కాపలా కాయాలా? మరి అన్నేసి వేలు- లక్షల రూపాయలు తీసుకుంటున్న పోలీసులు, ఐపిఎస్‌లూ ఉన్నది ఎందుకు? వారికి భద్రత కల్పించడానికి కాదా? ఇవన్నీ చేయకపోతే ఇక పోలీసుస్టేషన్లు ఎందుకు? వాటిని ఏ ధర్మసత్రాలుగా మారిస్తే సరిపోతుంది కదా? అన్నది బుద్ధిజీవుల ప్రశ్న.
అసలు జగనన్న సర్కారు దిశ యాప్ పెట్టిన తర్వాత.. ఏపీలో మహిళలపై ఎన్ని అత్యాచారాలు, హత్యాచారాలు, లైంగిక వేధింపులు, దారుణాలు జరిగాయో లెక్క తీస్తే సర్కారు సంగతి తేలిపోతుంది కదా? ఎల్లో మీడియా అయినా, నీలి మీడియా అయినా-కూలి మీడియా అయినా, పింక్ మీడియా అయినా.. జరిగిన విషయాలనే కదా రిపోర్టు చేసేది? కాకపోతే సర్కారు అనుకూల మీడియా ఆ సంఘటన తీవ్రతను తగ్గించవచ్చేమో గానీ, అసలు విషయాన్నయితే రిపోర్టు చేయాల్సిందే కదా?!
ఆ ప్రకారంగా ఏపీలో నిర్నిరోధంగా మహిళలపై జరుగుతున్న దాడులు పరిశీలిస్తే.. అక్కడ పోలీసింగ్ ఎంత సమర్ధవతంగా పనిచేస్తుందో.. పోస్టింగులు ఇంకెంత అద్భుతంగా జరుగుతున్నాయో అర్ధం చేసుకోవచ్చు. స్వయంగా మహిళా పక్షపాతి- అక్కచెల్లెమ్మల కోసం అప్పులు చేసి మరీ సంక్షేమ పథకాలు
అమలుచేస్తున్న మహిళాజన బాంధవుడయిన సీఎం జగనన్న నివసించే తాడేపల్లికి కూతవేటులోనే, మహిళలపై దారుణాలు జరుగుతున్న దిక్కుమాలిన పరిస్థితి ఉంటే.. ఇక రాష్ట్రం సంగతి చెప్పేదేముంది? అన్నది బుద్ధిజీవుల ప్రశ్న. నిజం ‘జగన్నాధుడి’కెరుక?