– కేసులు.. శిక్షలు.. ఏం చెబుతున్నాయి?
– భవిష్యత్తులో ఈ అమానవీయతకు శిక్షలేమిటి?
– ఈ కేసు భవిష్యత్తులో రాజకీయ నాయకుల రోడ్డు షోలను ప్రభావితం చేస్తుందా?
(బాబు భూమా)
కల్పబుల్ అనే పేరులోనే ఉంది కల్పితం అని వక్రీకరించి వైకాపా, సాక్షి మీడియా విశ్లేషణలు చేసినా ఆశ్చర్యపోనవసరం లేదు.
ఏదో కారు డ్రైవర్ నిర్లక్ష్యమే, సింగయ్య చావు దుర్ఘటనకు కారణమని ప్రాథమికంగా భావించారు. అయితే, కేసు దర్యాప్తు ముందుకు సాగే కొద్దీ కథనం మారింది. పోలీసులు కేవలం ప్రత్యక్ష సాక్షులను, డ్రైవర్‌ను మాత్రమే కాకుండా, నిశితంగా పరిశీలించడం మొదలుపెట్టారు. సీసీ కెమెరాల ఫుటేజీలు, వాహనంలోని వీడియో రికార్డింగ్‌లు, ఆకాశం నుంచి డ్రోన్‌లతో తీసిన దృశ్యాలు… అన్నీ ఒకదానికొకటి పోల్చి చూశారు. ఆ దృశ్యాల్లో కనిపించిన కొన్ని అంశాలు పోలీసులను విస్మయపరిచాయి. కేవలం జగన్ డ్రైవర్ నిర్లక్ష్యం కాకుండా, కారులో ఉన్న ప్రయాణికుల పాత్రలు కూడా ఈ ప్రమాదంలో ఉందన్న అనుమానం బలపడింది.
తీవ్ర విశ్లేషణ తర్వాత పోలీసులు ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారు. కేసులో కొత్త సెక్షన్లను చేర్చారు: బీఎన్ఎస్ 105 (కల్పబుల్ హోమీసైడ్ – హత్య కిందకు రాని నేరపూరిత చర్యలతో మనిషి మరణంకు కారణం అవ్వడం ) మరియు బీఎన్ఎస్ 49 (నేరానికి ప్రేరేపించడం). అంటే, డ్రైవర్ నిర్లక్ష్యం మాత్రమే కాదు, కారులోని ప్రయాణికుల (ఈ కేసులో జగన్మోహన్‌రెడ్డి, తదితరులు) ప్రత్యక్ష ప్రమేయం లేదా వారి ఆదేశాలు/ప్రోత్సాహం కూడా ఈ మరణానికి దారితీసిందని పోలీసులు భావించారు.
ఈ తీర్పు ఎన్నో ప్రశ్నలను లేవనెత్తింది. “ఒక కారులో కూర్చున్న ప్రయాణికుడు ప్రమాదానికి ఎలా బాధ్యుడు అవుతాడు?” అనే చర్చ మొదలైంది.
ఇక్కడే న్యాయ వ్యవస్థలోని కీలకమైన సూత్రాలు తెరపైకి వస్తాయి:
కల్పబుల్ హోమీసైడ్ (BNS 105): ఇది ఉద్దేశపూర్వక హత్య కానప్పటికీ, ఒక వ్యక్తి యొక్క చర్యల వల్ల మరొకరి మరణం సంభవించినప్పుడు వర్తిస్తుంది. ఇక్కడ, ప్రయాణికుడి చర్యలు (ఉదాహరణకు, మనిషి కారు క్రింద పడ్డాడు అని అరుస్తున్నా.. డ్రైవర్‌ను అత్యంత నిర్లక్ష్యంగా నడపమని ఆదేశించడం, గుంపులోకి దూసుకెళ్లమని పురికొల్పడం, లేదా బ్యానెట్ మీద ఊగిపోతున్న వారి వలన డ్రైవరుకు కనిపించకుండా ప్రమాదం జరుగుతుందని తెలిసీ దాన్ని పట్టించుకోకుండా ముందుకు వెళ్లమని ఆదేశించడం, కార్యక్రమానికి ఆలస్యం అవుతోంది ముందుకు వెళ్లమని చెప్పడం, బ్యానెట్ మీద ప్లకార్డులు పట్టుకొని డ్రైవరుకు అడ్డంగా వున్నా ఆపమనకపోవడం) నేరుగా మరణానికి దారితీసి ఉండవచ్చు.
నేరానికి ప్రేరేపించడం (BNS 49): ఈ సెక్షన్ ప్రకారం, ఒక నేరం జరగడానికి ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ప్రోత్సహించినా, సహాయపడినా, లేదా కుట్రలో భాగమైనా బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఒక డ్రైవర్‌ను ప్రమాదకరంగా డ్రైవ్ చేయమని ఒత్తిడి చేసినా లేదా ఆదేశించినా, అది ఈ సెక్షన్ కిందకు వస్తుంది.
ఈ కేసులో లభించిన సీసీ ఫుటేజీలు, వీడియోలు, డ్రోన్ దృశ్యాలు కేవలం డ్రైవర్ నిర్లక్ష్యాన్ని కాకుండా, అంతకు మించి ప్రయాణికుల వైపు నుండి ఒక విధంగా ప్రమాదానికి దోహదపడిన అంశాలను చూపించాయని స్పష్టమవుతోంది.
నేరం రుజువైతే, ఈ సెక్షన్ల కింద జీవిత ఖైదుతో సహా కఠిన శిక్షలు పడే అవకాశం ఉంది.
ఈ సంఘటన ఒక కీలక పాఠాన్ని నేర్పుతుంది: చట్టం ముందు అందరూ సమానులే. అధికారంలో ఉన్నా, సామాన్యులైనా, నిర్లక్ష్యంగా లేదా నేరపూరితంగా వ్యవహరిస్తే చట్టం తన పని తాను చేసుకుపోతుంది. ఒక్క క్షణం తీసుకున్న తప్పుడు నిర్ణయం, ఇచ్చిన తప్పుడు ఆదేశం ఒక జీవితాన్ని బలిగొనడమే కాకుండా, ఎన్నో జీవితాలను చీకటిలోకి నెట్టేస్తుంది. ఇది కేవలం రోడ్డు ప్రమాదం కాదు, న్యాయం, బాధ్యత, మరియు పరిణామాల గురించి లోతైన ప్రశ్నలను లేవనెత్తే ఒక సంక్లిష్టమైన కేసు.
భవిష్యత్తులో గంజాయి, మద్యం మత్తులో బ్యానెట్ మీదకు డ్రైవరుకు కనిపించకుండా వచ్చేలా.. క్రిందపడి మరణించడం లేదా తొక్కిసలాట జరిగి మరణించేలా జరిగే పరిస్థితులకు కారణం అయితే బొక్కలో పడేస్తారు అనే భయం వచ్చి రాజకీయ నాయకులు కొందరైనా మారవచ్చు. అల్లరిమూకలతో ర్యాలీలు చేస్తూ బలప్రదర్శన చేస్తూ రెచ్చిపోతే జరిగే మరణాలకు శిక్ష అనుభవించాల్సి వస్తుంది అనే అవగాహన వస్తుంది.