మహాత్ముడే తిరిగి వస్తే..!

హే రామ్…
అదే చివరి మాట..
తుది శ్వాస…
ఒక జాతిని స్వరాజ్యం ముంగిట నిలిపిన
మహాత్ముడు..
శాంతి అహింసల
గొప్పదనాన్ని..శక్తిని ప్రపంచానికి తెలియజెప్పిన
ఓ మహానాయకుడు
నేలకొరుగుతూ చేసిన
ఆ ఆక్రందన వెనక
ఎంత ఆవేదనో…
తన ప్రాణం పోతుందని కాదు
తన మాతృభూమికి
చేయాల్సింది చాలా
మిగిలి ఉండగా అర్ధాంతరంగా
ఇలా వెళ్ళిపోతున్నానని..!?

ఇదే బాపు..
ఆ రోజున
అలా నిర్దాక్షిణ్యంగా
తుపాకి గుండుకు
బలి కాకుండా..
ఇంకొన్నాళ్లు జీవించి ఉంటే..
దేశమీగతి పట్టకుండా
ఆపగలిగి ఉండేనా..
తను సాధించిన స్వరాజ్యం
తానాశించిన సురాజ్యం..
ఇలా ఆకలిరాజ్యమై..
ముష్కరుల భోజ్యమై..
అవినీతి సామ్రాజ్యమై..
తాను ఎలుగెత్తి ప్రబోధించిన
శాంతి..అహింస..సత్యం
పూజ్యమైన రాబందుల ఏలుబడిలో
మళ్లీమళ్లీ
మరణించేవాడా..
బ్రతికున్నా రోజూరోజూ
కుమిలి కుమిలి వగచేవాడా..!

– ఎలిశెట్టి సురేష్ కుమార్
9948546286

Leave a Reply