– ఏపీ ప్రభుత్వంపై పూర్తి భరోసా
– మా కుటుంబానికి ప్రభుత్వ అండ ఉంది
– పాస్టర్ ప్రవీణ్ భార్య జెస్సికా, తమ్ముడు కిరణ్ స్పష్టీకరణ
– వీడియో విడుదల చేసిన భార్య, తమ్ముడు
– పాస్టర్ మృతిపై కథలు అల్లడంపై కుటుంబసభ్యుల ఆగ్రహం
ఒక వ్యక్తి మరణిస్తే ఎవరైనా సానుభూతి చూపిస్తారు. కానీ కొందరు తమ రాజకీయ స్వార్థం కోసం ఆ వ్యక్తి కులాన్నో, మతాన్నో అడ్డు పెట్టుకుని విద్వేషాలు రెచ్చగొట్టడానికి ప్రయత్నించడం దారుణం. పాస్టర్ ప్రవీణ్ మరణం విషయంలో పూటకో కథ అల్లుతూ కొన్నిశక్తులు ఇలాగే పనిచేసాయి. ఈ
దారుణాన్ని ప్రవీణ్ భార్య జెస్సికా, సోదరుడు కిరణ్ లు ఖండించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపడుతున్న విచారణ పై తమకు పూర్తి నమ్మకం ఉందని… పోలీసుల విచారణ సక్రమంగా జరుగుతుందని… బాధలో ఉన్న తమ కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉందని వారిద్దరు చెప్పారు.
చెలరేగే శక్తులకు చెప్పుదెబ్బ
పాస్టర్ కుటుంబసభ్యులు తాజాగా విడుదల చేసిన వీడియోతో.. పాస్టర్ ప్రవీణ్‌ది హత్యేనంటూ, ఇప్పటివరకూ గత్తర చేస్తున్న వైసీపీ అనుకూల క్రైస్తవ సంఘాల నోళ్లు మూతబడినట్లయ్యాయి. తన భర్త- అన్న మృతిపై ఏపీ సర్కారు చేస్తున్న దర్యాప్తుపై తమకు పూర్తి నమ్మకం ఉందంటూ వారు చేసిన ప్రకటన.. ఈ మృతిని రాజకీయంగా వాడుకునేందుకు, ప్రణాళికలు రూపొందిస్తున్న వైసీపీ శక్తులకు చెంపపెట్టుగా మారింది. అయినా సరే.. తన భర్త మృతిపై ఏపీ ప్రభుత్వ విచారణపై నమ్మకం ఉందని, స్వయంగా పాస్టర్ ప్రవీణ్ భార్య జెస్సికా- తమ్ముడు కిరణ్ స్పష్టంగా చెప్పినా… ఈ శక్తులు కుదరదంటారేమో చూడాలి.