అక్షరం నిన్ను ఓదారుస్తుందంటే
ముప్పూటలా అక్షర భోజనం
నేను తినిపిస్తానన్నా !
కవిత్వం నిన్ను సేదదీరుస్తుందంటే
దివారాత్రులూ కవితాసత్రం
నేను నిర్మిస్తానన్నా !
వ్యవసాయం గాలిలో దీపమై
జీవితంలో అప్పుల భారమై
ఎగతాళి చేస్తుండడం నిజమేఅయినా
చెమటనే చమురుని చేసి
బతుకుదివ్వెను వెలిగిస్తున్నోడివి
నువ్వారిపోతానంటే
నీ కుటుంబమేమైపోవాలి ?
వాళ్ళ బతుకులేమైపోవాలి ?
ఏరువాక సాగలేదని
జీవన నౌక ముంచేస్తామా !?
గిట్టుబాటు కాలేదని
కట్టెగా కాలిపోతామా !?
చితికిపోయామని
చితిని పేర్చుకుంటామా !?
సాలెపురుగుని చూడు
గూడుకట్టుకోడానికి ఎన్నిసార్లు కిందపడుతుందో
గొంగళిపురుగుని చూడు
సీతాకోకగా ఎగరడానికి ఎంత తపస్సు చేస్తుందో
చిన్న చీమను చూడు
పుట్టపేర్చడానికి ఎంత బరువుని మోస్తుందో !
అల్పజీవులకే ఆత్మస్థైర్యం ఉన్నప్పుడు
అన్నీతెలిసిన మనం
బతుకుల్ని అంతం చేసుకుంటామా ?!
రైతన్నా
ఒక్క అడుగు వెనక్కెయ్యి
పది అడుగులు ముందుకు పడతాయి
నీ ఒక్క శ్వాస నిలిస్తే
మరో పది శ్వాసలు వెలుగుతాయి !
ఈ ధైర్యవచానాలు
హితభోద కాదు సుమా
నిన్ను రక్షించుకోడానికి
నా కవితాక్షరాలు !
– పి.లక్ష్మణ్ రావ్
అసిస్టెంట్ రిజిస్ట్రార్
సహకార శాఖ
విజయనగరం
9441215989