– విద్యార్థుల కోసం లాఠీచార్జ్ లు ఎదుర్కొన్నా
– . పోలీసులు చేసిన లాఠీచార్జ్ లో నా చేయి విరిగింది
– దమ్ముంటే నన్ను ఎదిరించి పోరాడండి
– పేరులేని పేపర్లతో సోషల్ మీడియాలో ఫేక్ ప్రచారం చేస్తే క్రిమినల్ కేసులు వేసి జైలుకు పంపిస్తా
– బిజెపిలో కొత్త, పాత అనే తేడా ఉండదు
– మీ చెమట కష్టంతోనే బీజేపీ ఎదిగింది
– నల్గొండ జిల్లాలో సభ్యత్వ నమోదు కోసం సైకిల్‌పై డబుల్స్ జర్నీ చేసి పార్టీ కోసం పనిచేశా
– భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర శాఖ నూతన అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం ఎన్.రాంచందర్ రావు
హైదరాబాద్: జనసంఘ్ నుంచి భారతీయ జనతా పార్టీ వరకు… అనేక దశల్లో కార్యకర్తల త్యాగాలు, నిరంతర శ్రమ ఫలితంగా బిజెపి దేశంలో అతిపెద్ద, బలమైన పార్టీగా ఎదిగింది. క్రమశిక్షణ, సిద్ధాంతం పట్ల నిబద్ధతతో ఈ స్థాయికి వచ్చాం. ఇప్పుడు మనందరి లక్ష్యం.. బిజెపిని తెలంగాణలో అధికారంలోకి తీసుకురావడం.
ఈ సందర్భంగా ఒక సంఘటన గుర్తు చేసుకోవాలి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కర్నూలులో బిజెపి ఏర్పడే ముందు, జనసంఘ్ తరఫున ఓ అభ్యర్థి పోటీ చేశారు. ఆయనకు దాదాపు వెయ్యి ఓట్లు వచ్చాయి. ఆ ఎన్నికలో కమ్యూనిస్టు పార్టీ గెలిచింది. అయినప్పటికీ, జనసంఘ్ అభ్యర్థి తరఫున కార్యకర్తలు పార్టీ కార్యాలయం ముందు బాణసంచా కాల్చి సంబరాలు జరిపారు.
అప్పట్లో జనసంఘ్ నాయకులని ఆ సంబరాలపై ప్రశ్నించగా “గత ఎన్నికల్లో 300 ఓట్లు వచ్చాయి, ఈసారి వెయ్యి వచ్చాయి. పార్టీ ఎదుగుతోంది. బలోపేతమవుతోంది. అందుకే ఈ ఆనందం అని సమాధానమిచ్చారు.
అలాంటి స్థితి నుంచి ఈరోజు బిజెపి తెలంగాణలో 8 మంది లోక్‌సభ సభ్యులు, 8 మంది ఎమ్మెల్యేలు, ఒక రాజ్యసభ సభ్యుడు, ముగ్గురు ఎమ్మెల్సీలు ఉన్న స్థాయికి ఎదగడం గర్వకారణం.
అప్పట్లో బిజెపి అంటే చాలామందికి తెలియని పరిస్థితి. నేను యువమోర్చా కార్యకర్తగా ఉన్నప్పుడు నల్గొండ జిల్లాలో సభ్యత్వ నమోదు కోసం సైకిల్‌పై డబుల్స్ జర్నీ చేసి పార్టీ కోసం పనిచేశాను. విద్యార్థి పరిషత్‌లో ఉన్నప్పుడు హైదరాబాద్ నుంచి బస్సుల్లో కరీంనగర్, మెట్‌పల్లికి వెళ్లి సభ్యత్వ సేకరణ కోసం ప్రయాణించేవాళ్లం.
ఈరోజు బిజెపి ఈ స్థాయికి వచ్చిందంటే, దానికి కార్యకర్తల త్యాగాలు, నాయకుల కృషి, శ్రమ కారణం.డీఎస్పీ రెడ్డి , చలపతి రావు , వి. రామారావు గారు, బండారు దత్తాత్రేయ గారు, విద్యాసాగర్ రావు గారు, డాక్టర్ కె. లక్ష్మణ్ , కిషన్ రెడ్డి, బండి సంజయ్ రాష్ట్ర అధ్యక్షులుగా పని చేశారు. బిజెపి పార్టీ ఎదుగుదలలో ఇంతమంది రాష్ట్ర అధ్యక్షుల, నాయకుల కృషి, శ్రమ ఉంది.
గత 11 సంవత్సరాలుగా నరేంద్ర మోదీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం పరిపాలిస్తోంది. ఆయనతోపాటు అమిత్ షా , జేపీ నడ్డా , బీఎల్ సంతోష్ ఆశీర్వాదం కూడా మనకు లభిస్తోంది.జాతీయ నాయకులతో పాటు, రాష్ట్రస్థాయిలో కిషన్ రెడ్డి , డా. కె. లక్ష్మణ్ , బండి సంజయ్ వంటి నేతల సహకారంతో నాకు ఈ బాధ్యత లభించింది.
14 కోట్ల సభ్యులతో ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీ అయిన బిజెపిలో తెలంగాణ రాష్ట్ర శాఖకు నేను అధ్యక్షుడిగా ఎన్నికవడాన్ని నేను గర్వంగా భావిస్తున్నాను. అయినప్పటికీ, నేను నా మనసులో పార్టీ కార్యకర్తగానే పనిచేస్తాను. బిజెపిలో కలెక్టివ్ లీడర్షిప్ ఉంటుంది.
గతంలో నల్లగొండ జిల్లాలో మైసయ్య గౌడ్ అనే కార్యకర్తను నక్సలైట్లు హత్య చేశారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో కృష్ణవర్ధన్ రెడ్డి , చంద్రారెడ్డి నక్సలైట్ల బుల్లెట్లకు బలయ్యారు.
నేటి బిజెపి నాయకులు మనోహర్ రెడ్డి , కాసం వెంకటేశ్వర్లు , దుగ్యాల ప్రదీప్ కుమార్ , ధర్మారావు , నేనూ అందరం కలిసి నక్సలైట్లతో పోరాడి ఏబీవీపీని గెలిపించుకున్నాం. ఉస్మానియా యూనివర్సిటీలో ఏబీవీపీని గొప్ప స్థాయిలో నిలబెట్టడం జరిగింది.
బిజెపి అనేది క్యాడర్ బేస్డ్ పార్టీ, మాస్ బేస్డ్ పార్టీ, ఐడియాలజికల్ బేస్డ్ పార్టీ. తెలంగాణలో గోల్కొండ ఖిల్లాపై బిజెపి జెండా ఎగురవేయాలంటే ప్రతి కార్యకర్త కష్టపడి పనిచేయాలి. బిజెపిలో కొత్త, పాత అనే తేడా ఉండదు.
మన ఇంట్లో బాబు పుట్టినా, పాప పుట్టినా పుట్టినరోజునుంచే వారు కుటుంబసభ్యులవుతారు. అదే బిజెపిలోనూ వర్తిస్తుంది.
నది ప్రవహించాలి. కొత్తనీరు రావాలి. కొత్తవాళ్లు, పాతవాళ్లు కలిసి బిజెపిని బలోపేతం చేయాలి. తెలంగాణ యువత రాజకీయాల్లోకి రావాలి.
యువతలో ఉన్న చైతన్యాన్ని బిజెపి లోకి తేవాలి. యువకులు, మహిళలు బిజెపి లో చేరాలి.
భారతీయ జనతా పార్టీని మరింత బలోపేతం చేయాలి. రాబోయే రోజుల్లో తెలంగాణలో బిజెపిని అధికారంలోకి తీసుకురావాలి. బిజెపి వైపు రాష్ట్ర ప్రజలు చూస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు జరగబోతున్నాయి. పంచాయత్ నుంచి పార్లమెంట్ వరకూ బిజెపి గెలవాలి.బీఆర్ఎస్ పార్టీ వాట్సాప్ యూనివర్సిటీతో, కాంగ్రెస్ పార్టీ ఫేక్ న్యూస్ యూనివర్సిటీతో ట్రోలింగ్ చేస్తోంది.
ట్రోలింగ్ చేసేవారు చేసుకుంటారు. కానీ రాంచందర్ రావు అనే వ్యక్తి సౌమ్యుడు కాదు. 14 సార్లు జైలుకు వెళ్లినవాడిని. సిద్ధాంతం కోసం పోరాడినవాడిని. విద్యార్థుల కోసం లాఠీచార్జ్ లు ఎదుర్కొన్నాను. పోలీసులు చేసిన లాఠీచార్జ్ లో నా చేయి విరిగింది. సిద్ధాంతం కోసం, కార్యకర్తల కోసం త్యాగం చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. అగ్రెసివ్ అంటే సిద్ధాంతంపై నమ్మకంతో ముందుకు వెళ్లడం.కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై ప్రజాస్వామ్యబద్ధంగా పోరాటం చేస్తాం.
నేను విద్యార్థి దశ నుంచే అనేక పోరాటాలు చేశాను. అడ్వకేట్ల కోసం, విద్యార్థుల కోసం పోరాడాను. ఇప్పుడు తెలంగాణ ప్రజల కోసం పోరాడతాను. మీరు “నేను సైతం” అనే భావనతో కలెక్టివ్ లీడర్‌షిప్‌లో నన్ను ఆదరించాలి. నా నిర్ణయాలు వ్యక్తిగతంగా ఉండవు. అందరి నిర్ణయాలు తీసుకుని నేను అమలు చేయబోతున్నాను.
భారతీయ జనతా పార్టీకి తెలంగాణలో మంచి భవిష్యత్తు ఉంది. కొందరు సోషల్ మీడియాలో బిజెపి పై, నాపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు. దమ్ముంటే నన్ను ఎదిరించి పోరాడండి.పేరులేని పేపర్లతో సోషల్ మీడియాలో ఫేక్ ప్రచారం చేస్తే వారిపై క్రిమినల్ కేసులు వేసి జైలుకు పంపిస్తాం. లీగల్ యాక్షన్ ఉంటుంది.
మనమంతా క్రమశిక్షణతో బిజెపిని ముందుకు తీసుకెళ్లాలి. బిజెపి సిద్ధాంతాన్ని ప్రజలలోకి తీసుకెళ్లాలి. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ప్రజావ్యతిరేక విధానాలపై పోరాటం కొనసాగించాలి. జాతీయ, రాష్ట్ర నేతల మార్గదర్శనంలో భారతీయ జనతా పార్టీని మరింత బలోపేతం చేయడానికి కృషి చేస్తాను.