Suryaa.co.in

Editorial

నాకు ముస్లిం ఓట్లు అవసరం లేదు

– కాంగ్రెస్‌కు ఓటేస్తామనేవాళ్ల ఓటు నాకెందుకు?
– త్రిబుల్ తలాక్ రద్దుతో ముస్లిం మహిళల ఓట్లు బీజేపీకే
– హిందువుల ఓట్లలో చీలిక రాదు
– పోటీ బీజేపీ-కాంగ్రెస్ మధ్యనే
– బీఆర్‌ఎస్‌ది మూడో స్థానమే
– బీఆర్‌ఎస్‌కు బీసీలను సీఎంను చేసే దమ్ము-ధైర్యం ఉందా?
– మోదీని చూస్తున్న యువత, మహిళ
– పద్మారావు సికింద్రాబాద్‌ను కొడుకులకు పంచేశారు
– కార్పొరేటర్లకు విలువ ఇవ్వని పద్మారావుపై అసంతృప్తి
– కార్పొరేటర్లపై కొడుకుల పెత్తనం ఏమిటి?
-కొందరు బీఆర్‌ఎస్ అగ్రనేతలు నాతో టచ్‌లో ఉన్నారు
– మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్ డబ్బులెవరికి వెళుతున్నాయ్?
– అధికారులను అడిగినా చెప్పడం లేదు
– గెలిచిన తర్వాత దానిపై విచారణ జరిపిస్తా
– సికింద్రాబాద్‌లో అభివృద్ధి శూన్యం
– శిధిలావస్థలో ప్రమాదకర రోడ్లు
– డ్రైనేజీ సమస్యల పరిష్కారంలో పద్మారావు విఫలం
– జనాలకు దొరకని పద్మారావును మళ్లీ గెలిపించాలా?
– సమస్యలు చెప్పుకోవాలంటే మోండా మార్కెట్‌కు వెళ్లాలా?
– దళితబంధులో కమిషన్ల రాజ్యం
– వేలమంది దళితులకు అందని దళితబంధు
– బీసీ-దళిత బంధు ఎంతమందికి ఇచ్చారో చెప్పే దైర్యం ఉందా?
– డబుల్‌బె డ్ రూముల సక్కదనం ఎలా ఉందో చూపిస్తా.. వస్తారా?
– బీజేపీ గెలిస్తే రోడ్ల విస్తరణ, కొత్త రోడ్లు
– స్థానిక ప్రజలతో ఎక్కడికక్కడ కమిటీలు వేస్తాం
– ప్రజల వద్దకే అధికారులను తీసుకువస్తాం
– సికింద్రాబాద్ బీజేపీ అభ్యర్ధి మేకల సారంగపాణి
( మార్తి సుబ్రహ్మణ్యం)

కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తామంటున్న ముస్లిం ఓట్లు నాకు అవసరం లేదు. హిందువుల ఓట్లలో చీలికలు వస్తాయన్నది ఉత్తిమాటే. అంతా బీజేపీకి గెలిపించాలన్న ఏకభావనతో ఉన్నారు. అది ప్రచారంలో స్పష్టంగా కనిపిస్తోంది. హిందూ బంధువులంతా జాతీయభావనతో కులాలకు అతీతంగా బీజేపీకే ఓటేస్తారు. యువత- మహిళ మోదీ వైపు చూస్తోంది. ముస్లిం మహిళల జీవితాల్లో చీకటి నింపిన త్రిబుల్ తలాక్‌ను మోదీ ప్రభుత్వం రద్దు చేసింది. ఆ కృతజ్ఞత ముస్లిం మహిళల్లో ఉంది. వారిఓట్లు కూడా బీజేపీకే. అయితే ఈ ఎన్నికల్లో తాము కాంగ్రెస్‌కే మద్దతునిస్తామని ముస్లిం సంఘాలు ప్రకటించినందున, నేను వారి ఓట్లు అడగటం లేదు. నాకు వారి ఓట్లు వద్దు. హిందువుల ఓట్లలో ఈసారి చీలిక రాదు. వారి ఓటు బీజేపీకే’నని సికింద్రాబాద్ బీజేపీ అభ్యర్ధి మేకల సారంగపాణి స్పష్టం చేశారు.

సికింద్రాబాద్‌లో బీజేపీ బలంగా ఉందని, తటస్థులు-విద్యావంతులు-యువత-మహిళా వర్గాలు పార్టీని ఆదరిస్తున్నాయని ఆ పార్టీ అభ్యర్ధి మేకల సారంగపాణి చెప్పారు. ‘‘ ముస్లిం ఓట్లు కాంగ్రెస్‌కు వేయాలన్న ఆదేశాలు వచ్చాయంటున్నారు. కాబట్టి నాకు కేవలం హిందు-క్రైస్తవుల ఓట్లు చాలు. ఎలాగూ మాదిగజాతి మా పార్టీకే మద్దతు ప్రకటించింది. మాలల ఓట్లు కూడా మాకే. సికింద్రాబాద్‌లో ఎన్నికల యుద్ధం కేవలం బీజేపీ-కాంగ్రెస్ మధ్యనే. బీఆర్‌ఎస్‌ది మూడో స్థానమే. ప్రచారంలో అది స్పష్టంగా కనిపిస్తోంది’’ అని వ్యాఖ్యానించారు.

సిట్టింగ్ ఎమ్మెల్యే పద్మారావు సికింద్రాబాద్‌ను అభివృద్ధి చేయకపోయినా, కొడుకులకు నియోజకవర్గాన్ని డివిజన్ల వారీగా పంచారని విమర్శించారు. ‘‘కొడుకుల రాకతో కార్పొరేటర్లకు, డివిజన్ నేతలకు విలువ లేకుండా పోయింది. కొడుకులు కూర్చుంటే కార్పొరేటర్లు చేతులు కట్టుకుని నిలబడుతున్న అవమానకర పరిస్థితి మీరు ఫొటోల్లో చూస్తూనే ఉన్నారు. ఎన్నికైన కార్పొరేటర్లపై కొడుకుల పెత్తనం అన్యాయం కదా? మీరు ప్రభుత్వ కార్యక్రమాలకు సంబంధించి ఏ ఫొటో చూసినా కొడుకులే కనిపిస్తారు. వాళ్లకు అధికారిక కార్యక్రమాలతో ఏం సంబంధం? ఏ హోదాతో వాళ్లు ప్రభుత్వ చెక్కులు పంపిణీ చేస్తున్నారు? అధికారులు దానిని ఏవిధంగా అనుమతిస్తున్నారు? పద్మారావు సొంత డబ్బులిస్తే ఫర్వాలేదు. ప్రభుత్వం ఇచ్చే చెక్కులను కొడుకులు ఏ హోదాతో లబ్ధిదారులకు పంపిణీ చేస్తారు? చాలామంది బీఆర్‌ఎస్ లీడర్లు నాతో టచ్‌లో ఉన్నారు.వాళ్ల గోస గోసకాదు’’ అని సారంగపాణి వెల్లడించారు.

అభివృద్ధిలో సికింద్రాబాద్ వెనుకబడిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రధాన రోడ్ల నుంచి గల్లీ రోడ్ల వరకూ శిధిలమయ్యాయన్నారు. డ్రైనేజీలపై ఫిర్యాదు చేస్తే ఎవరూ స్పందించరు. కాంట్రాక్టర్లకు బిల్లులు కూడా ఇవ్వలేని ప్రభుత్వం మళ్లీ ఓట్లు అడగటం సిగ్గుచేటన్నారు. దీనికి పద్మారావు వైఫల్యమే కారణమని విమర్శించారు. ‘‘దళితబంధుకు వేలాదిమంది దరఖాస్తు చేస్తే ఎన్ని వందలమందికి ఇచ్చారు? బీసీబంధుకు ఎంతమంది దరఖాస్తు చేస్తే ఎంత మందికి ఇచ్చారో చెప్పే ధైర్యం పద్మారావుకు ఉందా? దళితబంధుకు 10 లక్షలు ఇచ్చిన కేసీఆర్ ప్రభుత్వం బీసీలకూ 10 లక్షలు ఇవ్వాలి కదా? అంటే బీసీలంటే చిన్నచూపా? బీఆర్‌ఎస్‌కు బీసీలు ఎందుకు ఓటెయ్యాలి’’? అని ప్రశ్నించారు.

‘నేను గెలిచిన తర్వాత రోడ్లు విస్తరణ చేయిస్తా. అదే నా మొదటి ప్రాధాన్యం. డ్రైనేజీ వ్యవస్థను ఆధునీకరిస్తా. ప్రజలు వ్యయ ప్రయాసలకోర్చి నావరకూ వచ్చే అవసరం లేకుండా, ఎక్కడికక్కడ పార్టీలకు అతీతంగా అభివృద్ధి కమిటీలు వేస్తా. ఆ నాయకులే నాకు సమస్యలు వివరిస్తారు’’ అని వెల్లడించారు.

ఎన్నికల్లో తన గెలుపు ఖాయమని సారంగపాణి ధీమా వ్యక్తం చేశారు. ‘నేను ఎక్కడికి వెళ్లినా ప్రజలు సమస్యలు ఏకరవు పెడుతున్నారు. పాడైపోయిన రోడ్లమీదనే వెళుతున్నాం. అధికారులకు ఫిర్యాదు చేసినా రావడం లేదని చెబుతున్నారు. పద్మారావు ఆఫీసుకు వెళితే ఆయన ఎప్పుడు వస్తారో ఎప్పుడు రారో ఎవరికీ తెలియదు. సమస్యలు చెప్పుకోవాలంటే మోండా మార్కెట్‌కు వెళ్లాలా? సమస్యలు పరిష్కరించకుండా దర్బారు పెడితే ఏం ఉపయోగం? ఈ ఎన్నికల్లో పోటీ బీజేపీ-కాంగ్రెస్‌కే. బీఆర్‌ఎస్‌కు మూడో స్థానం. మాదిగ సోదరులు నావైపే ఉన్నారు. కృష్ణమాదిగ అన్న పిలుపు మాదిగ జాతికి ప్రభంజనం. ముదిరాజులకు సీటివ్వని బీఆర్‌ఎస్‌కు ముదిరాజులు ఎందుకు ఓటేయాలి? మాదిగలు-ముదిరాజులు-గంగపుత్రులు-మున్నూరుకాపులు-పద్మశాలి-సగర-వైశ్య-
బ్రాహ్మణ- మార్వాడీల మద్దతునాకే. బీసీని సీఎం చేయడమే బీజేపీ లక్ష్యం. బీఆర్‌ఎస్‌కు బీసీలను సీఎంను చేసే దమ్ము-ధైర్యం ఉందా?’’

LEAVE A RESPONSE