* వైసీపీలో ఉన్న పేదలకూ పథకాలు వర్తింపు
* త్వరలో రెండు విడతలుగా ఇళ్ల స్థలాల పంపిణీ
* ఆర్థిక ఇబ్బందులున్నా సంక్షేమ పథకాలు అమలు
* వెంకటగిరిపాళ్యం -కోన మల్లికార్జున స్వామి దేవాలయం కు బీటీ రోడ్డుకు ప్రతిపాదనలు
* రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత
పెనుకొండ: ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా సంక్షేమాన్ని అమలు చేస్తున్నామని, రాజకీయాలకతీతంగా అర్హులందరికీ సంక్షేమ ఫలాలు చేరవేస్తున్నామని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత స్పష్టంచేశారు. రాజకీయ కక్ష సాధింపులకు తావు లేకుండా అందజేస్తున్నామన్నారు. పెనుకొండ మండలం వెంకటగిరి పాళ్యంలో మంగళవారం మంత్రి సవిత ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు, ఉచిత గ్యాస్ సిలిండర్లు పంపిణీ చేశారు.
గ్రామంలో ఇంటింటికీ వెళ్లి లబ్ధిదారులకు పెన్షన్లను అందజేశారు. అంతకుముందు గ్రామంలో నిర్వహించిన సమావేశంలో మంత్రి సవిత మాట్లాడారు. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీనీ సీఎం చంద్రబాబునాయుడు నెరవేరుస్తున్నారన్నారు. సత్యసాయి జిల్లాలో కో 114 కోట్ల రూపాయలతో 2.63 లక్షల మందికి సామాజిక పెన్షన్లు అందజేస్తున్నామన్నారు. రాయలసీమ అభివృద్ధికి సీఎం చంద్రబాబు అధిక ప్రాధాన్యమిస్తున్నారన్నారు. గొల్లపల్లి రిజర్వాయర్ ను నిర్మించడంతో పాటు కియా పరిశ్రమను ఏర్పాటు చేయడంతో పెనుకొండతో పాటు జిల్లా రూపురేఖలే మారిపోయాయని మంత్రి సవిత ఆనందం వ్యక్తంచేశారు.
వైసీపీ క్యాడర్ కూ సంక్షేమం వర్తింపు
కూటమి ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ పథకాలను అర్హులందరికీ వర్తంపచేస్తున్నామని మంత్రి సవిత వెల్లడించారు. రాజకీయాలతో సంబంధం లేకుండా వైసీపీకి మద్దతుగా ఉన్న పేదలకూ సంక్షేమ ఫలాలు అందిస్తున్నామని మంత్రి సవిత తెలిపారు. వెంకటగిరి పాళ్యం నుంచి కోన మల్లికార్జున స్వామి దేవాలయం వరకు వరకూ బీటీ రోడ్డు నిర్మాణానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు.
ఇప్పటికే ప్రతిపాదనలు పంపామని, నిధులు మంజూరు కాగానే పనులు చేపడతామని మంత్రి సవిత వెల్లడించారు. మక్కాజపల్లి తండాకు కూడా బీటీ రోడ్డు నిర్మాణానికి ప్రతిపాదనలు పంపామన్నారు. ఇప్పటికే వెంకటగిరి పాళ్యం రూ.30 లక్షలతో సీసీ రోడ్లు నిర్మించామన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు , స్థానికలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు