ఎక్కడా లోపం జరక్కపోతే నలుగురు మహిళలు ఎలా చనిపోయారు?

Spread the love

-దెయ్యం వచ్చి చంపిందా ?
– తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చంపిందా? డైరెక్టర్ హెల్త్ శ్రీనివాస్ రావు చంపారా ?
– కుటుంబ నియంత్రణ ఆపరేషన్ మరణాలపై తెలగాణ సీఎం కేసీఆర్‌కు బీజేపీ నేత దాసోజు శ్రవణ్ బహిరంగలేఖ

దేశాన్ని విభ్రమ పరిచిన కుటుంబనియంత్రణ ఆపరేషన్ మరణాలకు కారుకులెవరని బీజేపీ నేత దాసోజు శ్రవణ్ నిలదీశారు. ఆ మేరకు తెలంగాణ సీఎం కేసీఆర్‌కు రాసిన బహిరంగ లేఖలో ప్రశ్నాస్త్రాలు సంధించారు. ఎవరి బాధ్యత లేకపోతే మహిళలను దెయ్యం వచ్చి చంపేసిందా? అని వ్యంగాస్త్రాలు సంధించారు. శ్రవణ్ లేఖ సారాంశం ఇదీ..

గౌరవ ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ గారికి
ఇబ్రహీంపట్నం కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చావులపై
డాక్టర్ శ్రవణ్ దాసోజు బహిరంగ లేఖ

డైరెక్టర్ హెల్త్ శ్రీనివాస్ రావు దొంగే దొంగ అన్నట్లు పత్రికా సమావేశం పెట్టిమరీ ఇబ్రహీంపట్నం కుటుంబ నియంత్ర ఆపరేషన్ లో నలుగురు మహిళల చావులకు కారణమైన బాధ్యులని రక్షించాలని, ప్రభుత్వ వైఫల్యాలని కప్పిపుచ్చాలనే దుర్మార్గమైన ప్రయత్నం చేస్తున్న తరుణంలో జాతీయ రాజకీయాలతో తీరికలేని ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ గార్కి జరుగుతున్న ఈ మోసాన్ని సరిదిద్దె కనీస భాద్యతవుందని గుర్తు చేస్తూ ఈ లేఖ రాస్తున్నాను.

ఇబ్రహీంపట్నంలో కుటుంబ నియంత్రణ పేరుమీద నలుగురు మహిళలు చనిపోవడం, దాదాపు 30-35 మంది మహిళలు అపోలో ఆసుపత్రి పాలు కావడం అత్యంత బాధాకర సంఘటన. ఈ సంఘటనకు నిజమైన బాధ్యులు ఎవరు? ఇది ముమ్మాటికీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ బాధ్యతారహిత్యానికి నిదర్శనం.

ఇంత సాంకేతిక పరిజ్ఞానం పెరిగిన ఈ దేశంలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్ల పేరు మీద నలుగురు చనిపోవడం అనేకమంది ఆసుపత్రి పాలు కావడం ఇది దేశంలోనే మొట్టమొదటిసారి. ఈ దుర్ఘటన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంకు సిగ్గుచేటు. ఇంత ఘోర నేరం జరిగితే ముఖ్యమంత్రి కనీసం పరామర్శ కూడా చేయకుండా, జాతీయ రాజకీయాల పేరుమీద పర్యటనలలో ఉండటం మానవతారాహిత్యం .

మొదటి నుండి విద్య వైద్యం పట్ల సరియైన బాద్యత్తో వ్యవహరించినటువంటి కెసిఆర్ సర్కార్ ఈనాడు ఇంతమంది మహిళల చావుకు కారణమైనారు.బాధిత మహిళలను ప్రభుత్వాసుపత్రికి కాకుండా అపోలో లాంటి ఆసుపత్రికి తీసుకపోవడంలో ప్రభుత్వ ఆసుపత్రి వ్యవస్థ ఎంత దయనీయమైన దిగజారిన స్థితిలో ఉన్నాయనిటానికి ఇది నిదర్శనం.

గతంలో వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో ఎలుకలు కొరికి పేషెంట్లను చంపిన వైనాన్ని చూసినం, వెంటిలేటర్లు పనిచేయక అనేక మంది చనిపోయిన పరిస్థితి చూసినం. సరియైన సంఖ్యలో ఖాళీగా ఉన్న డాక్టర్లు నర్సుల పోస్టుల నింపకుండా తగిన నిధులు కేటాయించకుండా మొత్తం వైద్య వ్యవస్థను సర్వనాశనం చేసినారు. అసలు ఫ్యామిలీ ప్లానింగ్ వ్యవస్థ కేంద్ర ప్రభుత్వ కార్యక్రమం. దాన్ని అమలు చేసే బాధ్యత డైరెక్టరేట్ ఆఫ్ హెల్త్ ది.

ఈ విషాదం జరగడానికి ప్రధాన కారణం సర్జరీ చేయడానికి ఉపయోగించే పరికరాలను ఇతిలిన్ త్రయోక్సైడ్ అనే రసాయనంలో 12 గంటల పాటు స్టెర్లైజేషనన్ చేసిన తర్వాతనే కుటుంబనియంత్రణ ఆపరేషన్ కోసం వాడాలి. కానీ పేదవాళ్లే కదా ఊళ్ళలో పశువులకు ఏరకంగానైతే సంతానోత్పత్తిని నియంత్రించేందుకు వ్యవహరించినట్లుగానే కేవలం వాళ్ళ టార్గెట్లు చేరుకునేందుకు ఇంత మంది మహిళల జీవితాలతో చెలగాటమాడుతూ కనీస శ్రద్ధ తీసుకోకుండా స్టెర్లైజేషన్ చేయని పరికరాలతో ఆపరేషన్ చేసి ఈ ప్రమాదానికి కారకులైనరు.

డైరెక్టర్ హెల్త్ శ్రీనివాస్ రావు సర్జరీ చేయడానికి ఉపయోగించే పరికరాలను స్టెర్లైజేషన్ చేశామని చెప్తున్నారు. ఇలాంటి సర్జరీలు వేరే చోట చేశామని, అక్కడ ఎలాంటి సమస్య రాలేదని బాధ్యతరాహితంగా మాట్లాడుతున్నారు. మరి ఎక్కడా లోపం జరక్కపోతే నలుగురు మహిళలు ఎలా చనిపోయారు ? దెయ్యమొచ్చి చంపిందా ? లేదా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చంపిందా? డైరెక్టర్ హెల్త్ శ్రీనివాస్ రావు చంపారా ? ప్రజలకు తెలియాలి కదా?తప్పు చేసినవారిని శిక్షించాలి కదా?

అసలైన బాధ్యులను శిక్షించకుండా పైపై బాధ్యత ఉన్నటువంటి డాక్టర్ను , వైద్య విధాన పరిషత్ ఏరియా ఆసుపత్రి సూపర్డెంట్ ను సస్పెండ్ చేసి దొంగలకు సద్దులు మోసేటట్లుగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తుంది.
అసలు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ల బాధ్యత డైరెక్టర్ హెల్త్ శ్రీనివాస్ రావు ది. తదనంతరం ఆయా జిల్లాల డిఎంహెచ్వో సూపరింటెండెంట్ ది. ఆ తర్వాత క్షేత్రస్థాయిలో ఎస్పీ హెచ్ ఓ కు ఉంటుంది.
కాబట్టి మొదట సస్పెన్షన్ గురి కావలసింది డైరెక్టర్ హెల్త్ తర్వాత రంగారెడ్డి జిల్లా డిఎం అండ్ హెచ్ ఓ, తర్వాత ఇబ్రహీంపట్నం ఇన్చార్జ్ ఎస్పీ హెచ్ఓ.

ఈ ప్రభుత్వం శ్రీనివాసరావును కాపాడేందుకు కుట్రపూరితంగా కేవలం దాదాపు లక్ష ఆపరేషన్లు చేసిన రిటైర్డ్ డాక్టర్ జోయల్ లైసెన్స్ రద్దు చేసి, వైద్య విధాన పరిషత్ ఏరియా ఆసుపత్రి సూపర్డెంట్ లైసెన్స్ రద్దు చేసి మసిబూసి మారేడు కాయలు చేయాలని ప్రయత్నం చేస్తుండు.

అంతేకాకుండా దొంగ చేతికి తాళం ఇచ్చినట్లుగా డైరెక్టరేట్ ఆఫ్ హెల్త్ ఆధ్వర్యంలో ఈ మొత్తం ఘోర నేరంపై విచారణ జరిపిస్తున్నారు. ఇంతకంటే పెద్ద మోసం ఏదీ ఉండదు. రాష్ట్ర ప్రభుత్వం చనిపోయిన వారి కుటుంబాలకు 5 లక్షల రూపాయల చొప్పున ఎక్స్గ్రేషియా చెల్లిస్తామని , డబుల్ బెడ్ రూమ్ ఇల్లు కట్టిస్తామని దొంగ వాగ్దానం చేసిండ్రు.

వాస్తవానికి కుటుంబ నియంత్రణ కేంద్ర ప్రభుత్వ పరిధిలోనిది కాబట్టి సంబంధిత ఆపరేషన్లు జరిగేటప్పుడు ఎవరికైనా ఆరోగ్యపరమైన ఇబ్బందులు తలెత్తి చనిపోతే వారికి నాలుగు లక్షల రూపాయలు కేంద్ర ప్రభుత్వమే ఇస్తుంది. కానీ ఈ కెసిఆర్ ప్రభుత్వం తామేదో దయాదాక్షిణ్యాల మీద బిక్ష వేసినట్లు ఒక లక్ష రూపాయలు కలిపి మొత్తం ఐదు లక్షల రూపాయలు ఇస్తున్నట్లు మభ్యపెట్టడం పెద్ద మోసం.

చనిపోయిన నలుగురు పేద మహిళలు వారి వ్యక్తిగత అనారోగ్య కారణాలతో చనిపోలేదు. కేవలం తెలంగాణ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల చనిపోయిన పేదమహిళల చావుకు కెసిఆర్ సర్కార్ కట్టే ఖరీదు కేవలం లక్ష రూపాయలు మాత్రమేనా? ఇది న్యాయమేనా? అంతేకాకుండా బతికున్నప్పుడు ఇండ్లు ఇవ్వని కెసిఆర్ సర్కార్ చనిపోతే డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇస్తామని కల్లబొల్లి కబుర్లు చెబుతున్న ఈ ప్రభుత్వం ఎంత దుర్మార్గమైనదో ప్రజలు అర్థం చేసుకోవాలి.

కేసీఆర్ , మంత్రి హరీష్ రావు ఇచ్చే ఈ ఐదు లక్షల రూపాయలతో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లతో పోయిన ప్రాణాలు తిరిగి వస్తాయా. పేదోళ్ల పట్ల ఇంత వివక్ష ఉండడం న్యాయమా?
ముమ్మాటికి దుర్ఘటనకు బాధ్యులు రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం అందుచేత డైరెక్టర్ ఆఫ్ హెల్త్ శ్రీనివాసరావును సంబంధిత రంగారెడ్డి జిల్లా డిఎం అండ్ హెచ్ ఓ ను , ఇబ్రహీంపట్నం ఎస్ పి హెచ్ ఓ వెంటనే సస్పెండ్ చేయాలని , సిట్టింగ్ జడ్జితో ఈ దుర్ఘటనపై విచారణ జరిపించి, తప్పు చేసినవారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నాము.

అంతేకాకుండా ప్రభుత్వ నిర్లక్ష్యంవల్ల చనిపోయిన కుటుంబాలకు ఒక కోటి రూపాయలు ఎక్స్గ్రేషియా రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాలని , ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారికి మొత్తం వైద్య ఖర్చులన్నీ ప్రభుత్వ భరిస్తూ వారికి కూడా తగిన మొత్తంలో ఎక్స్గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేస్తున్నాము. భవిష్యత్తు లో ఇటవంటి దుర్ఘటనలు పునరావృతం కాకుండా పటిష్టమైన చర్యలు చేపట్టాలి.

ఇట్లు
డాక్టర్ శ్రవణ్ దాసోజు,
భారతీయ జనతా పార్టీ

Leave a Reply