Suryaa.co.in

Andhra Pradesh

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చెప్పారంటే… చేయరంతే

-గ్యారెంటీ లేని ఒక స్కీంను గ్యారెంటీ పెన్షన్ స్కీమ్ గా తీసుకొచ్చిన ఘనత ఆయనదే
-జిపిఎస్ కంటే సిపిఎస్ యే బెటర్… కాంట్రాక్టు ఉద్యోగుల పర్మినెంట్ లోను వివక్షతే
-కార్పొరేషన్ పేరిట చేసే అప్పుకు రాష్ట్ర ప్రభుత్వం గ్యారెంటీ ఇస్తే, అది రాష్ట్ర ప్రభుత్వం చేసిన అప్పే
-రాయలసీమ సమస్యలపై సంపూర్ణ అవగాహనతో నారా లోకేష్ మాట్లాడిన తీరు అభినందనీయం
-నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు

మాట తప్పను మడమ తిప్పని విశ్వసనీయత తనదని చెప్పుకునే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చెప్పారంటే, చేయడంతేనని నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు అన్నారు . సీ పీ ఎస్ రద్దు తో పాటు, ఐఆర్ వెంటనే అమలు చేస్తామని ఉద్యోగులకు హామీ ఇచ్చారు . కాంట్రాక్టు ఉద్యోగులను పర్మినెంట్ చేస్తానని జగన్మోహన్ రెడ్డి చెప్పిన మాటలు విని ఉద్యోగులు, నిరుద్యోగులు బట్టలు చింపుకొని మరి ఓట్లు వేశారు. మద్య నిషేధం అమలు చేస్తామన్న హామీతో మహిళలు, అమ్మ ఒడి పథకంలో భాగంగా ఇద్దరు పిల్లలకు డబ్బులు ఇస్తామని చెప్పగా, ముగ్గురు పిల్లలు ఉన్నవారు తమకు 45 వేల రూపాయలు వస్తాయని కలలు కన్నారు. ఇచ్చిన హామీలు ఏవీ కూడా అమలు చేయకుండానే, 98.7% హామీలను అమలు చేసినట్లుగా జగన్మోహన్ రెడ్డి పేర్కొనడం పరిశీలిస్తే తెలిసి తెలియనితనముతో మాట్లాడుతున్నారా?, లేకపోతే ప్రజలను మభ్య పెట్టే ప్రయత్నం చేస్తున్నారా?? అన్నది ఆయనకే తెలియాలన్నారు.

గురువారం నాడు రచ్చబండ కార్యక్రమంలో భాగంగా రఘురామకృష్ణంరాజు తన నివాసంలో మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ… గ్యారెంటీ లేని ఒక పెన్షన్ స్కీమును జగన్మోహన్ రెడ్డి తీసుకువచ్చి గ్యారెంటీ పెన్షన్ స్కీమ్ అని పేర్కొనడం హాస్యాస్పదం. ఉద్యోగుల జీతాలలో నుంచి 10% నిధులను కట్ చేస్తున్న ప్రభుత్వం, తనవంతుగా జమ చేయాల్సిన 10% నిధులను గత మూడు నెలలుగా జమ చేయడం లేదన్నారు. ఈ నిధిని కూడా ఇతర అవసరాలకు తరలించినట్లుగా అనుమానాలు ఉన్నాయి. జిపిఎస్ పథకం ద్వారా ఉద్యోగికి రిటైర్డ్ అయిన తర్వాత 50 శాతం మొత్తాన్ని అందజేస్తామని జగన్మోహన్ రెడ్డి చెబుతున్నప్పటికీ, దానికి గ్యారెంటీ లేదన్నారు. ఉద్యోగులు రిటైర్డ్ అయినప్పుడు 37% ఇస్తామని చెబుతున్న ప్రభుత్వం, ఆ మొత్తానికి ఉద్యోగులు పన్ను చెల్లించాల్సిందేనన్నారు . సిపిఎస్ పథకం ద్వారా ఉద్యోగులు జమ చేసుకున్న నిధులు సురక్షితంగా ఉండడంతో పాటు, ఎంతో కొంత చేతికి వస్తుందన్న గ్యారెంటీ ఉంటుంది. ఉద్యోగులకు జీతాలు ఆలస్యం చేస్తున్నారు. పెన్షన్లు చెల్లించడానికి 30 రోజుల సమయం పడుతుంది.

ప్రస్తుతం జీతాలు ఇస్తున్నట్టుగానే , రిటర్డ్ అయిన తర్వాత పెన్షన్ డబ్బులు ఇవ్వకపోతే ఉద్యోగులు ఉపాధ్యాయుల పరిస్థితి ఏమిటని రఘురామ కృష్ణంరాజు ప్రశ్నించారు. ఉద్యోగ ఉపాధ్యాయులంతా ధనవంతులేమీ కాదు. అందరూ వెంకట్రామిరెడ్డిలు ఏమీ కాదని ఎద్దేవా చేశారు. సీ పీ ఎస్ కాదని, ఓ పీ ఎస్ కు రాజస్తాన్, హిమాచల్ ప్రదేశ్, చత్తీస్ ఘడ్ వంటి కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ప్రభుత్వాలు వెళ్లాయి. అధికారంలోకి వచ్చిన వెంటనే సిపిఎస్ ను రద్దు చేస్తామని జగన్మోహన్ రెడ్డి ఉద్యోగులకు హామీ ఇచ్చారు. సిపిఎస్ ను రద్దు చేయమని అడిగితే, ముఖ్యమంత్రి కాకముందు ఏదో తెలిసి తెలియక మాట్లాడితే, దాని పట్టుకొని ఇప్పుడు సిపిఎస్ రద్దు చేయమనడం సమంజసం కాదని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చిరాకు పడిన విషయం తెలిసిందే. నా బీసీలు, ఎస్సీలు, ఎస్టీ, మైనార్టీలు అంటూ, వాళ్లనే మా పార్టీ నాయకులు చంపుకుంటూ వెళ్తున్నారు. తన గొప్పలను తానే చెప్పుకుంటూ, ప్రతిపక్షాలకు తప్పు పట్టడం జగన్మోహన్ రెడ్డికి అలవాటని రఘు రామ కృష్ణంరాజు విమర్శించారు .

రాజకీయ నేతల్లో 90 శాతం మంది అవినీతిపరులైతే… ప్రభుత్వ ఉద్యోగుల్లో 10 శాతం మందే
రాజకీయ నాయకుల్లో 90 శాతం మంది అవినీతిపరులైతే, ప్రభుత్వ ఉద్యోగుల్లో కేవలం 10 శాతం మంది మాత్రమే అవినీతికి పాల్పడే అవకాశం ఉంటుందని రఘు రామకృష్ణంరాజు అన్నారు. రాష్ట్రంలో దాదాపు రెండు లక్షల మంది ఉపాధ్యాయులు ఉంటారు. వారికి వచ్చే జీతం డబ్బులు తప్ప, గీతం లభించే అవకాశం లేదు. రిటైర్డ్ అయిన తర్వాత పెన్షన్ పైనే ఆధారపడి వారు జీవిస్తారు. కోటీశ్వరులైన వారే ఈ రోజుల్లో తల్లిని, చెల్లిని చూసుకోవడం లేదు. సకాలంలో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇవ్వని జగన్మోహన్ రెడ్డి సర్కార్, ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగులకే కాదు… విశ్రాంత ఐఏఎస్ ఉద్యోగులకు పెన్షన్లు సకాలం లో చెల్లించడం లేదు.

రిటైర్డ్ అయిన తర్వాత సకాలంలో పెన్షన్లు అందకపోవడం వల్ల టెన్షన్ తో 20 ఏళ్లు బతకాల్సిన వారు, పదేళ్లకు చనిపోయే పరిస్థితి రాష్ట్రంలో నెలకొంది. కాంప్రహెన్సీవ్ పెన్షన్స్ ( సీ పీ ఎస్ )లో ఉద్యోగి వద్ద నుంచి పది శాతం నిధులను సేకరించి రాష్ట్ర ప్రభుత్వం మరో 10 శాతం నిధులను జమ చేసి, ఆ నిధిని సురక్షితమైన చోట, సాధ్యమైనంత ఎక్కువ రిటర్న్స్ వచ్చే పథకాలలో ప్రభుత్వం ఇన్వెస్ట్ చేస్తుంది . ఆ ఆదాయాన్ని ఉద్యోగి రిటైర్డ్ అయినప్పుడు సగం మొత్తాన్ని, ప్రతినెల పెన్షన్ రూపంలో మిగిలిన మరికొంత మొత్తాన్ని అందజేస్తుంది. సిపిఎస్ కాదు, ఓ పి ఎస్ అమలు చేయాలని ప్రభుత్వ ఉద్యోగుల తరఫున పార్లమెంట్ సభ్యుడిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నానని రఘురామ కృష్ణంరాజు తెలిపారు. దానికి జగనన్న రక్షణ నిధి అని పేరు పెట్టుకోవాలని సూచించారు.

గత ప్రభుత్వాల హయాంలో సీ పీ ఎస్ పథకాన్ని అమలు చేయాలని నిర్ణయించినప్పటికీ, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో ఓ పీ ఎస్ అమలు కోసం టక్కర్ కమిషన్ ను ఏర్పాటు చేశారు. టక్కర్ కమిషన్ నివేదిక ఇచ్చే సమయానికి ఎన్నికల నోటిఫికేషన్ వెలువడడం వల్ల గత ప్రభుత్వం తిరిగి ఓపిఎస్ విధానాన్ని అమలు చేయలేకపోయింది. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తానని చెబుతున్న గ్యారంటీ పెన్షన్ స్కీమ్ కంటే సిపిఎస్ స్కిమే బెటర్. డబ్బులకు ఆశపడే నాయకుల మాటలు వినకండి. మా ప్రభుత్వం పై తిరగబడి పోరాటం చేసే వారే నిజమైన ఉద్యోగ సంఘాల నాయకులు. ప్రభుత్వంతో పోరాడుతున్న ఉద్యోగ సంఘాల నాయకులను అభినందిద్దాం. కాంట్రాక్టు ఉద్యోగులను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పర్మినెంట్ చేస్తామని చెప్పిన మాట నిలబెట్టుకోలేకపోయారు. 20 14 జూన్ 2 న రాష్ట్ర విభజన అనంతరం కాంట్రాక్టు ఉద్యోగులందరినీ తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ పర్మినెంట్ చేశారు. కానీ ఆంధ్రప్రదేశ్లో 2009 జూన్ 2కు ముందు ఉద్యోగాలలో చేరిన కాంట్రాక్టు ఉద్యోగులను మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం పర్మినెంట్ చేసి వివక్షను ప్రదర్శించింది. దీనివల్ల కేవలం 10000 మంది ఉద్యోగులకు మాత్రమే లబ్ధి చేకూరింది. సమాన పని, సమాన వేతనం అని పేర్కొన్న ముఖ్యమంత్రి హామీ అమలుకు నోచుకోలేదన్నారు.

సివిల్ సప్లై కార్పోరేషన్ అప్పులు ఇప్పటికే 37 వేల కోట్ల రూపాయల … ఇప్పుడు మరో ఐదు వేల కోట్లకు గ్రీన్ సిగ్నల్
రాష్ట్ర సివిల్ సప్లై కార్పొరేషన్ ఇప్పటికే 37వేల కోట్ల రూపాయల అప్పులు చేయగా, మరో ఐదు వేల కోట్ల రూపాయల అప్పులకు ప్రభుత్వం గ్యారెంటీ ఇస్తుందని క్యాబినెట్ సమావేశంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చెప్పడం విస్మయాన్ని కలిగించింది. రాష్ట్ర ప్రభుత్వం గ్యారెంటీ గా ఉంటూ, కార్పొరేషన్ పేరిట చేసిన అప్పు కూడా ప్రభుత్వం చేసిన అప్పుగానే పరిగణించబడుతుందని నిబంధనలు చెబుతున్నాయి . ఈ విషయాన్ని ఇప్పటికే పలుసార్లు నేను పేర్కొనడం జరిగింది. గత ప్రభుత్వ హయాములో సివిల్ సప్లై కార్పోరేషన్ కేవలం 18 వేల కోట్ల రూపాయల అప్పులను మాత్రమే చేసింది. ధాన్యం విక్రయించిన రైతులకు అప్పుడు సకాలంలో డబ్బులు చెల్లించేవారు.

కానీ ఇప్పుడు నాలుగైదు నెలలైనా ధాన్యం విక్రయించిన రైతులకు డబ్బులు చెల్లించడం లేదు. అయినా, రాష్ట్ర సివిల్ సప్లై కార్పొరేషన్ కు ఐదువేల కోట్ల రూపాయలు అప్పిచ్చే బ్యాంకులు, 37 వేల కోట్ల రూపాయలు ఏమి చేశారని ప్రశ్నించాలి. అమ్మ ఒడి పథకాన్ని గతంలో జనవరిలోనే అమలు చేసేవారు. కానీ చివరి సంవత్సరం అమ్మ ఒడి పథకాన్ని తప్పించుకునేందుకు జూన్ లో ఇస్తామని చెప్పారు. ఒక సంవత్సరం సక్సెస్ ఫుల్ గా అమ్మ ఒడి పథకాన్ని ఎగ్గొట్టారు. ఇప్పుడు పాఠశాలలు తెరిచే సమయం కావడంతో అమ్మబడి పథకం కింద విద్యార్థుల తల్లులకు డబ్బులు చెల్లించాలి. అమ్మ ఒడి పథకంలో రెండు వేలు కటింగ్ ఉంటుందేమో. లబ్దిదారులకు 13000 రూపాయలే ఇస్తారేమోనని అన్నారు.

అమ్మ ఒడి పథకం కింద లబ్ధిదారులకు చెల్లించడానికి ప్రభుత్వం వద్ద డబ్బులు లేవు. సివిల్ సప్లై కార్పొరేషన్ కు ఇప్పుడు అప్పులు చేయాల్సిన అవసరం లేదు. అయినా అప్పులు చేస్తున్నారంటే, ఆ అప్పు డబ్బులను ప్రభుత్వ పెద్దలు దారి మళ్లించే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. రాష్ట్ర సివిల్ సప్లై కార్పోరేషన్ కు అప్పు పుట్టకుండా నా వంతు ప్రయత్నం నేను చేస్తాను. ఇప్పటికే తీసుకున్న 37 వేల కోట్ల రూపాయలను సివిల్ సప్లై కార్పొరేషన్ ఏమి చేసిందో వివరాలు అడగాలని బ్యాంకు యాజమాన్యానికి సూచిస్తాను. ఈ మేరకు అప్పు ఇచ్చే బ్యాంకుకు లేఖ రాస్తానని రఘురామకృష్ణం రాజు తెలిపారు. అయినా సూట్ కేసులతో యుద్ధం చేస్తూ, రాష్ట్ర ప్రభుత్వం అప్పులను ఎత్తుతూనే ఉందన్నారు.

నీటిని సద్వినియోగం చేసుకొని వాణిజ్య పంటలు వేస్తే రాయలసీమ రతనాలమయం
నీటిని సద్వినియోగం చేసుకొని వాణిజ్య పంటలు వేస్తే రాయలసీమ రతనాలమయం అవుతుంది. రాయలసీమ సమస్యలపై సంపూర్ణమైన అవగాహనతో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మాట్లాడిన తీరు అభినందనీయం. స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో చదివిన విద్యార్థిగా, ప్రపంచ దేశాలు తిరిగిన వ్యక్తిగా రాయలసీమ ప్రాంత సమస్యలను ఆకలింపు చేసుకుని, ఆయన అద్భుతమైన ప్రసంగాన్ని చేశారు. రాయలసీమ ప్రాంతంలో నీటి లభ్యతను పెంచి తుం పర సేద్యం ద్వారా గణనీయంగా పంట రాబడిని పెంచుకోవచ్చునని లోకేష్ వివరించిన విధానం బాగుంది. గతంలో చంద్రబాబు నాయుడు ఈ విధానాన్ని అమలు చేసి చూపించారు. ఇజ్రాయిల్ సాంకేతిక పరిజ్ఞానంతో డ్రిప్ ఇరిగేషన్ విధానాన్ని రాష్ట్రంలో చంద్రబాబు ప్రవేశపెట్టారు. అయితే ఈ ప్రభుత్వంలో డ్రిప్ లేదు… ఇరిగేషన్ లేదు. వాణిజ్య పంటలు పండించడంతోపాటు వాటి మార్కెటింగ్ కు అనువైన రవాణా సౌకర్యాన్ని పెంపొందించడం ద్వారా రైతులను ధనవంతులను చేయవచ్చు. రోడ్డు కనెక్టివిటీ తో పాటు, రైలు కనెక్టివిటీ పెంచాలి. రోడ్డు కనెక్టివిటీని రైల్వేకు అనుసంధానం చేస్తే రవాణా సౌకర్యం సులభతరం అవుతుంది.

రాయలసీమ ప్రాంతంలో నారా లోకేష్ కు అనూహ్య ప్రజాదరణ లభిస్తుంది. రాయలసీమ అభివృద్ధికి సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. గత ప్రభుత్వ హయాములో సాగునీటి ప్రాజెక్టులు ప్రగతి పథంలో నడిచాయి. కానీ ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అటకెక్కాయి. మా పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి సంక నాకిపోయింది. కాస్తో కూస్తో సంక్షేమం జరిగినప్పటికీ, అభివృద్ధి లేని సంక్షేమం సంక్షోభానికి దారితీస్తుంది. రాష్ట్ర ప్రజలు లోకేష్ లాంటి నాయకుడి కోసం ఎదురుచూస్తున్నారు. ప్రజలు అడిగిన ప్రశ్నలకు ఆయన, సవివరంగా సమాధానం చెప్పిన విధానం బాగుంది. రాయలసీమ బాగుపడాలంటే విజ్ఞులైన ప్రజలు నిజమైన నాయకులని ఎన్నుకోవాలన్నారు. జీసస్ క్రీస్తును శిలువ వేసిన సమాజంలో మనం ఉన్నాము. నారా లోకేష్ పై గుడ్ల దాడే కాదు… రాళ్ల గాడి కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి. నారా లోకేష్ నిర్వహిస్తున్న పాదయాత్రకు ప్రజాస్పందన అధికమవడం వల్లే ఈ దాడులన్నారు. నారా లోకేష్ పై గుడ్ల దాడి చేసిన వారిని అరెస్టు చేసిన పోలీసులను రఘురామకృష్ణం రాజు అభినందించారు.

సుప్రీం లో సునీత పిటిషన్ మెన్షన్ కు రాలేదు
సుప్రీంకోర్టులో వైఎస్ సునీత దాఖలు చేసిన పిటిషన్ మెన్షన్ కు రాలేదు. సునీత తరఫున వాదిస్తున్న సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూత్రా మెన్షన్ చేయాలని కోరడం జరిగింది. పిటిషన్ లో ఉన్న తప్పులను సరిదిద్ధి, మెన్షన్ లిస్ట్ లో పెట్టాలని అభ్యర్థించారు. కోర్ట్ సానుకూలంగా ఆర్డర్ ఇవ్వడం జరిగింది. పిటిషన్ మెన్షన్ కాకుండా అదృశ్య శక్తులు పనిచేస్తున్నాయి. సోమవారం నాటికి సునీత పిటిషన్ లిస్టు అయ్యే అవకాశం ఉందని రఘురామకృష్ణం రాజు తెలిపారు. తెలుగుదేశం పార్టీతో పొత్తు ప్రసక్తే లేదని గతంలో పేర్కొన్న బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, పొత్తు గురించి చంద్రబాబు నాయుడునే అడగాలని చెప్పడం ఆయన సంస్కారానికి నిదర్శనం. రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర సహకారాన్ని కోరుతూ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తో చంద్రబాబు నాయుడు భేటీ అయి ఉంటారు. బిజెపి జాతీయాధ్యక్షుడు నడ్డా కూడా ఈ సమావేశంలో పాల్గొనడంతో రాజకీయాల గురించి కూడా చర్చించి ఉంటారు. రాష్ట్ర విభజన చట్టం ప్రకారం పోలవరం నిధుల గురించి ప్రస్తావించాలని ప్రధాన ప్రతిపక్ష నేతను నరసాపురం ఎంపీగా నేను కోరాను.

LEAVE A RESPONSE