– ఛార్జీల పెంపు 70 శాతం వినియోగదార్లపై ప్రభావం
– ప్రతి నెలా ఏకంగా రూ.400 భారం పడుతుంది
– వైయస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి
ప్రొద్దుటూరు: దీపావళి నుంచి ఉచిత గ్యాస్ పథకాన్ని ప్రారంభించి, ఏటా 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తూ, నెలకు రూ.200 లబ్ధి చేకూరుస్తున్నట్లు ఆర్భాటంగా ప్రకటిస్తున్న ప్రభుత్వం, మరోవైపు విద్యుత్ ఛార్జీల మోత మోగిస్తోందని వైయస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి ఆక్షేపించారు.
విద్యుత్ ఛార్జీల పెంపు 70 శాతం వినియోగదార్లపై ప్రభావం చూపుతుందన్న ఆయన, ప్రతి కుటుంబంపై నెలకు రూ.400 భారం పడుతుందని వెల్లడించారు. అలా ఒక చేయితో రూ.200 ఇస్తూ, మరో చేయితో రూ.400 లాక్కుంటున్నారని దుయ్యబట్టారు. విద్యుత్ ఛార్జీల పెంపు నిర్ణయాన్ని వెంటనే విరమించాలని డిమాండ్ చేసిన మాజీ ఎమ్మెల్యే, ఛార్జీలు పెంచితే ఊర్కోబోమని, ఉద్యమిస్తామని ప్రకటించారు.
అధికారంలోకి వస్తే విద్యుత్ ఛార్జీలు పెంచబోమంటూ ఎన్నికల ముందు ఇచ్చిన హామీని మర్చి, నాలుగు నెలల్లోనే మాట తప్పారని, ఇది ఏ మాత్రం సరికాదని, కచ్చితంగా 5 ఏళ్లు ఛార్జీలు పెంచొద్దని రాచమల్లు డిమాండ్ చేశారు. విద్యుత్ ఛార్జీల పెంపు వల్ల వినియోగదారులపై ఏటా రూ.6073 కోట్ల భారం పడుతుందని చెప్పారు.
విద్యుత్ వినియోగదార్లలో 70 శాతం నెలకు 200–300 యూనిట్లు వాడుతున్నారని, అందుకే వారినే టార్గెట్ చేసి, ఛార్జీలు పెంచుతున్నారని ఆక్షేపించారు. ఒక్కో యూనిట్‌కు రూ.1.67 పెంచడం దారుణమని విమర్శించారు. కూటమి ప్రభుత్వం ఇలాగే కొనసాగితే, అయిదేళ్లలో ప్రజలు కనీసం తిండి కూడా తినలేని పరిస్థితి వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు.
తమ ప్రభుత్వ హయాంలో కోవిడ్ మహమ్మారి అన్నింటిపై తీవ్ర ప్రభావం చూపినా, రష్యా– ఉక్రెయిన్ యుద్ధం కారణంగా బొగ్గు కొరత ఏర్పడినా, విద్యుత్ ఉత్పత్తి, సరఫరాలో ఎక్కడా లోటు లేకుండా చూశామని రాచమల్లు వెల్లడించారు. చివరి ఏడాది వరకు విద్యుత్ చార్జీలు పెంచని విషయాన్ని ఆయన గుర్తు చేశారు. కానీ, ఈ ప్రభుత్వం నాలుగు నెలలకే ఛార్జీల మోత మోగించడమే కాకుండా, అందుకు గత ప్రభుత్వం కారణమంటూ నిందిస్తున్నారని ఆక్షేపించారు.
తమ హయాంలో నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయడమే కాకుండా, దళిత బిడ్డలకు నెలకు 200 యూనిట్లు, దోభీఘాట్లకు ఉచితం, చేనేత మగ్గాలకు 100 యూనిట్లు, సెలూన్లకు 150 యూనిట్ల విద్యుత్‌ను ఉచితంగా సరఫరా చేశామని గుర్తు చేశారు. ఎస్సీ, ఎస్టీలకు విద్యుత్ సబ్సిడీ రూపంలో గత ప్రభుత్వ హయాంలో రూ.637 కోట్లు ఇస్తే, అదే చంద్రబాబు హయాంలో 2018–19 మధ్య కేవలం రూ.235 కోట్లు మాత్రమే ఇచ్చారని రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి వివరించారు.