– తేజస్వీ సూర్య వి రాజ్యాంగం పట్ల అవగాహన లేని “పిల్లాడి” చేష్టలు
– అమరుల త్యాగాలను కించపరచడమే
– 16 మంది ఎంపీల మౌనం.. సిగ్గుచేటు
– పార్లమెంటు నుండి సస్పెండ్ చేయాలి
– బహిరంగ క్షమాపణకు ఎమ్మెల్సీ డాక్టర్ శ్రవణ్ దాసోజు డిమాండ్
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును భారత్-పాకిస్థాన్ విభజనతో పోల్చుతూ బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య చేసిన వ్యాఖ్యలు ఆయన రాజకీయ అజ్ఞానానికి, తెలంగాణ పట్ల ఉన్న వివక్షా పూరిత ఆలోచనా ధోరణికి అద్దం పడుతున్నాయని ఎమ్మెల్సీ డాక్టర్ శ్రవణ్ దాసోజు తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు ఆయన ఒక ఘాటు ప్రకటన విడుదల చేశారు.
“తేజస్వీ సూర్య గారూ.. మీరు ఒక లాయర్ అని చెప్పుకుంటారు, కానీ మీకు భారత రాజ్యాంగం మీద కనీస అవగాహన లేకపోవడం విచారకరం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 ప్రకారం. దేశ అత్యున్నత పార్లమెంటు ఉభయ సభలు ఆమోదించి, రాష్ట్రపతి గెజిట్ విడుదల చేసిన పవిత్ర ప్రక్రియను.. బ్రిటిష్ వారు మత ప్రాతిపదికన చేసిన దేశ విభజనతో పోల్చడం పార్లమెంటరీ వ్యవస్థను ధిక్కరించడమే. ఇది సభను తప్పుదోవ పట్టించడమే కాకుండా, భారత రాజ్యాంగ స్ఫూర్తిని కించపరచడమే.”
తెలంగాణ ఏర్పాటును దేశ విభజనతో పోల్చడం వెనుక మీ ఆంతర్యం ఏమిటి? స్వదేశంలోని ఒక రాష్ట్రాన్ని శత్రుదేశమైన పాకిస్థాన్‌తో పోల్చడం క్షమించరాని నేరం మరియు ఇది దేశద్రోహంతో సమానం. తెలంగాణ ప్రజలు మీ దృష్టిలో శత్రువులా? మీ మాటలు తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని తీవ్రంగా గాయపరిచాయి. మీ విద్వేష పూరిత రాజకీయాల కోసం తెలంగాణ అస్తిత్వాన్ని వాడుకోవాలని చూస్తే సహించేది లేదు.
తెలంగాణ రాష్ట్రం ఏదో దానంగా వచ్చింది కాదు. వందలాది మంది విద్యార్థుల ప్రాణత్యాగాలు, దశాబ్దాల పోరాటం, నాలుగు కోట్ల ప్రజల ఆకాంక్షల ఫలితం. ఈ పవిత్రమైన పోరాటాన్ని ‘దేశ విభజన’ వంటి రక్తసిక్తమైన చరిత్రతో పోల్చడం ద్వారా మీరు అమరవీరుల త్యాగాలను అపహాస్యం చేస్తున్నారు.
తెలంగాణ నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న 8 మంది బీజేపీ మరియు 8 మంది కాంగ్రెస్ ఎంపీలు తేజస్వీ సూర్య వ్యాఖ్యలను ఎందుకు ఖండించడం లేదు? ఇక్కడ ఓట్లు వేయించుకుని గెలిచిన మీరు, ఢిల్లీలో తెలంగాణ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెడతారా? మీ పార్టీ సహచరుడు ఇంతటి దుర్మార్గపు వ్యాఖ్యలు చేస్తే నోరు మెదపకపోవడం మీ అసమర్థతకు, భావదారిద్ర్యానికి నిదర్శనం.
రాజ్యాంగ వ్యతిరేక వ్యాఖ్యలు చేస్తూ, ప్రాంతాల మధ్య విద్వేషాలు రేకెత్తిస్తున్న తేజస్వీ సూర్యను వెంటనే లోక్‌సభ నుండి సస్పెండ్ చేయాలి. ఒక ప్రాంత అస్తిత్వాన్ని కించపరిచినందుకు మరియు తప్పుడు సమాచారంతో ప్రజలను రెచ్చగొట్టినందుకు ఆయనపై భారతీయ నాగరిక్ సురక్ష సంహిత (BNSS) మరియు BNS లోని సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలి.
తేజస్వీ సూర్య తన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలి మరియు తెలంగాణ సమాజానికి బహిరంగంగా క్షమాపణ చెప్పాలి. లేనిపక్షంలో తెలంగాణ వాదులు మిమ్మల్ని, మీ పార్టీని ఈ గడ్డపై తిరగనివ్వరు.
రాజకీయాల కోసం తెలంగాణ చరిత్రను వక్రీకరించడం బీజేపీకి అలవాటుగా మారింది. కానీ తెలంగాణ అంటే ఒక విప్లవం, ఒక త్యాగం, ఒక చరిత్ర. ఆ ప్రజా ఉద్యమ చరిత్రను అవమానిస్తే కాలగర్భంలో కలిసిపోవడం ఖాయం.