Suryaa.co.in

Andhra Pradesh

ప్రజారోగ్య పరిరక్షణ కోసం కూట‌మి వినూత్న నిర్ణ‌యం

– దేశంలో తొలిసారిగా ఇంటి వద్దే 47 ర‌కాల డయాగ్నోస్టిక్ ప‌రీక్ష‌లు
– 108, 104 సేవలకు కొత్త సర్వీస్ ప్రొవైడర్
– పెరిగిన ఇంధన ధర‌, వేత‌నాలు, ఏజెన్సీ ద్వారా 190 కొత్త వాహనాల కొనుగోలు కార‌ణంగా టెండర్ ధరలో 11 శాతం పెరుగుదల

అమరావతి: ఇప్పటి వరకూ స‌మ‌స్యాత్మ‌కంగా కొనసాగుతున్న 104, 108 సేవలకు జవసత్వాలు క‌ల్పించి ప్ర‌జ‌ల‌కు మెరుగైన సేవ‌లు అందించ‌డానికి కూట‌మి ప్ర‌భుత్వం శ్రీకారం చుట్టింది. ఈ సేవ‌ల్ని అందిస్తున్న‌ ప్రస్తుత సర్వీస్ ప్రొవైడర్ స్థానంలో ప్రభుత్వం కొత్త ఏజెన్సీని గుర్తించింది.

ఈ ప్ర‌క్రియ‌లో భాగంగా దేశంలో ఎక్క‌డాలేని విధంగా ప్ర‌జ‌ల ఆరోగ్య స్థితి నిర్ఱార‌ణ‌కు 47 ర‌కాల డ‌యాగ్నోస్టిక్ ప‌రీక్ష‌ల్ని 104 వాహ‌నాల ద్వారా ఉళ్ల‌ల్లోనే ప‌రీక్ష‌లు చేప‌ట్టేందుకు ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంది. M/s. భవ్య హెల్త్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ సార‌థ్యంలో M/s. SRIT ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌ను భాగస్వామిగా ఉన్న క‌న్సార్షియంను ఇక‌నుంచి ఈ సేవ‌ల్ని అందించే ఏజెన్సీగా టెండ‌రు ప్ర‌క్రియ ద్వారా ప్ర‌భుత్వం గుర్తించింది.

రాష్ట్ర ప్ర‌జ‌ల వ్య‌క్తిగ‌త ఆరోగ్య స్థాయి వివ‌ర‌ణాత్మ‌క ప్రొఫైలింగ్ ద్వారా ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డుల్ని(EHR) రూపొందించ‌డానికి ఈ ప‌రీక్ష‌ల్ని చేయాల‌ని ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది.

దీని ద్వారా రాష్ట్రంలో ప్రస్తుత , భవిష్యత్తు వ్యాధుల భారాన్ని అంచనా వేయడం వీల‌వుతుంది. త‌ద్వారా అవ‌స‌రాల‌క‌నుగుణంగా ప్ర‌భుత్వం త‌గు చ‌ర్య‌ల్ని చేప‌ట్ట‌డానికి మార్గం ఏర్ప‌డుతుంది. ప్రస్తుతం 104 అంబులెన్స్‌ల ద్వారా కేవ‌లం మ‌ధుమేహం మరియు బీపీ వ్యాధుల్ని గుర్తించ‌డానికి మాత్ర‌మే ‘ర్యాపిడ్ కిట్’ పరీక్షలు చేస్తున్నారు. దీనికి భిన్నంగా నూత‌న విధానంలో నిర్ధిష్ట ఫ‌లితాల‌నిచ్చే 47 రకాల పరీక్షలు చేయ‌డం జ‌రుగుతుంది.

బ్లడ్ గ్లూకోజ్ టెస్ట్, కంప్లీట్ బ్లడ్ పిక్చర్, రీనల్ ఫంక్షన్ టెస్ట్‌లు, లివర్ ఫంక్షన్ టెస్ట్‌లు, కంప్లీట్ లిపిడ్ ప్రొఫైల్, యూరిన్ అనాలిసిస్, ఆర్టీరియల్ బ్లడ్ గ్యాస్ ల‌కు సంబంధించి 20 పరీక్షలు ల‌బ్ధి దారులకు చేయ‌డం జ‌రుగుతుంది.

నిర్ధిష్ట వ్యాధుల‌కు సంబంధించి మరో 27 పరీక్షల్ని చేస్తారు. కొత్తగా ఈ సేవల బాధ్యతలను స్వీకరించ‌నున్న సర్వీస్ ప్రొవైడర్ సాధారణ 20 పరీక్షల్ని ఒక్కొక్కరికి రూ.195 ఖర్చుతో చేయడానికి అంగీకరించింది. అంతే కాక ఇతర వ్యాధి పరీక్షలకు కూడా మార్కెట్ రేట్లతో పోలిస్తే సహేతుకమైన ఛార్జీలను ప్ర‌తిపాదించారు. ప్ర‌తి 104 వాహ‌నం ద్వారా రోజుకు దాదాపు 35 మందిని పరీక్షిస్తారు.

ఈ కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా విస్తరించే ముందు మొబైల్ మెడికల్ యూనిట్ల డేటా యొక్క విశ్వసనీయతను తనిఖీ చేసేందుకు ఈ నిర్ధారణ పరీక్షల్ని పైలట్ ప్రాతిపదికన ప్ర‌భుత్వం చేప‌డుతుంది. ఈ ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌డానికి కొత్త ఏజెన్సీ ఆయా ప‌రిక‌రాల్ని ప్ర‌తి 104 వాహ‌నంలో సెమీ-ఆటోమేటిక్ బయోకెమిస్ట్రీ ఎనలైజర్, సిబిసి మెషిన్ 3 పార్ట్ ఎనలైజర్, మైక్రోస్కోప్ మరియు ఇంక్యుబేటర్‌ వంటి పరికరాలను ఏర్పాటు చేస్తారు.

ప్ర‌తి వాహ‌నంలో ఒక ల్యాబ్ టెక్నీషియన్‌ను కూడా ఉంటారు. 108 మరియు 104 సేవలతో పాటు అత్యవసర ప్రతిస్పందన కేంద్రాన్ని (EMERGENCY RESPONSE CENTRE) నిర్వహించడానికి ప్రభుత్వం ప్రస్తుతం నెలకు రూ.28 కోట్లు చెల్లిస్తోంది. కొత్త టెండర్ కింద ఈ ఖర్చు నెలకు రూ.31 కోట్లకు చేరుతుంది. ఇది టెండర్ ధరలో కేవలం 11 శాతం లోపు మాత్ర‌మే పెరుగుద‌ల‌.

ఈ పెరుగుదలకు ప్ర‌ధాన‌ కార‌ణం ప్రధానంగా కొత్త ఏజెన్సీ 190 కొత్త 108 వాహ‌నాల్ని ఖ‌రీదు చేసి ఏర్పాటు చేయ‌డం. మొత్త‌మ్మీద 731 వాహ‌నాలు 108 సేవ‌ల్న అందిస్తాయి. సేవల ధర స్వల్పంగా పెరగడానికి పెరిగిన ఇంధన ధరలు, సిబ్బందికి వేతనాలు కూడా కొంత‌మేర‌కు కార‌ణం. 2020 సంవత్సరంలో ప్రస్తుతం అమలులో ఉన్న టెండర్ ఖరారు చేసిన‌ప్పుడు డీజిల్ ధర లీటరుకు రూ.70 మాత్రమే ఉండగా, ఇప్పుడది లీటరుకు 97 రూపాయ‌ల 47 పైస‌లకు పెరిగింది ఉంది.

108 అంబులెన్స్‌ల డ్రైవర్లకు, నెలకు రూ.2,000 అదనంగా చెల్లించాలని ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది. ద్రవ్యోల్బణంతో పాటు పెరిగిన పరికరాల ధ‌ర‌లు, వాహ‌నాల నిర్వ‌ణా ఖ‌ర్చులు కూడా ఇత‌ర కారణాలు.

108 సేవలకు సంబంధించి, సర్వీస్ ప్రొవైడర్ కు రెండు కొత్త షరతులు పెట్టారు. ఇందులో ఒకటి… కాల్ వచ్చినప్పటి నుండి రోగిని ఒక గంటలోపు ఆసుపత్రికి తీసుకెళ్లాలి. దీనిని ‘గోల్డెన్ అవర్’ అని అంటారు. రెండోది ఎటువంటి అత్యవసర కాల్స్ ను స్వీకరించకుండా వుండకూడదు. ఈ సేవ‌ల్ని అంస్తున్న ప్ర‌స్తుత సంస్థ రోజుకు దాదాపు 200 ఎమెర్జెన్సీ కాల్స్‌ను నిర్ల‌క్ష్యం చేసిన నేప‌థ్యంలో ఈ ష‌ర‌తుల్ని పొందుప‌ర్చారు.

LEAVE A RESPONSE