భోథ్ లో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి
తెలంగాణలో త్వరలో జరగనున్న ఎన్నికల్లో కాంగ్రెస్‌ను గెలిపిస్తే ఆదిలాబాద్ జిల్లాను అభివృద్ధి పథంలో నడిపిస్తామని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం ఆదిలాబాద్ జిల్లా బోథ్‌లో నిర్వహించిన కాంగ్రెస్ విజయభేరి సభలో ఆయన మాట్లాడారు. పార్టీ నష్టపోతుందని తెలిసినా సోనియాగాంధీ ప్రత్యేక రాష్ట్రం ఇచ్చారన్నారు. ఆత్మహత్యలు చేసుకున్న విద్యార్థుల కుటుంబాలను కేసీఆర్ పరామర్శించలేదని రేవంత్ ఆరోపించారు.
“తెలంగాణ వచ్చి పదేళ్లయినా బోథ్ కు నీళ్లేందుకు రాలేదు? ఇక్కడి ప్రజలకు పోడు భూములకు పట్టాలు ఎందుకివ్వలేదు? తండాలను పంచాయితీలు చేశామని చెప్పుకునే కేసీఆర్ ఎన్ని పంచాయతీలకు భవనాలు కట్టించారు? గ్రామసర్పంచులకు వేల కోట్ల బకాయిలు ఇవ్వక ప్రభుత్వం వారిని ఆత్మహత్యలకు ఉసిగొల్పింది. కేసీఆర్ తన మేధస్సును రంగరించి కాళేశ్వరం కట్టిన అని చెప్తుండు..కట్టిన మెడిగడ్డ మూడేళ్లలో కుంగిపోయింది… అన్నారం పగిలిపోయింది.
బోథ్ కు నీళ్లు రాకపోవడానికి ఈ దద్దమ్మ సీఎం కేసీఆరే కారణం. ఇక్కడి కుఫ్టీ ప్రాజెక్టు పూర్తి కావాలంటే కాంగ్రెస్ అధికారంలోకి రావాలి బోథ్ కు డిగ్రీ కాలేజీ రావాలంటే ఈ గడ్డపై కాంగ్రెస్ గెలవాలి..ఒక్కసారి ఈ బోథ్ గడ్డపై కాంగ్రెస్ ను గెలిపించండి.. డిసెంబర్ 31లోపు బోథ్ ను రెవెన్యూ డివిజన్ చేసే జిమ్మేదారి నాది” అని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.
ఆదివాసీలు , లాంబాడాలు కాంగ్రెస్ కు రెండు కళ్లలాంటివారు.తెలంగాణలో 12 అసెంబ్లీ స్థానాల్లో 6 లాంబాడాలకు, 6 ఆదివాసీలకు ఇవ్వాలని నిర్ణయించింది. బలరాం నాయక్ పెద్దమనసుతో ఆదివాసీ బిడ్డకోసం ఇల్లందు సీటు వదులుకుండు పదవి కంటే ప్రజలకు మేలు జరగడం ముఖ్యమని ఆయన తన ఎమ్మెల్యే టికెట్ త్యాగం చేసారని రేవంత్ రెడ్డి అన్నారు.
ఆదిలాబాద్ నుంచి అచ్ఛంపేట అడవుల వరకు కాంగ్రెస్ ను గెలిపించండి..ఆదిలాబాద్ ను దత్తత తీసుకుని అభివృద్ధి చేస్తాందొరలపాలన పోవాలి.. ఇందిరమ్మ రాజ్యం రావాలి అన్నారు రేవంత్ రెడ్డి. అప్పుడే పేద ప్రజలకు న్యాయం జరుగుతుంది..కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే 24 గంటల ఉచిత విద్యుత్ ఇస్తామని రేవంత్ హామీ ఇచ్చారు. మహాలక్ష్మి పథకం ద్వారా ప్రతి మహిళకు నెలకు రూ.2,500 ఇస్తామన్నారు. కాంగ్రెస్ హయాంలో గ్యాస్ సిలిండర్ ధర రూ.400 ఉండేది. మోదీ, కేసీఆర్ కలిసి ప్రస్తుతం ఆ ధరను రూ.1200 చేశారు. సోనియా గాంధీ ప్రకటించిన ఆరు గ్యారెంటీలను అమలు చేసి తీరుతాం అని రేవంత్‌రెడ్డి అన్నారు.
నిర్మల్ మాస్టర్ ప్లాన్ మీ మెడ మీద కత్తిలా వేలాడుతుంది
నిర్మల్ మాస్టర్ ప్లాన్ మీ మెడ మీద కత్తిలా వేలాడుతుంది..ఎన్నికల కోసం మాస్టర్ ప్లాన్ ను తాత్కాలికంగా వాయిదా వేశారు. మళ్ళీ బీఆరెస్ గెలిస్తే మాస్టర్ ప్లాన్ పేరుతో మీ భూములు గుంజుకుంటరాని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే నిర్మల్ మాస్టర్ ప్లాన్ రద్దు చేసే బాధ్యత మాదన్నారు. మంత్రిగా ఉండి కూడా ఇంద్రకరణ్ రెడ్డి ఇక్కడి ప్రజలకు డబుల్ బెడ్రూం ఇండ్లు ఇవ్వలేదు. అలాంటి ఇంద్రకరణ్ రెడ్డిని ఎందుకు ఓటు వేయాలి అని ప్రశ్నించారు.
శ్రీహరి రావుకు ఒక్క అవకాశం ఇవ్వండి… శ్రీహరిరావుకు ఓటు వేస్తే.. రేవంతన్నకు వేసినట్లే.. సోనియమ్మకు వేసినట్లే అని వ్యాఖ్యానించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం నిర్మల్ లో నిర్వహించిన కాంగ్రెస్ విజయభేరి సభలో రేవంత్ రెడ్డి మాట్లాడారు. తుమ్మిడిహట్టి వద్ద ప్రాజెక్టు నిర్మిస్తే.. ఆదిలాబాద్ కు సాగునీరు వచ్చేదన్నారు. తుమ్మిడిహట్టి వద్ద ప్రాజెక్టు నిర్మిస్తే… తక్కువ ఖర్చుతో ప్రాజెక్టు పూర్తయ్యేదన్నారు. తక్కువ ఖర్చుతో ప్రాజెక్టు కడితే కమీషన్లు రావని కెసిఆర్ భావించారని రేవంత్ ఆరోపించారు.
తెలంగాణలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడింది…అందుకే జెండాలు ఎజెండాలు, గ్రూపులు గుంపులు పక్కనబెట్టి కాంగ్రెస్ ను గెలిపించాలి.. ఆనాడు చెప్పిన.. ఈనాడు చెబుతున్నా.. కొడంగల్ లాగే నిర్మల్ నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తామని రేవంత్ రెడ్డి అన్నారు. ప్రాజెక్టుల రీడిజైన్ పేరుతో కేసీఆర్ లక్ష కోట్లు దోచుకుండు..మామా అల్లుళ్ల చేతిలో చిక్కి ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు అన్యాయానికి గురైంది..ఆదిలాబాద్ ఎడారిగా మారిందని ఆరోపించారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామన్నారు.
జనగామ ప్రజలు ఎటువైపో నిర్ణయించుకోవాలి
జనగామ గడ్డ కాంగ్రెస్ పార్టీ అడ్డా అని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం జనగామలో నిర్వహించిన కాంగ్రెస్ విజయభేరి సభలో రేవంత్ రెడ్డి మాట్లాడారు.
‘‘తెలంగాణ ఉద్యమం, సాయుధ పోరాటంలో జనగామ ప్రజలది ప్రత్యేక స్థానం. పొన్నాల లక్ష్మయ్యకు కాంగ్రెస్ పార్టీ ఎంతో చేసింది. 47 ఏళ్ల పాటు కాంగ్రెస్ పార్టీ మోసింది. 47 ఏళ్లు మోసిన కార్యకర్తలను పొన్నాల మోసం చేశారు. పొన్నాల లక్ష్మయ్య పరిస్థితి రెంటికీ చెడ్డ రేవడిలా తయారైంది. పొన్నాల కేసీఆర్ పంచన చేరితే ఆయన గౌరవం ఏమైనా మిగిలిందా? కష్టాల్లో ఉన్న కార్యకర్తలను మోసం చేసి పొన్నాల శత్రువు పంచన చేరాడు. అమెరికాలో మాట్లాడుకుని కేసీఆర్ పంచన చేరాడు” అని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.
కట్టుబానిసలా ఉండే ఎమ్మెల్యేలు ఉండాలని కేసీఆర్ కోరుకుంటారు. అందుకే జనగామలో పల్లాను నిలబెట్టారు అని రేవంత్ రెడ్డి విమర్శించారు. జనగామ ప్రజలు లక్ష కోట్లు దోచుకున్న దొంగ వైపు ఉంటారో ధర్మం వైపు ఉంటారో తేల్చుకోండన్నారు. పల్లా రాజేశ్వర్ రెడ్డి గురించి ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి అర్ధనగ్న ప్రదర్శన చేసి చెప్పిండు. వీళ్లిద్దరి బాగోతం గడీలో ఉన్న దొరకు తెలుసు అన్నారు.
కాంగ్రెస్ అభ్యర్థి ప్రతాప్‌రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలి అని రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారుల. ప్రజా ప్రభుత్వంలో పేదలను ఆదుకునేందుకు సోనియమ్మ ఆరు గ్యారంటీలను ప్రకటించారు.
కాంగ్రెస్ అధికారంలోకి రాగానే మాహిళలకు ప్రతీ నెల రూ.2500 సాయం చేస్తామన్నారు. రూ.500లకే గ్యాస్ సిలిండర్, రైతులకు ప్రతీ ఏటా ఎకరాకు రూ.15వేలు, రైతు కూలీలకు ప్రతీ ఏటా రూ.12వేలు, ఇల్లు కట్టుకునే ప్రతీ పేదవాడికి రూ.5లక్షలు ఆర్థికసాయం అందిస్తామన్నారు. కేసీఆర్ ఈ పదేళ్లలో ఎంతమందికి రెండు పడక గదుల ఇళ్లు కట్టించి ఇచ్చారు అని ప్రశ్నించారు. కాంగ్రెస్ గెలిస్తే.. పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు, విద్యార్థులకు యువ వికాసం కింద రూ.5లక్షలు ఇస్తాం అని రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చారు. కేసీఆర్ ఉంటే మీకు వచ్చే పెన్షన్ రూ.2వేలు.. కేసీఆర్ ను బొందపెడితే రూ.4 వేలు..కాంగ్రెస్ అధికారంలోకి రాగానే చేయూత పథకం ద్వారా నెలకు రూ.4 వేల పెన్షన్ అందిస్తామన్నారు రేవంత్ రెడ్డి.