Suryaa.co.in

Telangana

ఆ రైతును నేనూ కలిశాను…నాపై కేసు పెడతారా డీజీపీ గారూ?

– కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ, కేసీఆర్‌ను పొగిడిన నల్గొండ జిల్లా రైతు
రైతు వీడియోను పోస్ట్ చేసిన జర్నలిస్ట్
– కేసు నమోదు చేసిన పోలీసులు
– జర్నలిస్ట్ చేసిన తప్పేమిటని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిలదీత

హైద‌రాబాద్: ఆ రైతును నేను కూడా కలిశాను… అతనితో మాట్లాడాను… మరి నాపై కూడా కేసు పెడతారా డీజీపీ గారూ? అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ వేదికగా ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ అనవసరంగా గెలిచిందని, కేసీఆర్ గెలవాల్సిందని నల్గొండ జిల్లాలోని ముషంపల్లి గ్రామానికి చెందిన రైతు మల్లయ్య అన్నారు.

ఇందుకు సంబంధించిన వీడియోను జర్నలిస్ట్ గౌతమ్ పోతగోని తన యూట్యూబ్ ఛానల్లో పోస్ట్ చేశాడు. దీంతో పోలీసులు ఆ జర్నలిస్ట్‌పై కేసు పెట్టారు. ఈ ఘటనపై కేటీఆర్ స్పందించారు. అసలు ఈ వీడియోలో తప్పు ఏముందని డీజీపీని ప్రశ్నించారు.

జర్నలిస్ట్ గౌతమ్ గౌడ్‌పై కేసు ఎందుకు నమోదు చేశారని నిలదీశారు. నేను కూడా ముషంపల్లిలో రైతు మల్లయ్యను కలిశానని, అతనితో మాట్లాడానని వెల్లడించారు. అలాంటప్పుడు నాపై కూడా కేసు పెడతారా? అని ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.

వీడియోలో ఏముంది?
కేసీఆర్ గెలిస్తేనే మాకు బుక్కెడు బువ్వ దొరుకుతుందని, లేకుంటే కంపలో పడి చచ్చిపోయినట్లేనని రైతు మల్లయ్య అన్నారు. కేసీఆర్ సార్ ఎక్కడ ఉన్నా రావాలన్నారు. ఇప్పుడు మాత్రం నీళ్లు లేక… కరెంట్ లేక వ్యవసాయం లేదని, దీంతో చావాలనిపిస్తోందన్నారు. ప్రస్తుత పాలనలో రైతుబంధు రావడం లేదన్నారు. కేసీఆర్ ఎక్కడున్నా రావాలని, ఆయనకే ఈసారి ఓటు వేస్తామన్నారు.

LEAVE A RESPONSE