Suryaa.co.in

Crime News Telangana

అదీమ్‌ వెనుక భారీ నెట్‌వర్క్‌

– అతడి ఫోన్లో 49,900మంది యువతుల ఫొటోలు
– అంతర్జాతీయ వ్యభిచార ముఠా విచారణలో విస్తుపోయే వాస్తవాలు

హైదరాబాద్ : మహ్మద్‌ అదీమ్‌(31) అలియాస్‌ అర్నవ్‌, అభయ్‌, అర్నబ్‌, అర్నాఫ్‌, అరోరా, ఆశవ్‌, అతీఫ్‌, నిఖిల్‌.. సంచలనం సృష్టించిన అంతర్జాతీయ వ్యభిచార ముఠా కేసులో ప్రధాన నిందితుడి మారు పేర్లు ఇవి! భారీ నెట్‌వర్క్‌తో పెద్దఎత్తున వ్యభిచార గృహాలు నిర్వహిస్తున్న ఇతడు ఎట్టకేలకు సైబరాబాద్‌ పోలీసులకు దొరికాడు.దర్యాప్తులో భాగంగా ఇతని గురించి తెలుసుకుని పోలీసులే విస్తుపోయారు. ఫోన్లో ఏకంగా సుమారు 49,900 మంది యువతులు ఫొటోలు లభ్యమయ్యాయంటే ఏ స్థాయిలో ఈ చీకటి వ్యాపారం నడుస్తుందో అర్థం చేసుకోవచ్చు. వీరందరినీ అదీమ్‌ వ్యభిచారం కోసం సంప్రదించినట్లు గుర్తించారు. ఇతర నిందితుల ఫోన్లలోనూ వేలాది యువతుల చిత్రాలు ఉండడం చూసి అధికారులు ఆశ్చర్యపోతున్నారు.

రెండు నెలల ఆపరేషన్‌..
మహ్మద్‌ అదీమ్‌పై గచ్చిబౌలి, మాదాపూర్‌, అబిడ్స్‌, ఎస్‌ఆర్‌నగర్‌, రాయదుర్గం తదితర ఠాణాల్లో 10 కేసులున్నా పోలీసులకు చిక్కకుండా 2019 నుంచి కళ్లుగప్పి తిరుగుతున్నాడు. ఇంట్లో కూడా ఇతను ఏం చేస్తున్నాడో తెలియదు.వ్యభిచారం నిర్వహణలో తనకు సహకరించే మహిళతో సహజీవనం చేస్తున్నాడు.గతంలో హైదరాబాద్‌ పోలీసులు దాదాపు రెండు నెలలు వేటాడినా ఆచూకీ లభించలేదు. ఇతన్ని పట్టుకునేందుకు పోలీసులు భారీ వ్యూహమే పన్నారు.

తొలుత కొన్ని వ్యభిచార గృహాలపై దాడులు చేసిన సైబరాబాద్‌ మానవ అక్రమ రవాణా నిరోధక విభాగం అధికారులు, వాటి వెనుకున్న లింకులపై ఆరా తీయగా గుర్తింపు మార్చుకునే అదీమ్‌ గురించి తేలింది.

స్విగ్గీ, జొమాటో వంటి యాప్‌లో ఆహారం ఆర్డర్‌ పెట్టినప్పుడు ముందుగా పేర్కొన్న చిరునామాకు బదులు.. అక్కడి నుంచి దూరంలో ఉండే చోటకు రమ్మని చెబుతాడని పోలీసులు చెప్పారు. ఈ నేపథ్యంలో ఎక్కడా పోలీసులు వస్తున్నారనే సమాచారం లేకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ముందు అతని చుట్టూ ఉన్న ఒక్కొక్క నెట్‌వర్క్‌ను ఛేదించి ఆ తర్వాత అతని ఇంట్లోనే అరెస్టు చేశారు.

పరారీలో మరో ఐదుగురు
ఈ వ్యభిచార ముఠాతో సంబంధం ఉన్న మరో ఐదుగురు నిందితులు పరారీలో ఉన్నట్లు సమాచారం. వీరిని వేటాడేందుకు సిద్ధమవుతున్నారు. వీరి వెనుక ఇంకా ఎవరైనా ఉన్నారా అనే కోణంలో దర్యాప్తు జరుగుతోంది. ఇతర రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల పోలీస్‌ కమిషనర్లతో సంప్రదింపులు జరుపుతామని అధికారులు చెప్పారు. కొన్నిహోటళ్లలో చీకటి వ్యాపారం నడుస్తోందని తెలిసినా నిర్వాహకులు పట్టించుకోవడం లేదని తెలుస్తోంది. మరోవైపు నిందితుల ఫోన్‌ డేటా ఆధారంగా విటుల వివరాలు సేకరిస్తున్నారు.
కొన్ని వేల మంది చిట్టా పోలీసుల దగ్గర ఉంది. కొందరు నిందితుల నుంచి స్టార్‌ హోటళ్లలో పనిచేసే మేనేజర్లు కమీషన్లు తీసుకునేవారు.నగరానికి చెందిన ఓ హోటల్‌ మేనేజర్‌ అమ్మాయిల్ని తనతో గడపాలని కోరేవాడని తెలుస్తోంది.

LEAVE A RESPONSE