-ఆ రెండు కాపీలను బయటపెట్టాలి
-పసిపిల్లలు అమ్మ అన్నట్లుగా… మా పార్టీ వారు కమ్మ అంటున్నారు
-నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు
ఎక్లిప్స్ ఫోరెన్సిక్ ల్యాబ్ యజమాని జిమ్ స్టఫర్డ్ కు ఆంధ్ర ప్రదేశ్ సిఐడి చీఫ్ సునీల్ కుమార్ రాసిన లేఖను, దానికి ప్రత్యుత్తరంగా జిమ్ స్టఫర్డ్ అందజేసిన ఒరిజినల్ నివేదికను బయటపెట్టాలని నరసాపురం ఎంపీ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు రఘురామకృష్ణంరాజు డిమాండ్ చేశారు. ఆ లెటర్ కు, ఈ లెటర్ కు ఉన్న తేడా తెలిసి పోతే ఖేల్ ఖతం దుకాణం బంద్ అని వ్యాఖ్యానించారు. గోరంట్ల మాధవ్ నగ్న వీడియో పై టిడిపి నాయకులు విడుదల చేసిన నివేదిక, తప్పుడు నివేదికని ఎలా నిర్ధారిస్తారని ప్రశ్నించారు. ఒకటి రెండు పదాలను మార్చినంత మాత్రాన ఫేక్ అని ఎలా ప్రకటిస్తారంటూ నిలదీశారు.
శుక్రవారం రచ్చబండ కార్యక్రమంలో భాగంగా రఘురామ కృష్ణంరాజు మీడియాతో మాట్లాడుతూ… పీవీ సునీల్ కుమార్ సూటు వేసుకొని మళ్లీ ప్రెస్ మీట్ ను ఏర్పాటు చేసి ఒరిజినల్ రిపోర్టును బయట పెట్టాలన్నారు. ఒరిజినల్ రిపోర్టులో ఒకటి రెండు పదాలను, జిమ్ స్టఫర్డ్ కార్యాలయ సిబ్బంది మార్చి నివేదిక ను ఇచ్చి ఉండవచ్చు కదా అని అన్నారు. పీవీ సునీల్ కుమార్ ప్రెస్ మీట్ ముగించుకొని ఇంటికి వెళ్లి సూటు విప్పాడో లేదో కానీ మంత్రులు, మాజీ మంత్రులు దిగిపోయి విమర్శలు గుప్పించడం హాస్యాస్పదంగా ఉన్నదని అన్నారు. జిమ్ స్టఫర్డ్ కు ఈ నెల 17వ తేదీన పీవీ సునీల్ కుమార్ ఒక లేఖ రాస్తూ, మీ పేరిట ఫేక్ సర్టిఫికెట్ ఒకటి సోషల్ మీడియాలో సర్కులేట్ అవుతున్నదని పేర్కొన్నారని చెప్పారు.
అయితే దానికి జిమ్ స్టఫర్డ్ సమాధానమిస్తూ తన నివేదిక లో పోతిన చిన్న మార్పులను అడిగారని, తాను చేస్తానని కూడా చెప్పానని, అంతలోనే ఆయన తన నివేదికను సోషల్ మీడియాలో సర్కులేట్ చేశారని వెల్లడించారని వివరించారు.. అయితే పీవీ సునీల్ కుమార్ మీడియా ప్రతినిధులకు ఒక్క కాగితం మాత్రమే ఇచ్చి, ఒరిజినల్ రిపోర్టును ఎందుకని ఇవ్వలేదని రఘురామకృష్ణంరాజు ప్రశ్నించారు. ఎందుకని ఇవ్వలేదని తాను భావిస్తున్నానంటే, నివేదికలో తేదీ వద్దనో, లేకపోతే ఎక్కడో చిన్న మార్పులు ఉంటే ఉండవచ్చునని… కంటెంట్ ను మార్చే అవకాశం ఉండదని తేల్చి చెప్పారు. జిమ్ స్టఫర్డ్ కు పీవీ సునీల్ కుమార్ రాసిన లేఖను, దానికి ప్రత్యుత్తరంగా అతను ఒరిజినల్ నివేదికను అటాచ్ చేస్తూ పంపిన ఉత్తరాన్ని ఎందుకని మీడియా ప్రతినిధులకు ఇవ్వలేదన్న దానిపై ప్రజలకు అనేక అనుమానాలు ఉన్నాయని చెప్పారు.
రాజమౌళి దర్శకత్వంలో ఇటీవల విడుదలైన ఆర్ ఆర్ ఆర్ చిత్రంలోని గ్రాఫిక్స్ సన్నివేశాన్ని పీవీ సునీల్ కుమార్ ఉదాహరణగా పేర్కొనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. అసలు పీవీ సునీల్ కుమార్ ఉదాహరణకు, ఈ కేసుకు ఏమైనా సంబంధం ఉన్నదా అని రఘురామకృష్ణంరాజు ప్రశ్నించారు.
పసిపిల్లలు తమకు ఏమైనా అయితే అమ్మ అన్నట్లుగానే, మా పార్టీ నాయకులు కొందరు ప్రతిదానికి కమ్మ, లేకపోతే చంద్ర బాబు అనడం అలవాటుగా మారిపోయిందని రఘురామకృష్ణంరాజు ఎద్దేవా చేశారు. బట్టలు విప్పిన వాడికి, తెలుగుదేశం పార్టీకి అసలు సంబంధం ఏమిటని ఆయన ప్రశ్నించారు. బట్టల్లేకుండా ఒక పార్లమెంట్ సభ్యుడి వీడియోను విడుదల చేయాలని ఆలోచన ఎవరికైనా వస్తుందా అంటూ నిలదీశారు. అటువంటి ఆలోచన వచ్చిందంటే ప్రజలు దుమ్మెత్తి పోస్తారని పేర్కొన్నారు. నగ్న వీడియో కేసు వ్యవహారంపై కేసు నమోదు చేశారో లేదో తెలియదని, కానీ మహిళా కమిషన్ చైర్మన్ వాసిరెడ్డి పద్మ 15 రోజులలో నివేదిక ఇవ్వాలని కోరారన్నారు. ఇప్పటికే 15 రోజులు గడిచిపోయినా నివేదికకు దిక్కు లేకుండా పోయిందని రఘురామ కృష్ణంరాజు అన్నారు.
మాధవ్ ఇచ్చిన ఫిర్యాదు పైనైన కేసు నమోదు చేసి, నగ్న వీడియోలు ల్యాబ్ లో పరీక్షించాలన్నారు. రాష్ట్రాన్ని కుదిపేస్తున్న నగ్న వీడియో వ్యవహారంలో సిఐడి చీఫ్ సునీల్ కుమార్, మరొక అధికారి విజయ్ పాల్ తనని ఎత్తుకెళ్లి బాదినట్లుగా ఎందుకని, ఈ కేసు లో వేగంగా స్పందించడం లేదని ప్రశ్నించారు. ఒక వ్యక్తి, మరొకరికి తన మర్మాంగాలను ప్రదర్శించాడంటే, అది అతని ఫోను ద్వారా నే అయి ఉండాలన్న ఆయన, మాధవ్ తో పాటు, అతని వ్యక్తిగత సహాయకుల ఫోన్లను స్వాధీనం చేసుకొని పరిశీలించాలని, లేకపోతే సర్వీస్ ప్రొవైడర్ నుంచి వివరాలను తెలుసుకోవచ్చని చెప్పారు. మాధవ్ ఫోను , అతని వ్యక్తిగత సహాయకుల ఫోన్ కాల్ డేటాను సేకరిస్తే అసలు విషయం బయట పడుతుందన్నారు. ఒకవేళ ఆ స్త్రీనే మాధవ్ ను రెచ్చగొట్టి మర్మాంగాల ప్రదర్శనకు ఉసిగొలిపిన ఆమె నెంబర్ ను పట్టుకోవడం కూడా పెద్ద కష్టమేమీ కాదన్నారు. మాధవ్ ఫోన్ కు వచ్చిన ఆ కాల్ ను ట్రేస్ చేస్తే సరిపోతుందన్నారు.
విచారణ చేస్తే చేయండి… లేకపోతే వదిలేయండి
మాధవ నగ్న వీడియో వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వం విచారణ చేస్తే చేయాలని, లేకపోతే ఆయన చూపెట్టారు… ఎవరో చూసింది… వదిలేయండి… అయిందేదో అయిపోయింది అంటే సరిపోతుందని రఘురామకృష్ణం రాజు అపహాస్యం చేశారు. నిన్ను వెనక నుండి పట్టుకోవాలని ఉన్నదని అన్నందుకే అతడే అన్నాడని నమ్మి అతన్ని పదవిలో నుంచి తొలగించారని, ఆ వేగం ఇప్పుడేమైందని ప్రశ్నించారు. సినీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ పృథ్వీ కి పదవి ఇచ్చినట్లు ఇచ్చి లాక్కున్నారని విమర్శించారు. మాధవ్ తప్పు చేయలేదని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నమ్మారని అనుకుందాం, విచారణ ఎందుకని చేపట్టలేదు… నగ్న వీడియో పరీక్ష నిమిత్తం ల్యాబ్ కు ఎందుకు పంపలేదని ప్రశ్నించారు. దానికి ఒరిజినల్ వీడియో లేదని అంటున్నారని, ప్రయత్నం చేయకుండానే ఒరిజినల్ వీడియో దొరుకుతుందా అంటూ నిలదీశారు. రేపు ఒరిజినల్ వీడియో బయటికి వస్తే పరిస్థితి ఏమిటి అన్న రఘురామకృష్ణం రాజు, మా పార్టీ వాళ్లు ఎక్కువగా మాట్లాడేస్తున్నారని విమర్శించారు.
ప్రైవేటు ల్యాబ్ నివేదికను పట్టించుకోవద్దన్న సిఐడి చీఫ్ పీవీ సునీల్ కుమార్, ఎందుకని ఎఫ్లిక్స్ సంస్థ యజమాని జిమ్ స్టఫర్డ్ కు లేఖ రాశారో చెప్పాలని ప్రజల తరఫున, నా పార్టీ మంచి కోరి అడుగుతున్నానని చెప్పారు . మహిళల నోళ్లలో నగుబాటు కాకుండా, ఆ రెండు లేఖలు ప్రజల ముందు పెట్టాలన్నారు. కేసులను పెడతామంటే ప్రయోజనం ఏమున్నదని, పోతిన పై ఎలాగో కేసులు పెట్టలేరని, పట్టాభి పై కేసు పెట్టిన న్యాయస్థానంలో నిలిచే అవకాశమే లేదన్నారు.
అసలు చంద్రబాబుకు సంబంధం ఏమిటి?
ఎక్స్చేంజిలో విద్యుత్ కొనుగోళ్లకు 24 గంటల వ్యవధిలో డబ్బులు చెల్లించాలని, అటువంటి అప్పుడు మూడు ఏళ్ల మూడు మాసాల క్రితం పదవి నుంచి దిగిపోయిన చంద్రబాబు నాయుడుకు, ప్రస్తుత విద్యుత్ కొనుగోలు బకాయిలకు సంబంధం ఏమిటో చెప్పాలని రఘురామకృష్ణం రాజు డిమాండ్ చేశారు. గత 20 నుంచి 40 రోజుల వ్యవధిలో విద్యుత్ కొనుగోళ్లకు బాబుకు సంబంధం ఉన్నదని చెప్పడం అంటే మోకాలికి బోడి గుండు కి లెంక పెట్టడమేనని ఎద్దేవా చేశారు. రాష్ట్ర విభజన అనంతరం రెండున్నర సంవత్సరాల పాటు విద్యుత్ కష్టాలను ప్రజలు ఎదుర్కొన్న మాట వాస్తవమేనని, కానీ గత ప్రభుత్వ చివరి రెండున్నర ఏళ్లలో విద్యుత్ ఇబ్బందులు తొలగిపోయాయన్నారు. అలాగే ఈ ప్రభుత్వ హయాంలో రెండున్నర ఏళ్ల పాటు విద్యుత్ కష్టాలు లేవని, దానికి గత ప్రభుత్వ హయాంలో చేసుకున్న ఒప్పందాలే కారణమని చెప్పారు.
ప్రస్తుతం టారిఫ్ లు పెంచామని, శ్లాబ్ విధానాలను మార్చామని, ఎంతో డబ్బులను వసూలు చేస్తున్నామని అయినా విద్యుత్ కొనుగోలు చేసి డబ్బులు చెల్లించకపోవడం విడ్డూరంగా ఉన్నదని రఘురామకృష్ణంరాజు విమర్శించారు. సాక్షి దినపత్రికలో మాత్రం చంద్రబాబు పాపం, డిస్కమ్ లకు శాపమని వార్తా కథనం ప్రచురించడం హాస్యాస్పదంగా ఉన్నదని ఎద్దేవా చేశారు.. ప్రజలు నవ్వుకుంటున్నారని, అమ్మ ఒడి పథకానికి డబ్బులు ఇస్తే నువ్వు ఇచ్చినట్లు, విద్యుత్ బకాయిలను ఎగ్గొడితే చంద్రబాబు చేసినట్లా అని ప్రశ్నించారు. ప్రజలు తెలివైన వాళ్ళని, వారికి అన్ని విషయాలు తెలుసునని కాకపోతే భయం చేత ముందుకొచ్చి మాట్లాడడం లేదని అన్నారు.
ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం దుర్వినియోగం సరికాదు
కమలాపురానికి చెందిన ప్రసాద్ అనే వ్యక్తిపై ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద ఒక అగ్రవర్ణానికి చెందిన వ్యక్తి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయడం విడ్డూరంగా ఉందని రఘురామకృష్ణం రాజు అన్నారు. దళిత వ్యక్తితో సహజీవనం చేస్తున్న ఓసి సామాజిక వర్గానికి చెందిన మహిళ ఫిర్యాదుతో తనపై ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసినట్లు ప్రసాద్ తెలియజేశారన్నారు. ఈ విధంగా ఎస్సీ , ఎస్టీ అత్యాచారక నిరోధక చట్టాన్ని దుర్వినియోగం చేయడం సరికాదని ఆయన పేర్కొన్నారు.
కృష్ణ తత్వాన్ని అలవర్చుకోవాలి
శ్రీకృష్ణ జన్మాష్టమి పురస్కరించుకొని ప్రజలకు రఘురామకృష్ణం రాజు శుభాకాంక్షలు తెలియజేశారు.. కృష్ణ తత్వా న్ని, గీతా సారాన్ని అలవర్చుకుంటే కష్టాలు, కష్టాలుగా కనిపించవని పేర్కొన్నారు.