-టిడిపి నాయకులు డాక్టర్ పెమ్మసాని
-మంగళగిరి కంటే ఒక్క ఓటైనా తెనాలిలో ఎంపీకి పెరగాలి – మాజీ ఎమ్మెల్యే ఆలపాటి
రక్తాన్ని పసుపుతో నింపుకున్న కార్యకర్తలకు, నాయకులకు అభివందనమని టిడిపి నాయకులు డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. తెనాలి నియోజవర్గం తెలుగుదేశం పార్టీ ఆత్మీయ పరిచయ సమావేశ కార్యక్రమం స్థానిక ఎన్విఆర్ కల్యాణ మండపంలో మంగళవారం సాయంత్రం జరిగింది. కార్యక్రమంలో ముందుగా ఎన్టీఆర్ విగ్రహానికి పెమ్మసాని, ఆలపాటి పూలమాల వేసి, కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్ పెమ్మసాని మాట్లాడుతూ కార్యకర్తల కోసం నిరంతరం పాటుపడ్డ అతి తక్కువ మంది నాయకుల్లో ఆలపాటి ఒకరని అన్నారు. తన వైపు నుంచి ఆలపాటికి ఎప్పుడైనా, ఎలాంటి సహాయానికైనా సిద్ధంగా ఉంటానన్నారు.
నియోజకవర్గంలో ముఖ్యంగా టిడిపి మహిళల గురించి మాట్లాడాలంటే వైసీపీ వాళ్లు ఎన్ని రకాలుగా వేధించినా మహిళా కార్యకర్తలు టిడిపి తరఫున నిరంతరం పోరాడుతూనే ఉన్నారన్నారు. అమర్ రాజా వంటి ఫాక్టరీ ఎన్నో వేల మందికి అన్నం పెడుతున్నదని తెలిసినా, ఆ ఫ్యాక్టరీ రాష్ట్రం నుంచి వెళ్ళిపోయే వరకు జగన్ నిద్రపోలేదని చెప్పారు. హైదరాబాదు నుంచి విజయవాడకు ప్రశాంతంగా ప్రయాణించగలమని కానీ, విజయవాడ నుంచి తెనాలి రావాలంటే నరకప్రాయమేనన్నారు. నారా లోకేష్ ఏదైతే అనుకుంటారో అదే చేస్తారని, మంగళగిరిలో ఆయన పడే కష్టం చాలామందికి తెలియకపోవచ్చు కానీ, ఆయన ఒక గొప్ప నాయకత్వ లక్షణాలున్న నాయకుడని పెమ్మసాని ఈ సందర్భంగా స్పష్టం చేశారు.
టిడిపి కష్టకాలంలో ఉన్న సమయంలో పవన్ కళ్యాణ్ రోడ్డుపైకొచ్చి చేయి అందించిన విధానం ఎన్నడూ మర్చిపోలేనిదని, అది గుర్తుంచుకొని కార్యకర్తలందరూ ఏ ఒక్క ఓటు కూడా మిస్ అవ్వకుండా 100% ఓట్లు పడేలా పని చేయాలని కోరారు. తాను ఏదైనా ఒక కార్యక్రమాన్ని మొదలుపెడితే పూర్తి చేయకుండా వదిలిపెట్టడం తనకు తెలియదని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.
అనంతరం నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ అన్ని దానాల కంటే విద్యా దానం గొప్పదని నమ్మిన వ్యక్తి డాక్టర్ పెమ్మసాని అని కొనియాడారు. నేడు అమెరికాకు వెళ్లి వైద్య విద్య అభ్యసించాలనుకునే ప్రతి విద్యార్థికీ డాక్టర్ పెమ్మసాని జర్నల్ ఎంతగానో ఉపయోగపడుతుందని, ఒకరికొకరు అండగా నిలబడ్డ పెమ్మసాని సోదరులు త్వరలో ప్రజలకు కూడా అండగా ఉంటామని ఉమ్మడి భరోసా ఇస్తూ ముందుకు వస్తున్నారన్నారు. తాను 3 రోజుల క్రితం కలిసినప్పుడు తన గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదని చంద్రబాబు తనతో చెప్పారని, ఎలా న్యాయం చేయాలో తమకు వదిలేయమని బాబు, లోకేష్ తెలిపారని ఈ సందర్భంగా కార్యకర్తలకు ఆలపాటి వివరించారు.
గతంలో ఈ పార్లమెంటు తెనాలి పేరు మీదనే ఉండేదని, విభజిత జిల్లాల తర్వాత గుంటూరు పార్లమెంటుగా మారిన నేపథ్యంలో పెమ్మసాని రాక తర్వాత అయినా ఈ పార్లమెంటుకు తెనాలి పేరు పెట్టేలా చూడాలని పెమ్మసానిని ఆలపాటి కోరారు. మంగళగిరి కంటే ఒక్క ఓటైనా ఎంపీకి తెనాలిలో ఎక్కువ ఓట్లు రావాలని కార్యకర్తలకు ఆలపాటి రాజా పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి టిడిపి నాయకులు డాక్టర్ దక్షిణామూర్తితో పాటు గ్రామ, మండల, నియోజకవర్గ స్థాయి నాయకులు కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు.