– బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య రాజ్యాంగ బద్దంగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రాన్ని దేశ విభజనతో పోల్చడం క్షమించరాని నేరం
– తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా , తెలంగాణ సాధనలో అమరుల త్యాగాలను అవమానించేలా బీజేపీ ఎంపీ వ్యాఖ్యలు
– ఎంపీ తేజస్వీ సూర్యపై వెంటనే చర్యలు తీసుకుని పార్లమెంట్ నుండి సస్పెండ్ చేయాలి.
– తెలంగాణకు చెందిన కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ ఈ వాఖ్యలపై సమాధానం చెప్పాలి
– బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని తెలంగాణ ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలి
– మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి
హైదరాబాద్: తెలంగాణ ఏర్పాటును దేశ విభజనతో పోల్చిన బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యలను మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి తీవ్రంగా ఖండించారు.ఈ వ్యాఖ్యలు పూర్తిగా అవివేకపూరితమైనవని, తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. రాజ్యాంగబద్ధంగా చట్టాలకు లోబడి పార్లమెంట్ ప్రక్రియ ద్వారా ఒక రాష్ట్రం ఏర్పడటాన్ని దేశ విభజనతో ముడిపెట్టి శత్రుదేశమైన పాకిస్థాన్ తో పోల్చడం క్షమించరాని నేరమని, ఇది దేశద్రోహానికి సమానమని ఆయన అభిప్రాయపడ్డారు.
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరిగిన దీర్ఘకాల పోరాటం, వేలాది అమరుల త్యాగాలను అవమానించేలా బీజేపీ ఎంపీ తేజస్వి వ్యాఖ్యలు ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి బాధ్యతారాహిత్య వ్యాఖ్యలు చేసిన ఎంపీపై వెంటనే చర్యలు తీసుకుని పార్లమెంట్ నుండి సస్పెండ్ చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.అంతేకాకుండా, తన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకుని తెలంగాణ ప్రజలకు బహిరంగంగా క్షమాపణ చెప్పాలని తేజస్వీ సూర్యను కోరారు.
రాజ్యాంగబద్ధంగా ఏర్పడిన తెలంగాణ దేశానికి రోల్ మోడల్‌గా నిలుస్తుండటాన్ని బీజేపీ తట్టుకోలేకపోతోందని, బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య అహంకారపూరిత వ్యాఖ్యలే దీనికి నిదర్శనమని విమర్శించారు. తెలంగాణ ఏర్పాటును ఇండియా-పాకిస్థాన్ విభజనతో పోల్చడం అంటే పార్లమెంట్‌ను, 140 కోట్ల దేశ ప్రజలను అవమానపరచడమేనని అన్నారు. ఒకవేళ తెలంగాణ ఏర్పాటు అదే తరహాలో ఉంటే, విభజన బిల్లుకు అప్పట్లో బీజేపీ ఎందుకు మద్దతు తెలిపిందని ప్రశ్నించారు.
ప్రధాని నరేంద్ర మోడీ కూడా గతంలో తెలంగాణ ఏర్పాటు ప్రక్రియపై అనుచిత వ్యాఖ్యలు చేశారని గుర్తుచేశారు. నాడు మోడీ అయినా, నేడు తేజస్వి సూర్య అయినా తెలంగాణ ప్రజల మనోభావాలను గాయపరిచారని అన్నారు. బీజేపీ ఎంపీ తేజస్వి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై అవమానకరంగా మాట్లాడుతుంటే అదే పార్లమెంట్ సమావేశాల్లో ఉన్న తెలంగాణకు చెందిన 8 బీజేపీ, 8 కాంగ్రెస్ ఎంపీలు మౌనం వహించడం సిగ్గుచేటు .
తెలంగాణలో గెలిచిన ప్రజాప్రతినిధులు ఢిల్లీలో రాష్ట్ర గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత వారిపై ఉందని గుర్తుచేశారు.తేజస్వి సూర్య వ్యాఖ్యలను ఖండించకుండా సభలో తెలంగాణ బీజేపీ, కాంగ్రెస్ ఎంపీలు దిష్టి బొమ్మల్లా మిగిలారు. తెలంగాణ నుండి కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి, సహాయమంత్రి బండి సంజయ్ తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలి అన్నారు. ఒకవేళ అదే సమయంలో బీఆర్ఎస్ ఎంపీలు లోక్‌సభలో ఉంటే బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య సంగతి ఏమిటో తేల్చేవారు, పార్లమెంట్ ను స్థంబింపజేసి వారికీ తగిన సమాధానం ఇచ్చేవారు.
బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వెంటనే తెలంగాణ ప్రజలకు, పార్లమెంట్‌కు బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.
తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే ఎలాంటి చర్యలనైనా ప్రజలు సహించరని, బీజేపీ నేతలు కొరవి తో తలగోక్కోవద్దని తీవ్రంగా హెచ్చరించారు. తెలంగాణ ఏర్పాటు పై బీజేపీ వైఖరిని తెలంగాణ ప్రజలు గమనించాలని కోరారు.