October 13, 2026

బీజేపీ అధ్యక్షుడిని ప్రభుత్వ కార్యక్రమాలకు ఎలా పిలుస్తారు?

  • ప్రభుత్వ కార్యక్రమ వేదికలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్‌కు ఆహ్వానమా?
  • మరి శాసన మండలి డిప్యూటీ చైర్మన్‌ చైర్‌కు గౌరవం ఏదీ?
  • ఎన్నికైన తర్వాత కూడా చాంబర్‌, సిబ్బంది, వ్యక్తిగత కార్యదర్శి, భద్రతా సౌకర్యాలు కల్పించలేదు
  • రాజ్యాంగబద్ధమైన పదవిని అవమానించేలా కూటమి ప్రభుత్వ వ్యవహారశైలి
  • టీటీడీ ఆలయాల్లోనూ డిప్యూటీ చైర్మన్‌ హోదాకు తగిన గౌరవం ఇవ్వడం లేదు
  • సమస్య పరిష్కారం కాకపోతే రాష్ట్రపతిని కలిసి రాజ్యాంగ ఉల్లంఘనలను వివరిస్తాం
  • ప్రోటోకాల్‌ ఉల్లంఘనలపై గవర్నర్అబ్దుల్ నజీర్ ను కలిసి ‌ఫిర్యాదు చేసిన శాసన మండలి డిప్యూటీ చైర్మన్‌ తూమాటి మాధవరావు

విజ‌య‌వాడ‌: రాజ్యాంగబద్ధమైన శాసన మండలి డిప్యూటీ చైర్మన్‌ పదవిని అవమానించేలా కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తోందని తూమాటి మాధవరావు ధ్వ‌జ‌మెత్తారు. తనపై వ్యక్తిగతంగా కక్ష సాధించినా, డిప్యూటీ చైర్మన్‌ చైర్‌కు గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని ఆయన స్పష్టం చేశారు. విజయవాడలో గవర్నర్‌ అబ్దుల్ నజీర్ ను కలిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, డిప్యూటీ చైర్మన్‌గా ఎన్నికైన తనకు ప్రోటోకాల్‌ ప్రకారం అందాల్సిన గౌరవం, సౌకర్యాలు కల్పించడం లేదని తెలిపారు.

ఇది తన వ్యక్తిగత సమస్య కాదని, రాజ్యాంగబద్ధమైన పదవి గౌరవానికి సంబంధించిన అంశమని పేర్కొన్నారు. ఈ విషయాలన్నింటినీ గవర్నర్‌ దృష్టికి తీసుకెళ్లానని, సమస్య పరిష్కారం కాకపోతే రాష్ట్రపతిని కూడా కలిసి వివరిస్తానని తూమాటి మాధవరావు వెల్లడించారు.

డిప్యూటీ చైర్మన్‌గా ఎన్నికైన తర్వాత కూడా నాకు చాంబర్‌, వ్యక్తిగత కార్యదర్శి, అదనపు వ్యక్తిగత కార్యదర్శి, ఇతర సిబ్బంది, భద్రత వంటి సౌకర్యాలు కల్పించలేదు. ప్రోటోకాల్‌ ప్రకారం దక్కాల్సిన గౌరవం విషయంలోనూ ఇబ్బందులు ఎదురవుతున్నాయి. సంబంధిత అధికారులు బాధ్యతను ప్రభుత్వంపైకి నెడుతుండగా, ప్రభుత్వం నుంచి సమాధానం రావడం లేదని చెబుతున్నారు. టీటీడీ ఆలయాలకు వెళ్లిన సందర్భాల్లోనూ నా హోదాకు తగిన మర్యాద లభించని పరిస్థితులు ఎదురయ్యాయి. ఈ అంశాలను అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పరిష్కారం కాలేదు. ఇవి నా వ్యక్తిగత సమస్యలు కావు.. రాజ్యాంగబద్ధమైన పదవికి సంబంధించిన అంశాలు.

ప్రభుత్వ కార్యక్రమాల్లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్‌కు ప్రాధాన్యం ఇస్తూ, డిప్యూటీ చైర్మన్‌గా ఉన్న నన్ను ఆహ్వానించకపోవడం ఏమిటి? ప్రోటోకాల్‌ విషయంలో ఒకరికి ఒక విధంగా, మరొకరికి మరో విధంగా ఎందుకు వ్యవహరిస్తున్నారు? రాష్ట్రంలో అంబేడ్కర్‌ రాసిన రాజ్యాంగం అమలవుతోందా? లేక రెడ్‌బుక్‌ రాజ్యాంగం అమలవుతోందా?
తిరుమల లడ్డూ ప్రసాదం విషయంలోనూ నేను శాసన మండలిలో ప్రభుత్వ వైఖరిని ప్రశ్నించినప్పటి నుంచి నాపై కక్ష సాధింపు జరుగుతోందని భావిస్తున్నాను. లడ్డూ ప్రసాదంపై చేసిన ప్రచారానికి సంబంధించి వచ్చిన నివేదికలపై కూటమి నేతలు ప్రజలకు సమాధానం చెప్పాలి. భక్తుల మనోభావాలకు సంబంధించిన అంశాల్లో బాధ్యతాయుతంగా వ్యవహరించాలి.

ఈ అంశాలన్నింటినీ విజయవాడలో గవర్నర్‌ను కలిసి వివరించాను. ఆయన సానుకూలంగా స్పందించారు. సంబంధిత అధికారులకు లేఖలు రాసి, వారి సమాధానం కోసం వారం రోజులు వేచి చూడాలని సూచించారు. ఆ గడువులో సమస్య పరిష్కారం కాకపోతే రాష్ట్రపతిని కలిసి రాష్ట్రంలో జరుగుతున్న రాజ్యాంగ ఉల్లంఘనలు, రాజ్యాంగబద్ధమైన పదవులకు ఎదురవుతున్న సమస్యలను వివరిస్తాను. అని తూమాటి మాధవరావు స్పష్టం చేశారు.

Total Visitors: 2,950,818