-ప్రతిపక్షంలో ఉంటేనే ఇన్ని పనులు చేస్తున్నా.. ఇక గెలిపిస్తే మీతోనే ప్రప్రతిక్షణం
– ఆదుకో మనవడా అని ఓవృద్ధురాలి అభ్యర్ధన
-చలించి అర్ధగంటలోనే టిఫిన్ బండి ఇప్పించిన లోకేష్
ప్రతిపక్షంలో ఉండి కూడా నియోజకవర్గంలో 12 సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నా… ఇక గెలిపిస్తే ఎన్ని సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తానో, ఎంత అభివృద్ధి చేస్తానో ఆలోచించండి’ అంటూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ మరోసారి మంగళగిరి నియోజకవర్గ ప్రజలకు సూచించారు. చెప్పడమే కాదు, సమస్యల పట్ల తాను ఎంత వేగంగా స్పందిస్తాడో చేతల్లో నిరూపించారు. సాయం కోరిన ఓ ముసలి అవ్వ పరిస్థితిపై వెంటనే రంగంలోకి దిగిన లోకేశ్, కొన్ని నిమిషాల వ్యవధిలో తోపుడు బండి సమకూర్చి ఆమె ఉపాధికి సాయపడ్డారు. నారా లోకేశ్ ఇవాళ మంగళగిరి టౌన్ ఇందిరా నగర్ లో నిర్వహించిన బాదుడే బాదుడు కార్యక్రమంలో పాల్గొన్నారు. స్థానికంగా గుంత పుంగనాలు చేసి అమ్ముకునే ముసలి అవ్వ శివపార్వతిని కలుసుకున్నారు.
ఈ సందర్భంగా, ఆ వృద్ధురాలు “ఆదుకో మనవడా” అంటూ లోకేష్ ని సాయం కోరింది. ఆమె పరిస్థితి పట్ల చలించిపోయిన లోకేశ్ ఆమె గుంత పుంగనాల వ్యాపారానికి హామీ ఇచ్చిన అరగంటలోనే టిఫిన్ బండి సమకూర్చారు. తద్వారా అవ్వ ముఖంలో కాంతులు నింపారు. ఈ కార్యక్రమంలో భాగంగా లోకేశ్ స్వయం ఉపాధి కోసం 8 తోపుడు బండ్లు అందించారు. ఈ సందర్భంగా లోకేశ్ మాట్లాడారు. “నేను నియోజకవర్గంలో 12 సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నా. అన్న క్యాంటీన్, ఎన్టీఆర్ సంజీవని, స్త్రీ శక్తి ద్వారా కుట్టు మిషన్లు, పెళ్లి కానుక, తోపుడు బండ్లు ఇలా అనేక కార్య్రమాలను చేపడుతున్నాం. ఎన్టీఆర్ సంజీవని ద్వారా ఇప్పటికే 16 వేల మందికి ఉచితంగా వైద్య సహాయం అందించడం జరిగింది. త్వరలో బీపీ, షుగర్ కి ఉచితంగా మందులు కూడా ఇవ్వబోతున్నాం.
రాష్ట్రంలో సైకో పాలన పోతుంది… సైకిల్ పాలన వస్తుంది. గెలిచిన ఏడాది లోగా కొండ ప్రాంతాల్లో నివసిస్తున్న వారికి బట్టలు పెట్టి పట్టాలు ఇస్తా. కొండ ప్రాంతాల్లో నివసిస్తున్న వారికి త్రాగునీరు, రోడ్లు, డ్రైనేజీ, విద్యుత్ సమస్యలను శాశ్వతంగా పరిష్కరిస్తా. మంగళగిరి లో బుల్లి సైకో ఆర్కే ఉన్నాడు. ఎన్నికల ముందు, లోకేష్ గెలిస్తే ఇళ్లు కూలుస్తాడు అని అన్న బుల్లి సైకో ఇప్పుడు రియల్ ఎస్టేట్ దందా కోసం అన్ని గ్రామాల్లో ఇళ్లు కూలుస్తున్నాడు. రాష్ట్రమంతా ఇసుక ఒక రేటు ఉంటే మంగళగిరిలో మరో రేటు… టన్నుకి అదనంగా రూ.200 వసూలు చేస్తున్నారు. మంగళగిరి లో వైసీపీ నేతల దోపిడి, అవినీతిపై పెద్ద ఎత్తున ఉద్యమిస్తాం. ఎమ్మెల్యే ఇచ్చిన హామీలు అన్నీ అమలు చేసే విధంగా పోరాట కార్యాచరణ రూపొందిస్తాం” అని లోకేశ్ స్పష్టం చేశారు.
“ఏపీలో జరిగిన లిక్కర్ స్కాంని కూడా బయటకి తీస్తాం. జగన్ అండ్ గ్యాంగ్ కి మళ్ళీ చిప్పకూడు ఖాయం. 16 నెలలు చిప్పకూడు తిన్న వాడు ఒక్క ఛాన్స్ అన్నాడు… అధికారం ఇస్తే అన్నీ పెంచుతూ పోతా అన్నాడు. ఇప్పుడు ప్రజలపై భారం పెంచాడు. జగన్ కుడి చేత్తో రూ.10 ఇచ్చి ఎడమ చేత్తో రూ.100 కొట్టేస్తున్నాడు. రూ.200 పెన్షన్ ని రూ.2000 చేసింది చంద్రబాబు గారు. 3 వేల పెన్షన్ అని మూడున్నర ఏళ్లలో మోసపు జగన్ రెడ్డి పెంచింది రూ.500 మాత్రమే. బియ్యం తప్ప రేషన్ లో ఇతర సరుకులు ఏమీ ఇవ్వడం లేదు” అంటూ లోకేశ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.