Suryaa.co.in

Andhra Pradesh

సమన్వయంతో భారీ నష్ట నివారణ

ఏలూరు, సెప్టెంబర్, 2 : మంత్రి కొలుసు పార్థసారథి, జిల్లా కలెక్టర్ కె.వెట్రిసెల్వి సమన్వయంతో తీసుకున్న ముందుజాగ్రత్త చర్యలతో జిల్లాలో భారీ వర్షాలు, వరదల కారణంగా ఎటువంటి ప్రాణ, ఆస్థి నష్టాలు కలగకుండా నివారించగలిగాం.

వర్షాలు ప్రారంభమై, వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి జిల్లా కలెక్టర్, జిల్లా అధికారులతో అత్యవసర సమావేశం ఏర్పాటుచేసి భారీ వర్షాల కారణంగా నష్టం వాటిల్లకుండా తీసుకోవలసిన చర్యలపై ముందుగానే దిశా నిర్దేశం చేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు మంత్రి కొలుసు పార్థసారథి తో, జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి లతో జిల్లాలో భారీ వర్షాల పరిస్థితిపై ఎప్పటికప్పుడు టెలిఫోన్ ద్వారా వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు.

ఎట్టిపరిస్థితుల్లోనూ ఎటువంటి ప్రాణ, ఆస్థి నష్టాలు కలగుండా పటిష్టమైన కార్యాచరణ ప్రణాలికను ముందుగానే సిద్ధం చేసుకుని అమలు చేయాలన్న ముఖ్యమంత్రి సూచనలతో మంత్రి కొలుసు పార్థసారథి నూజివీడు నియోజకవర్గంలో ముంపునకు గురయ్యే ప్రాంతాలలో విస్తృతంగా పర్యటించి అర్ధరాత్రి రెండు గంటల వరకు కూడా ప్రజలను పునరావాస కేంద్రాలకు దగ్గరుండి తరలించారు.

అదే విధంగా జిల్లాలోని ఎమ్మెల్యే లు వారి పరిధిలో ఎటువంటి నష్టం వాటిల్లకుండా అధికారులతో సమీక్షించి చర్యలు తీసుకున్నారు. జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి జిల్లాలోని భారీ వర్షాల కారణంగా ముంపునకు గురయ్యే సమస్యాత్మక ప్రాంతాలలో పర్యటించి అక్కడి ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించే పనులను దగ్గరుండి పర్యవేక్షించారు.

నూజివీడు నియోజకవర్గంలోని పెద్ద చెరువుకు గండి పడడంతో నూజివీడు పట్టణం, నూజివీడు, అగిరిపల్లి మండలాల్లోని పలు గ్రామాలు జలమయమయ్యాయి. మంత్రి పార్థసారథి జిల్లాలో ఎన్డీఆర్ఎఫ్ బృందాలను ముందు జాగ్రత్త చర్యగా సిద్ధం చేయడంతో, ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా ముంపు ప్రాంతాలలోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడానికి వీలు కలిగింది. చిత్తశుద్ధి, నిబద్దతతో పనిచేస్తే ఎంతటి వైపరీత్యాలనైనా ధీటుగా ఎదుర్కోగలమని మంత్రి పార్థసారథి, జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్విల నేతృత్వంలో జిల్లా అధికారులు నిరూపించారు.

LEAVE A RESPONSE