– టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి
కేసీఆర్ కు మరోసారి అధికారం ఇస్తే వచ్చేది కిసాన్ సర్కార్ కాదని లిక్కర్ సర్కార్ అని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి విమర్శించారు. బుధవారం ఢిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో ఏఐసీసీ అధికార ప్రతినిధి పవన్ ఖేరాతో కలిసి మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ అబ్ కీ బార్ కిసాన్ సర్కార్ అన్న నినాదం ఇచ్చా రు. దానికి కౌంటరుగా అబ్ కీ బార్ లిక్కర్ సర్కార్ అని విమర్శించాం. ఎందుకంటే కేసీఆర్ కు అత్యంత ఇష్టమైన విషయాల్లో మద్యం ఒకటి.
ఆయన కుటుంబానికి లిక్కర్‌కు అవినాభావ సంబంధం ఉంది. మద్యంతోనే హైదరాబాద్ నుంచి ఢిల్లీ వరకు విస్తరించారు. ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఆయన కుమార్తె కవితపై ఆరోపణలు ఉన్నాయి. కాంగ్రెస్ వార్ రూమ్ నుంచి సోషల్ మీడియాలో పోస్టులు చేయడం కాదు. నేను స్వయంగా ఆరోపిస్తున్న కేసీఆర్కు మరో సారి అధికారం ఇస్తే ఢిల్లీ లేదా తెలంగాణలో లిక్కర్ ప్రభుత్వం ఏర్పడుతుంది. తెలంగాణలో టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత లిక్కర్ పై ప్రభుత్వ ఆదాయం రూ.10,500 కోట్ల నుంచి రూ.36వేల కోట్లకు పెరిగింది.
తెలంగాణలో కొన్ని మీడియా సంస్థలను కేసీఆర్ కొనేశారు. అందుకే సోషల్ మీడియా వేదికగా కాంగ్రెస్ ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్నినిలదీస్తోంది. కేసీఆర్ అవినీతిపై కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నాం. ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర జరుగుతుందని పోలీసులు చెబుతున్నారు. ఫిర్యాదు ఇచ్చిందెవరు ఎఫ్ఐఆర్ నమోదు చేయకుండా, నోటీసులివ్వకుండా పార్టీ వార్ రూంలో ఎలా సెర్చ్ చేస్తారు? అర్థారాత్రి 200 మంది పోలీసులు మఫ్తీలో ఆఫీసుకు వచ్చారు.
అక్కడ మహిళలు కూడా పని చేస్తున్నారు. 50 కంప్యూటర్లను ఎత్తుకెళ్లారు. డేటాను ధ్వంసం చేశారు. అక్కడకు వెళ్లినా మా నేతలను అరెస్ట్ చేశారు. ఈ కేసులో ఐదుగురిని అరెస్టు చేశారు. వారు ఇప్పటి వరకు ఎక్కడ ఉన్నారో తెలియదు. దీనిపై కోర్టులో హెబియస్ కార్పస్ పిటీషన్ వేశాం. ఇది మాముల విషయం కాదు. ఒక పార్టీ వార్ మీద దాడి చేశారు. దీన్ని ఇంతటితో వదిలిపెట్టం. ప్రజల్లోకి వెళ్లి ప్రభుత్వ తీరును ఎండగడతాం. పార్లమెంటులో కూడా ఈ విషయాన్ని లేవనెత్తుతాం.
గత ఎనిమిదేళ్లుగా కేసీఆర్, మోదీ ఒకరికొకరు సహకరించుకున్నారు. నాణానికి బొమ్మా, బొరుసులా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పనిచేస్తున్నాయి. అధికారం నిలబెట్టుకునేందుకు బీఆర్ఎస్, బీజేపీ డ్రామాలాడుతున్నాయి. వారి నాటకాలను తెలంగాణ ప్రజలంతా గమనిస్తున్నారు. బీఆర్ఎస్ అంటే తెలంగాణలో బీహార్ రాష్ట్ర సమితిగా మార్చాలనుకుంటున్నారా? తెలంగాణలో మోదీ మోడల్ పాలనను కేసీఆర్ తీసుకు రావాలనుకుంటున్నారా?
నరేంద్ర మోదీ విధానం ఐస్( ఇన్‌కం టాక్స్, సీబీఐ, ఈడీ), నైస్ (నార్కోటిక్స్, ఇన్‌కం టాక్స్, సీబీఐ, ఈడీ). తెలంగాణలో ఐస్, నైస్ మోడల్ చెల్లదు. ఈ రోజు ఢిల్లీలో బీఆర్ఎస్ కార్యాలయాన్ని ప్రారంభించారు. దీనికి కుమార స్వామి, అఖిలేష్ యాదవ్ హాజరయ్యారు. అవినీతిపరుడైన కేసీఆర్ కు సహకరించవద్దని కుమార స్వామి, అఖిలేష్ యాదవ్ ను కోరుతున్నా.
కేసీఆర్ పార్టీని ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా మారుస్తున్నారు. రానున్న రోజుల్లో తెలంగాణను కూతురుకు అప్పగిస్తారనే కేటీఆర్ తండ్రిపై అలిగారు. అందుకే ఢిల్లీలో పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవానికి కేటీఆర్ వెళ్లలేదు. ప్లాస్టిక్ సర్జరీ చేస్తే డీఎన్ఏ మారదు. అలాగే పేరు మార్చినంత మాత్రాన ఆ పార్టీ డీఎన్ఏ మారదు. కేసీఆర్ డీఎన్ఏ ఏంటో అందరికీ తెలుసు. ప్లాస్టిక్ సర్జరీతో రూపు రేఖలు మార్చవచ్చు కానీ.. మనిషి ఆలోచనలు మార్చలేరు. టీఆర్ఎస్ బీఆర్ఎస్ గా మారినా ఆ పార్టీతో పొత్తు ఉండదు. మాది యాంటీ బీఆర్ఎస్, యాంటీ కేసీఆర్.
దక్షిణ భారతదేశంలో నవంబర్ 8 వరకు జరిగిన రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర విజయవంతమైంది. దీంతో భయపడిపోయిన మోదీ గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, ఢిల్లీ మున్సిపాలిటీ వంటి కీలక ఎన్నికలను వదిలేసి నవంబర్ 11, 12 తేదీల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళలలో పర్యటించారు. సాధారణ ఎన్నికలకు, ఉప ఎన్నికలకు చాలా తేడా ఉంటుంది. ఉప ఎన్నికల కేవలం ఏదో విషయం చుట్టూ జరుగుతాయి. జనరల్ ఎలక్షన్స్ లో అలా ఉండదు. 2001లో కేసీఆర్ రాజీనామా చేసినప్పుడు జరిగిన ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలిచింది. టీడీపీ రెండో స్థానంలో, కాంగ్రెస్ మూడో స్థానంలో ఉంది. కానీ రాజశేఖర రెడ్డి నాయకత్వంలో 2004లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైంది.