– పవన్ కళ్యాణ్ కు జీవిత కాలం సమయం ఇస్తున్నా
– సీఎం జగన్ తో చాలెంజ్ చేసే శక్తి, సామర్థ్యం పవన్ కళ్యాణ్ కు లేవు
– ‘జానీ’ లు చూడం, స్పీచ్ లు వినం కాబట్టి మేం భయపడే ప్రసక్తి ఉండదు
– స్క్రిప్ట్ సరిగ్గా చదువ లేదని భయపడేది చంద్రబాబు
– రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని
విజయవాడ, సెప్టెంబర్ 30: పవన్ కళ్యాణ్ తన జీవిత కాలంలో జగన్మోహన్ రెడ్డిని మాజీ ముఖ్యమంత్రిని చేయగలిగితే తాను రాజకీయాలను వదిలేసి వెళ్ళిపోతానని రాష్ట్ర పౌర సరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) సవాల్ విసిరారు. గురువారం విజయవాడలో మంత్రి కొడాలి నాని మీడియాతో మాట్లాడారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి 2011లో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని స్థాపించారని చెప్పారు. కడప పార్లమెంటు నుండి జగన్మోహన్ రెడ్డి, పులివెందుల అసెంబ్లీ నుండి ఆయన తల్లి వైఎస్ విజయమ్మ పోటీ చేశారని అన్నారు. ఆనాడు ప్రతిపక్షంలో తెలుగుదేశం పార్టీ ఉందని తెలిపారు. మొదటిసారిగా ఎవరినీ కలుపుకోకుండా ఒంటరిగా ఎన్నికలకు వెళ్లి కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలకు డిపాజిట్లు కూడా రాకుండా చేశారని చెప్పారు.
5.30 లక్షల ఓట్ల మెజార్టీతో జగన్ మోహన్ రెడ్డి గెలిచారని తెలిపారు. ఆ తర్వాత జరిగిన 2014 అసెంబ్లీ ఎన్నికల్లో 67 మంది శాసనసభ్యులతో బలమైన ప్రతిపక్ష నాయకుడిగా జగన్మోహన్రెడ్డి అవతరించారన్నారు. 2019లో తిరిగి పోటీ చేసి 151 సీట్లతో దేశంలోనే అత్యంత బలమైన నాయకుడిగా నిరూపించుకుని రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యారని చెప్పారు. జగన్ మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని స్థాపించిన తర్వాత మూడు సంవత్సరాలకు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని స్థాపించారన్నారు. దేశంలోనే పార్టీ పెట్టి పోటీ చేసిన రెండు చోట్ల ఓడిన అరుదైన రికార్డు పవన్ కళ్యాణ్ సొంతమైందన్నారు.
రాష్ట్రంలో తాజాగా జరిగిన పరిషత్ ఎన్నికల్లో 1 జడ్పీటీసీ, 160 ఎంపీటీసీ స్థానాల్లో గెలిచానని పవన్ కళ్యాణ్ చెబుతున్నారన్నారు. రాష్ట్రంలో పది వేల ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయని, వందకు పైగా స్థానాలను గెలిచి పవన్ కళ్యాణ్ తన బలాన్ని అతిగా ఊహించుకుంటున్నారని అన్నారు. జగన్ మోహన్ రెడ్డిని మాజీ ముఖ్యమంత్రిని చేస్తానని, 2024 లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి 15 సీట్లు వచ్చేలా చేస్తానని ప్రగల్భాలు పలుకుతున్నారని విమర్శించారు. ఇప్పటివరకు రాజకీయాలు చెయ్యలేదని, చంద్రబాబు నాయుడు, మోదీ బూట్లు, కమ్యూనిస్టుల సంక నాకానని చెప్పుకుంటున్నాడన్నారు. మాయావతి పార్టీ దగ్గరకు వెళ్లి ఎస్సీ, ఎస్టీ ఓట్లను చీల్చి జగన్మోహన్రెడ్డిని ఓడించడానికి వాళ్ళ కాళ్లు పట్టుకున్నానని అంటున్నాడన్నారు. ఇప్పటివరకు రాజకీయాలు చేయకుండా, చెత్త కబుర్లు చెప్పుకుంటూ బజార్ల వెంట తిరిగానని, ఇకనుండి రాజకీయాలు చేయాలనుకుంటున్నానని చెప్పే దయనీయమైన పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ ఉన్నాడన్నారు. జగన్మోహన్ రెడ్డి సింహం లాంటి వాడని, 2014, 2019 లోనూ ఒంటరిగానే పోటీ చేశారన్నారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రంలోని రాజకీయ పార్టీలు, కొంతమంది వ్యక్తులను నమ్మి పార్టీని నడపటం లేదన్నారు.
రాష్ట్రంలో ఉన్న ప్రజలను, పైన ఉన్న దేవుడిని జగన్మోహన్ రెడ్డి నమ్మారని చెప్పారు. 2024 ఎన్నికల్లో కూడా సీఎం జగన్ మోహన్ రెడ్డి ఒంటరిగానే పోటీ చేస్తారని తెలిపారు. పవన్ కళ్యాణ్, ఆయన పార్టనర్ చంద్రబాబు, అంటకాగే భారతీయ జనతా పార్టీ, అవసరమైతే కాంగ్రెస్ పార్టీని, గతంలో వదిలేసిన సిపిఐ, సిపిఎం పార్టీలతో పాటు ఇంకా దేశంలో ఉన్న మిగిలిన పార్టీలను కలుపుకొని రావాలన్నారు. పవన్ కళ్యాణ్ తన జీవిత కాలంలో, బతికి ఉన్నంతకాలం సమయం ఇస్తున్నానని, జగన్మోహన్రెడ్డిని మాజీ ముఖ్యమంత్రిని చేయగలిగితే తాను రాజకీయాలను వదిలేసి వెళ్ళిపోతానని సవాల్ విసిరారు. 2024 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ కనీసం శాసనసభ్యుడిగా కూడా గెలవలేని చవట దద్దమ్మ అని అన్నారు. సీఎం జగన్ జగన్ కు, పవన్ కళ్యాణ్ కు ఏమైనా సంబంధం ఉందా అని ఎద్దేవా చేశారు. నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉందన్నారు. సీఎం జగన్ మోహన్ రెడ్డికి చాలెంజ్ చేసే శక్తి, సామర్థ్యం పవన్ కళ్యాణ్ కు లేవన్నారు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుని రాజకీయాలు చేయాలని నిర్ణయించుకోవడం మంచిదని చెప్పారు. ఇకనైనా శాసనసభ్యుడిగా గెలుస్తావో లేదో చూసుకోవాలని పవన్ కళ్యాణ్ కు సూచించారు.అధికార పార్టీ నాయకులకు, సీఎం జగన్మోహన్ రెడ్డికి భయం ఎలా ఉంటుందో తెలియదన్నారు.
సోనియాగాంధీ హయాంలోనే అధికారాన్ని ఈక ముక్క కింద తీసి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని స్థాపించారన్నారు. 16 నెలలు జైలు జీవితాన్ని అనుభవించి సింహంలా పోరాడి ముఖ్యమంత్రి అయ్యారని గుర్తు చేశారు. సోనియా గాంధీ, మోడీ వంటి వ్యక్తులకే భయపడలేదన్నారు. అక్రమ కేసులకు భయపడ లేదని చెప్పారు. 16 నెలల పాటు జైలు జీవితాన్ని కూడా లెక్కచేయలేదని అన్నారు. పవన్ కళ్యాణ్ ఫ్లాప్ సినిమా చూపించి మమ్మల్ని భయపెడతాడా అని విమర్శించారు. ఇంకో జానీ సినిమా తీసి మాకు చూపిస్తాడా అని అన్నారు. పవన్ కళ్యాణ్ గంటన్నర సుత్తి మాట్లాడితే మేము ఎలాగో చూడమన్నారు.
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా ఎలాగూ చూడరని, మాకు పని పాట ఉందని చెప్పారు. మాకు ఎలా భయం కల్పిస్తాడని, పవన్ కళ్యాణ్ సొల్లు కబుర్లు మేము వినేది ఉండదన్నారు. జానీ వంటి సినిమాలను కూడా చూడమన్నారు. పవన్ కళ్యాణ్ ఏదో ఒకటి చేస్తాడని టీవీల దగ్గరే చంద్రబాబు కూర్చొని, ఇచ్చిన స్క్రిప్ట్ సరిగ్గా చదువ లేదని, దరిద్రంగా చదివాడని భయపడుతుంటాడన్నారు.మేం భయపడే ప్రసక్తే లేదన్నారు. పవన్ కళ్యాణ్ సినిమాలు చూడం, ఆయన స్పీచ్ వినం కాబట్టి మేము భయపడే అవకాశం ఉండదని మంత్రి కొడాలి నాని స్పష్టం చేశారు.