Suryaa.co.in

Andhra Pradesh

చంద్రబాబు నాయుడుకు ఏదైనా హాని జరిగితే నాతో సహా మా పార్టీ వారందరినీ ప్రజలు తగలెట్టేస్తారు

నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు

తెదేపా అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పొరపాటున ఏదైనా హాని జరిగితే నాతో సహా మా పార్టీ నాయకులందరినీ ప్రజలు తగలెట్టేస్తారని నరసాపురం ఎంపీ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు రఘురామ కృష్ణంరాజు ప్రభుత్వ పెద్దలను హెచ్చరించారు.
రచ్చబండ కార్యక్రమంలో భాగంగా ఆయన తన నివాసంలో మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ… చంద్రబాబు నాయుడుకు హాని కల్పించవద్దు. అంత రిస్క్ తీసుకోవడం మంచిది కాదు.. ఇంకా చెత్త సోది అంతా చెప్పవద్దు. జగన్మోహన్ రెడ్డి చంచల్గూడా జైల్లో సకల రాజభోగాలు అనుభవించారు. అవన్నీ బయటకు చెప్పేయమంటారా?… ఎన్ని ఐస్ క్రీములు తిన్నారో… ఇంకా ఏమేమి చేశారో తెలుసు… చంద్రబాబు నాయుడుకు జైల్లో తగిన సౌకర్యాలను కల్పించండి. ఎలాగో బుధవారం సుప్రీంకోర్టు తీర్పు అనంతరం ఆయన జైలు నుంచి విడుదల కావడం ఖాయమని అన్నారు.

నాకు జరిగిన అన్యాయమే… చంద్రబాబు నాయుడు కి జరగవద్దు
జైలు లో నాకు జరిగిన అన్యాయమే తెదేపా అధినేత నారా చంద్రబాబు నాయుడు కి జరగవద్దని… తక్షణమే చంద్రబాబు నాయుడుకు మెరుగైన వైద్యం అందించడానికి ప్రైవేట్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి తరలించేలా చర్యలు తీసుకోవాలని రఘురామకృష్ణం రాజు డిమాండ్ చేశారు. చంద్రబాబు నాయుడుకు వైద్యం అందించేందుకు జి జి హెచ్ లో రూమ్ రెడీ చేస్తున్నామని చెబుతున్నారు. అక్కడ కూడా ఇటువంటి దొంగ రిపోర్టులే ఇస్తారు.

చంద్రబాబు నాయుడుకు డి హైడ్రేషన్ లేదు. బాగానే ఉన్నారని చెబుతారని, అందుకే ఆయనకు మెరుగైన వైద్య అందించడానికి ప్రైవేట్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి తరలించాలి. గతంలో నా ఆరోగ్య పరిస్థితులపై ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు ఇచ్చినవి దొంగ రిపోర్టులని మిల్ట్రీ ఆసుపత్రి వైద్యులు నిర్ధారించిన విషయం తెలిసిందే. ప్రభుత్వ పెద్దలు ఏది చెబితే జి జి హెచ్ వైద్యులు అదే నివేదిక ఇస్తారు. జి జి హెచ్ వైద్య విభాగాల హెడ్ లు దొంగ నివేదికలపై సంతకాలు చేయడానికి నిరాకరించినప్పటికీ, అప్పటి సిఐడి చీఫ్ సునీల్ వారిపై ఒత్తిడి చేశారు.

సునీల్ కు ఆ రోజు గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లాల్సిన అవసరం ఏమి వచ్చింది. 12 గంటలకు వైద్య నివేదికలు అందజేయాలని న్యాయమూర్తి ఆదేశించగా, కోర్టుకు ఏడు గంటలకు వైద్య నివేదిక సమర్పించారు. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి సూపర్డెంట్ ప్రభావతి, సునీల్ కుమార్ పై సుమోటోగా న్యాయస్థానం కోర్టు ధిక్కరణ పిటిషన్ మూవ్ చేసింది.

న్యాయస్థానమే సుమోటోగా పిటీషన్ మూవ్ చేసినప్పుడు ఆ కేసు ను విచారించి వారికి శిక్ష పడే విధంగా న్యాయస్థానం బాధ్యతలను తీసుకోవలసిన అవసరం లేదా? అంటూ రఘురామకృష్ణంరాజు ప్రశ్నించారు. దేశంలో చట్టాలు చేసే, ఒక చట్టసభ ప్రతినిధి పరిస్థితి ఇలాగ ఉంటే… సామాన్య ప్రజల పరిస్థితి ఏమిటని నిలదీశారు.. చంద్రబాబు నాయుడుకు నాకు జరిగిన అన్యాయమే జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు నాయుడు పై అభిమానంతోనే ఇదంతా చెబుతున్నానని తెలిపారు.

పెద్దాయన బరువు 72 కేజీలు…
ఎన్టీఆర్ స్మారక నాణెం విడుదల కార్యక్రమంలో తెదేపా అధినేత నారా చంద్రబాబు నాయుడుతో కలిసి నేను కూడా పాల్గొన్నాను. అప్పుడే పెద్దాయన ను మీ బరువు ఎంత సార్ అని అడిగాను. దానికి ఆయన 72 కేజీలని సమాధానం చెప్పారు. మీ హైట్ కు మీరు మరో 10 కేజీల బరువు పెరగవచ్చు కదా అని సూచించగా… బరువు తగ్గకుండా, పెరగకుండా ఇదే బరువును కొనసాగిస్తానని చంద్రబాబు నాయుడు వెల్లడించారు. జైల్లో ఉన్న చంద్రబాబు నాయుడు 66 కేజీల నుంచి కేజీ పెరిగి 67 కు చేరుకున్నారని జైలు అధికారులు చెప్పడం హాస్యాస్పదంగా ఉంది.

చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వరి చెప్పినట్లుగా 34 రోజుల వ్యవధిలో జ్యూడిషియల్ రిమాండ్ లో ఆయన ఐదు కేజీల బరువు తగ్గారన్నది వాస్తవం. ఇది ఎంతో ప్రమాదకరం. వేగంగా ఇంత బరువు తగ్గడం అనేది కిడ్నీలపై తీవ్ర ప్రభావాన్ని చూపించే అవకాశం ఉంది. చంద్రబాబు నాయుడు డయా బెటిక్ పేషంట్ అని ఆయనకు వారానికి ఒకసారి పరీక్షలు నిర్వహిస్తున్నట్లుగా జైలు అధికారులు పేర్కొనడం పరిశీలిస్తే పెద్దాయన ఆరోగ్యం పట్ల వారు ఎంత శ్రద్ధ తీసుకుంటున్నారో ఇట్టే అర్థమవుతుంది.

చంద్రబాబు నాయుడు శరీరంపై దద్దులు ఉంటే క్రీమ్ అందజేశామని చెబుతున్నారు. అంతకంటే ఆయన వ్యక్తిగత వైద్యున్ని పిలిచి మాట్లాడించి ఉంటే బాగుండేది కదా?!. జగన్మోహన్ రెడ్డికి చంచల్గూడా జైల్లో లేని సౌకర్యం అంటూ లేదు. ప్రతిరోజు 30 మందితో మూలాఖత్ సౌకర్యాన్ని కల్పించారు. కానీ చంద్రబాబు నాయుడుకి వారానికి రెండు సార్లు మాత్రమే, అది కూడా ముగ్గురిని మాత్రమే మూలాఖత్ పేరిట జైలు అధికారులు అనుమతిస్తున్నారు.

జగన్మోహన్ రెడ్డి జైలుకే ఐస్ క్రీములు తెప్పించుకొని తినేవారు. వంట చేయడానికి ఒక ప్రత్యేక మనిషిని ఏర్పాటు చేశారు. అదే చంద్రబాబు నాయుడు విషయానికి వస్తే ఈ దుష్ట పరిపాలకులు కనీస సౌకర్యాలు కల్పించడం లేదని రఘురామ కృష్ణంరాజు మండిపడ్డారు.

సజ్జల, సాయి రెడ్డి నోటికొచ్చినట్లు ఏక వచనంతో మాట్లాడుతూ తమ స్థాయి ఏమిటో గుర్తు చేశారు
తెదేపా అధినేత నారా చంద్రబాబు నాయుడుని ఉద్దేశించి ఏక వచనంతో మాట్లాడుతూ సకల శాఖామంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి, రాజ్యసభ సభ్యుడు విజయ్ సాయి రెడ్డిలు తమది ఎంతటి అధమ స్థాయో గుర్తు చేశారని రఘురామ కృష్ణంరాజు ఫైర్ అయ్యారు. జైలులో వేడి నీరు ఇస్తారా? అంటూ సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయి. పార్లమెంట్ కమిటీ సభ్యుడిగా నేను హర్యానాలోని జైళ్లను సందర్శించాను. అక్కడ ఖైదీలకు మెరుగైన వసతులను కల్పించడం జరుగుతోంది.

జైలు ఆవరణలో సోలార్ సిస్టం ఏర్పాటు చేసి ఖైదీలు స్నానం చేయడానికి వేడి నీరును అందజేస్తున్నారు. ఖైదీలకు యునైటెడ్ నేషన్స్ నెల్సన్ మండేలా రూల్స్ ను అమలు చేస్తున్నాయి. కన్విక్టెడ్ ఖైదీ కి, జ్యుడీషియల్ రిమాండ్ లో ఉన్నవారికి తేడా అన్నది లేకుండా జైళ్ల శాఖ అధికారి మాట్లాడడం ఆశ్చర్యంగా ఉంది. రాజమండ్రి జైల్లో 2021 మంది ఖైదీలు ఉన్నారని, వారిలో నారా చంద్రబాబు నాయుడు ఒకరు అని పేర్కొనడం సిగ్గుచేటు. జైల్ మాన్యువల్ ప్రకారం నెల్సన్ మండేలా రూల్స్ ను దేశంలోని అన్ని రాష్ట్రాల జైలులలో అమలు చేస్తున్నట్టు పార్లమెంటులో ఆనాటి హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి ప్రకటించారు.

హర్యానాలోని జైల్లో తో పాటు, తీహార్ జైల్లోనూ ఈ నిబంధనలను అమలు చేస్తున్నారు. మరి రాష్ట్రంలో ఎందుకు అమలు చేయాలని ప్రశ్నించారు. జ్యుడీషియల్ రిమాండ్ లో ఉన్న చంద్రబాబు నాయుడుకు మంచం సౌకర్యాన్ని కూడా కల్పించవద్దు, తీసివేయాలని ప్రభుత్వ పెద్దలు ఆదేశించినట్లుగా తెలిసింది. తీసివేస్తే కుదురుతుందా?, మిగతా ఖైదీలకు మంచం ఇవ్వడం లేదు కదా… ఆయనకు మంచం ఎందుకు ఇవ్వాలని వారు ప్రశ్నించినట్టు సమాచారం . జగన్మోహన్ రెడ్డికి చంచల్గూడా జైల్లో కూలర్ తో పాటు ఏసీ సౌకర్యాన్ని కూడా కల్పించారు.

రాజమండ్రి జైల్లో కూలర్ సౌకర్యాన్ని, ఏసీ సౌకర్యాన్ని కల్పించడానికి ప్రొవిజన్ లేదని జైళ్ల శాఖ ఐజి రవి కిరణ్ పేర్కొనడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. రవికిరణ్ ఒక్కసారి జైలు మ్యానువల్ ను చదువుకోవాలి. జైల్లో ఉన్న ఖైదీ డబ్బులు చెల్లిస్తానంటే బట్టలతోపాటు, బెడ్ షీట్ కూడా అందజేయాల్సి ఉంటుంది. అలాగే ఖైదీ అనారోగ్య పరిస్థితిని బట్టి వైద్య సౌకర్యాలను కల్పించాలి. అసిస్టెంట్ ప్రొఫెసర్లు పిలిపించామని చెప్పి డ్రామాలు ఆడడం మానేయాలి.

ఎండాకాలంలో వడదెబ్బ తగిలి చనిపోవడానికి డి హైడ్రేషన్ కారణం. చంద్రబాబు నాయుడు డి హైడ్రేషన్బాధపడుతుంటే ఆయన్ని తక్షణమే సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో చేర్పించకుండా ఎందుకు ఆలస్యం చేస్తున్నారని రఘురామకృష్ణంరాజు ప్రశ్నించారు. చంద్రబాబు నాయుడు ని ఏమి చేద్దామని చూస్తున్నారని నిలదీశారు. చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యులనే కాకుండా రాష్ట్ర ప్రజలందరినీ క్షోభ పెట్టాలని అనుకుంటున్నారు. అందుకే ఆయనకు మెరుగైన వైద్య చికిత్స అందించడానికి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి తరలించడం లేదని రఘురామ కృష్ణంరాజు మండిపడ్డారు.

వైకాపా వారి కంటే రాజమౌళి సినిమాలోని కాలకేయులే నయమని అనుకుంటున్న ప్రజలు
వైకాపా నేతల కంటే రాజమౌళి రూపొందించిన బాహుబలి చిత్రంలోని కాలకేయులే నయమని రాష్ట్ర ప్రజలు అనుకుంటున్నారని రఘురామ కృష్ణంరాజు తెలిపారు. వైకాపా నేతల కంటే పశువులే నయమని పరిస్థితి రాష్ట్రంలో నెలకొంది. నా కర్మ కొద్దీ నేను కూడా ప్రస్తుతం వైకాపాలోనే ఉన్నాను. నారా చంద్రబాబు నాయుడుని ఉద్దేశిస్తూ…మీ భార్య భోజనం పంపిస్తుంది కదా, అందులో ఏమైనా కలిపిందేమో అంటూ సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలు పరిశీలిస్తే ప్రజలు ఎందుకు వైకాపా నేతల కంటే పశువులే నయమని అంటున్నారో అర్థమవుతుంది.

చంద్రబాబు నాయుడుకు అందజేసే భోజనంలో వైకాపా నేతలే జైలు సిబ్బందితో మిలాకతై ఏమైనా కలుపుతున్నారేమోనని రఘురామ కృష్ణంరాజు అనుమానం వ్యక్తం చేశారు. కచ్చితంగా ఇందులో కుట్ర కోణం దాగి ఉంది. లేకపోతే సజ్జల, సాయి రెడ్డిలు కుట్ర కోణం గురించి మాట్లాడి ఉండేవారు కాదు. ఇలా వారి చేత ఎవరు వాగిస్తున్నారో ప్రజలందరికీ తెలుసు. వైకాపా నేతల వద్ద ఫుడ్ పాయిజనింగ్ టెక్నిక్స్ ఉన్నాయి. ఈ విషయాన్ని నేను ఎప్పటినుంచో చెబుతూనే ఉన్నాను. గతంలో ఒక మంత్రి చనిపోయారు. ఆ మంత్రికి కూడా ఫుడ్ పాయిజనింగ్ అయిందేమోనన్నా అనుమానాలు ఉన్నాయి.

అందుకే నేను బయట పదార్థాలు ఏమీ తీసుకోను. జైలులో భద్రత సమస్య ఏమిటని సాయి రెడ్డి ప్రశ్నించడం సిగ్గుచేటు. జైలులోనే కదా పరిటాల రవీంద్ర హత్య కేసు నిందితులైన మొద్దు శ్రీను, ఓం ప్రకాశ్ లని హత్య చేసింది. ఈ హత్యలు చేయించింది జగన్మోహన్ రెడ్డే నని రాష్ట్ర ప్రజలు అనుకుంటున్నారు. అటువంటి మీరు జైలులో భద్రతకు భయమేమిటనీ ప్రశ్నించడం ఆశ్చర్యంగా ఉందని రఘురామ కృష్ణంరాజు ఎద్దేవా చేశారు.

జైలులో చంద్రబాబు నాయుడుకు వేడి నీళ్లు అందజేయకుండా రాజకీయ కక్షపూరితంగా వ్యవహరించడం దారుణం. జగన్మోహన్ రెడ్డి తో సహా ఆయన వందిమాగాదులంతా అవాకులు చవాకులు పేలుతున్నారని, ఈ విషయాన్ని రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారని రఘురామ కృష్ణంరాజు పేర్కొన్నారు. మీరు మనుషులు కాదా… మీకు మానవత్వం అన్నది లేదా అంటూ ప్రజలు నిలదీస్తున్నారన్నారు .

హైదరాబాదులో మెట్రో రైల్ వ్యవస్థ స్తంభించే పరిస్థితి
చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టును నిరసిస్తూ ఆయన్ని అభిమానించేవారు పార్టీలకు ప్రాంతాలకతీతంగా నిరసన తెలియజేయడంతో హైదరాబాదులో మెట్రో రైల్ సేవలు స్తంభించే పరిస్థితి నెలకొన్నట్లు తెలిసిందని రఘురామకృష్ణంరాజు వెల్లడించారు. చంద్రబాబు నాయుడు అభిమానుల తాకిడికి నుంచి నాలుగు రైల్వే స్టేషన్లను కూడా మూసివేయడం జరిగింది. చంద్రబాబు నాయుడు అరెస్టుపై ప్రజల్లో పెను ఆగ్రహం కనిపిస్తోంది.

తెలంగాణలో ఎన్నికల కోడ్ నేపథ్యంలో ప్రజాస్వామ్యతంగా ప్రజలు నిరసన తెలియజేయగలుగు తున్నారు. రాష్ట్రంలో కొనసాగుతున్న ముష్కరుల పాలనలో ప్రజాస్వామ్యతంగా నిరసన తెలిపే అవకాశం కూడా లేకుండా పోయింది. చంద్రబాబు నాయుడు ఆరోగ్య పరిస్థితిపై జైలు శాఖ అధికారులు వెల్లడించిన వైద్య నివేదికలు పచ్చి బూటకం. ఇది జగన్ ఆడించే జగన్నాటకం. ఈ దరిద్రపు పాలకుల చేతిలో దెబ్బలు తిన్నవాడిగా, దెబ్బతిన్నవాడిగా చెబుతున్నానని రఘురామకృష్ణం రాజు తెలిపారు.

సిఐడి పోలీసులు నన్ను అక్రమంగా అరెస్టు చేసి లాకప్ లో చిత్రహింసలకు గురిచేసిన మరుసటి రోజు ఒక వైద్యుడు నన్ను పరీక్షించారు. బిపి 165/110 ఉంటే, 120/80 ఉన్నట్టుగానే నివేదిక ఇచ్చారు. నాకు మాత్రం బిపి అధికంగా ఉందని చెప్పారు. అదే విషయాన్ని నివేదికలో వెల్లడించవచ్చు కదా అని ప్రశ్నిస్తే… ఆరోగ్యం బాగానేఉందని, బీపీ సాధారణంగానే ఉన్నట్లు రాయమని హెచ్చరించారని తెలిపారు. నా అరికాళ్ళపై లాఠీలతో కొట్టడం వల్ల నల్లటి మరకలు ఏర్పడ్డాయి. దాని వల్ల బ్లడ్ క్లాక్ అయి గుండెపై ప్రభావం చూపించి, హార్ట్ ఎటాక్ వచ్చే అవకాశం ఉందని సదరు వైద్యుడే హెచ్చరించారు .

బ్లడ్ తిన్నర్స్ వాడాలని సూచించిన ఆ వైద్యుడు, వైద్య నివేదికలో మాత్రం నా ఆరోగ్యం అద్భుతంగా ఉన్నట్లు పేర్కొన్నారు. నన్ను పరిశీలించిన న్యాయమూర్తి గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి తో పాటు రమేష్ హాస్పిటల్ కు తరలించి వైద్య పరీక్షలు నిర్వహించాలని ఆదేశించారు.. ప్రభుత్వ డాక్టర్లు, పోలీసులు ఒక దొంగల ముఠా. రాష్ట్ర ప్రజలు ఒక దొంగల నాయకున్ని ఎన్నుకున్న తర్వాత తమ మునగడ కోసం ప్రభుత్వ వైద్యులు, పోలీసులు దొంగల ముఠా సభ్యులుగా మారారని రఘురామకృష్ణం రాజు విరుచుక పడ్డారు.

దొంగ కోడి కత్తి డ్రామాకు సహకరించిన ఇద్దరు వైద్యులు గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి సూపరిండెంట్ ప్రభావతి పై దొంగ నివేదిక ఇచ్చేలా ఒత్తిడి తీసుకువచ్చారు. చంద్రబాబు నాయుడు కి వచ్చిన కష్టం చూసిన తర్వాత వీళ్ళు ఎంత దుర్మార్గులు చెప్పడానికే నేను ఈ కంపేరిజన్ చేస్తున్నాను. నా కాలు వేలు విరిగిపోయి ఉంటే కూడా బ్రహ్మాండంగా ఉన్నానని దొంగ రిపోర్టులు ఇచ్చారు. గుంటూరు ఆసుపత్రి నుంచి రమేష్ ఆసుపత్రికి తరలిస్తున్నామని చెప్పి దిలీప్ కుమార్ అని ఎయిడ్స్ పేషెంట్ అయిన ఒక పోలీసు అధికారి నన్ను జైలుకు తరలించారు.

జైలులో ఉన్నప్పుడు నా కాలు వేలు విరిగిపోయినట్టుగా గుర్తించిన వైద్యుడు ఆయింట్మెంట్ అందజేశారు. జైల్లో ఆ రోజు మూడుసార్లు కరెంటు తొలగించారు. సెంట్రీ గా ఉన్న వ్యక్తి మానవత్వంతో వ్యవహరించారు. కరెంటు తీసివేసిన సమయంలో టార్చ్ లైట్ వెలిగించి నాలో ధైర్యాన్ని నింపే ప్రయత్నం చేశారు. నాకు ఆయింట్మెంట్ ఇచ్చిన డాక్టరే, మరుసటి రోజు నేను పర్ఫెక్ట్ గా ఉన్నానని అంగీకరించినట్లుగా తప్పుడు నివేదికను సిద్ధం చేసి నాతో సంతకం చేయించే ప్రయత్నం చేశారు.

పోలీసులు తమ తప్పును కప్పిపుచ్చుకోవడానికి, జైలులోని వైద్యుని చేత తప్పుడు నివేదికను సిద్ధం చేయించారు. అయితే జైలర్ మాత్రం క్రైస్తవ మతాన్ని దైవభక్తితో ఆచరించే వ్యక్తి. అందుకే ఆయన నాపై ఎటువంటి ఒత్తిడి కూడా చేయలేదు. ఇష్టం లేకపోతే వైద్యుడు ఇచ్చిన నివేదికపై సంతకం చేయాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు.

ఎమ్మెల్యేల నుంచి లక్షల రూపాయలు దోపిడీ చేస్తున్న సాక్షి యాజమాన్యం
ఎమ్మెల్యేల నుంచి నెలకు లక్షల రూపాయల చొప్పున సాక్షి యాజమాన్యం వసూలు చేస్తూ దోపిడీకి పాల్పడుతుందని రఘురామ కృష్ణంరాజు తెలిపారు. ఎస్సీ ఎస్టీ ఎమ్మెల్యేల నుంచి నెలకు 8 లక్షల రూపాయలు, ఇతర ఎమ్మెల్యేల నుంచి 12 లక్షల రూపాయలు, పట్టణ ప్రాంత ఎమ్మెల్యేల నుంచి 15 లక్షల రూపాయల చొప్పున ప్రతి నెల సాక్షి దినపత్రిక కొనుగోలు పేరిట వసూలు చేస్తున్నారు. ఎమ్మెల్యేల నుంచి ఈ డబ్బుల వసూళ్ల కోసం ఒక ఎమ్మెల్యేను నియమించారు. ఎమ్మెల్యేల వద్ద నుంచి సంవత్సరానికి ₹225 కోట్ల రూపాయలు సాక్షి యాజమాన్యం వసూలు చేస్తుంది.

ఎమ్మెల్యేలు కక్కలేక మింగలేక సాక్షి యాజమాన్యానికి ఈ డబ్బులను చెల్లిస్తున్నారు. సాక్షి దోపిడి మాదిరిగానే రేపు రాంగోపాల్ వర్మ రూపొందిస్తున్న వ్యూహం సినిమాకు కూడా టికెట్ల కొనుగోలు బాధ్యతను కూడా ఎమ్మెల్యేలకే అప్పగిస్తారేమో. వ్యూహం సినిమా మ్యాట్నీ షో హౌస్ ఫుల్ అని బోర్డు పెడతారు. కానీ నేను చూసే థియేటర్లో బయట బోర్డు ఉన్నట్లుగానే లోపల మనుషులు కూడా థియేటర్లో నిండుగా ఉండాలి.

మనుషులతో థియేటర్ నిండి పోతే నేను ముందుగా చెప్పినట్టుగా మీసాలు తీసుకుంటానని రఘురామ కృష్ణంరాజు తన సవాలను పునరుద్ఘాటించారు. రాంగోపాల్ వర్మ రూపొందిస్తున్న చిత్రం కాబట్టి బాగానే ఉన్న… రాష్ట్రంలోని విలన్ ను హీరోగా చూపెట్టే ప్రయత్నం చేస్తుండడం వల్ల ప్రజలు అసహ్యించుకునే పరిస్థితి నెలకొంది. వ్యూహం సినిమా చూశాక కచ్చితంగా మిమ్మల్ని మేము ఓడిస్తామని శపథం చేస్తామని రఘురామ కృష్ణంరాజు తెలిపారు .

LEAVE A RESPONSE