-
ఎమ్మెల్యేల గొంతులో పవన్ పచ్చివెలక్కాయ
-
అక్రమ బియ్యం దందాలో ఒక్కో ఎమ్మెల్యేకు 20 నుంచి 30 లక్షల మామూళ్లు
-
ఇప్పుడు పవన్ అడ్డుచక్రంతో ఆగిపోనున్న ఎమ్మెల్యేల ఆదాయం
-
తాజాగా రేషన్‌షాపుల నుంచి నిలిచిపోయిన కొనుగోళ్లు
-
భయంతో కొనుగోళ్లు ఆపేసిన బ్రోకర్లు
-
కాకినాడ, రాజమండ్రి రైస్‌మిల్లుల్లోనే రీసైక్లింగ్?
-
బడా ట్రాన్స్‌పోర్టర్లలో ఒకే కులానికి చెందిన వారే ఎక్కువ
-
కాకినాడ-రూరల్ ప్రతినిధుల మధ్య వాటాల వార్
-
అధికారం లేకున్నా చక్రం తిప్పుతున్న ద్వారంపూడి?
-
కూటమి నేతలతో కలసి వ్యాపారం చేస్తున్నారంటూ గుసగుసలు
-
గుంటూరు-ప్రకాశం జిల్లాలకు ఆ మంత్రిగారి అనుచరుడే ‘సారధి’
( మార్తి సుబ్రహ్మణ్యం)
ఎంకిపెళ్లి సుబ్బిచావుకొచ్చినట్లు.. ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ అక్రమ బియ్యం రవాణాపై చేస్తున్న హడావిడి, చేస్తున్న ప్రకనటలు ఎమ్మెల్యేల చావుకొచ్చిపడుతోంది. రేషన్‌షాపుల నుంచి పంపిణీ చేయాల్సిన బియ్యం పక్కదారి పట్టి.. కాకినాడ పోర్టు నుంచి ఆఫ్రికాకు వెళుతున్న వైనంపై.. పవన్ కల్యాణ్ అగ్గిరాముడైన వైనం, బియ్యం బ్రోకర్లకు దడ పుట్టిస్తోంది. అదే సమయంలో నెలకు లక్షలాది రూపాయల ముడుపుల ఆదాయం పోతుండటం అటు ఎమ్మెల్యేలకు మింగుడుపడకుండా ఉంది.
ఒక్కో రేషన్‌షాపు నుంచి కిలోకి 15 రూపాయలకు కొనుగోలు చేస్తున్న బ్రోకర్లు.. దానిని రీసైక్లింగ్ చేసిన తర్వాత ఎగుమతిదారులకు 70 రూపాయలకు అమ్ముతున్నారన్న ఆరోపణలు ఎప్పటినుంచో ఉన్నవే. జగన్ జమానాలో కూడా ఇదే రేటు. ఏ ప్రాంతానికి ఆ ప్రాంతంలోకి బ్రోకర్లు స్థానికంగా ఉన్న రేషన్‌షాపుల నుంచి బయ్యం సేకరిస్తుంటారు. రేషన్‌షాపుల యజమానులు రేషన్‌కార్డుదారులకు కిలో 10 రూపాయలు చెల్లించి, ఆ బియ్యం కొనుగోలు చేస్తారు. దానిని బ్రోకర్లకు 15 రూపాయలకు అమ్ముతున్నారు.
వీటిని కాకినాడ పరిసర ప్రాంతాల్లోని రైస్‌మిల్లులకు తరలించి, అక్కడే రీ సైక్లింగ్ చేయించి, లారీల ద్వారా పోర్టుకు తరలిస్తుంటారు. ఇది చాలాకాలం నుంచి విజయవంతంగా కొనసాగుతున్న అమ్మకం-కొనుగోలు వ్యవస్థ. వాటిని కాకినాడ పోర్టుకు తరలించేందుకు బడా ట్రాన్స్‌పోర్టర్లు ఉన్నారు. మొత్తం 28 మంది ట్రాన్స్‌పోర్టర్లలో 20 మంది ఒకే సామాజికవర్గానికి చెందన వారే కావటం ఆశ్చర్యం. వీరిలో ఆర్ధికమంత్రి పయ్యావుల కేశవ్ వియ్యంకుడు కూడా ఉన్నారని, వైసీపీ నేత బొత్స సత్యనారాయణ, అంబంటి రాంబాబు, పేర్ని నాని ఆరోపణలు గుప్పించారు.
కాగా జగన్ జమానాలో మంత్రిగా పనిచేసిన ఓ గోదావరి జిల్లా ప్రముఖుడికి రైస్‌మిల్లులు చాలా ఉన్నాయి. అప్పట్లో ఈ బియ్యం వ్యవహారంలో ఆయనదే కీలకపాత్ర అనే అరోపణలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. జగన్ హయాంలో ఈ బియ్యం మాఫియా కొత్తరూపు దాల్చి, అప్పటి ప్రభుత్వం కొనుగోలు చేసిన వాహనాల ద్వారా, గ్రీన్‌చానెల్ ఏర్పాటు చేసి అసలు షాపులకు బియ్యం సరఫరా చేయకుండానే, నేరుగా బ్రోకర్లను పంపించేవారని స్వయంగా పౌరసరఫరాల శాఖమంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించడం విశేషం.
ఇక స్థానికంగా రేషన్‌షాపుల నుంచి బియ్యం కొనుగోలు చేసిన బ్రోకర్లు లారీల్లో తరలించాలంటే, స్థానిక ఎమ్మెల్యేల అనుమతి తప్పనిసరి. దానికోసం వారు ఒక్కో ఎమ్మెల్యేలకు 20 నుంచి 30 లక్షల రూపాయలు ముడుపులుగా చెల్లిస్తున్నారన్నది బహిరంగ రహస్యం. కూటమి ప్రభుత్వంలోనూ ఈ వ్యాపారం విజయవంతంగా జరుగుతోంది. గుంటూరు-ప్రకాశం జిల్లాలకు చెందిన రేషన్‌షాపు డీలర్లనుంచి అద్దంకి నియోజకవర్గానికి చెందిన ఓ టీడీపీ రాష్ట్ర నేత అనుచరుడే ఈ కొనుగోళ్లకు సారధిగా ఉన్నారన్నది బహిరంగమే. ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కాకినాడ పోర్టులోకి వెళ్లి, హడావిడి చేయడం ఎమ్మెల్యేలకు మింగుడుపడకుండా ఉంది. ఎక్కడ తమ ఆదాయానికి గండిపడుతుందోనన్నదే ఆ భయానికి కారణం.
అందుకు తగినట్లుగానే తాజాగా బ్రోకర్లు బియ్యం కొనుగోళ్లు నిలిపివేశారని సమాచారం.ఈ నెల వచ్చిన కోటాను బ్రోకర్లు కొనుగోలు చేయలేదట. దీనిపై ప్రభుత్వం సీరియస్‌గా ఉండటం, సీఎం చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ భేటీ అయిన నేపథ్యంలో.. బ్రోకర్లు ఈసారికి బియ్యం కొనుగోలు నిలిపివేసినట్లు చెబుతున్నారు. బియ్యం వ్యవహారం ఎప్పుడు కొలిక్కివస్తుందో తెలియనందున, ఆ సమస్యకు పరిష్కారమయ్యే వరకూ ఈ దందాను తాత్కాలికంగా నిలిపివేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఫలితంగా ఎమ్మెల్యేల ఆదాయానికీ గండిపడినట్లయింది. నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలకు క్రమం తప్పకుండా వచ్చే ఆదాయంలో ఈ బియ్యం వ్యవహారం ఒకటి.
కాగా జగన్ జమానాలో చక్రం తిప్పిన కాకినాడ వైసీపీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి హవా, ఇప్పటికీ విజయవంతంగా కొనసాగుతుండటమే ఆశ్చర్యం. నిజానికి ద్వారంపూడి కుటుంబం, బియ్యం వ్యవహారంలో తొలినుంచీ కీలకపాత్ర పోషిస్తోందన్నది బహిరంగమే. కాకినాడ పోర్టుపై ఆయనదే పైచేయి. ఆయనకు తెలియకుండా పోర్టులో చీమకూడ చిటుక్కుమనదు. గతంలో ఆయన ఇంటిమనిషిగా పేరుండి, వైసీపీలో చురుకుగా పనిచేసిన వ్యక్తి ఇప్పుడు జనసేన కోటాలో సివిల్‌సప్లయిస్ కార్పొరేషన్ చైర్మన్ పదవి సాధించారంటే.. బియ్యం వ్యాపారంలో ద్వారంపూడి ఎంత శక్తివంతుడన్నది స్పష్టమవుతోంది. తాజాగా ఆయన కూటమికి చెందిన ప్రజాప్రతినిధులతో కలసి వ్యాపారం చేస్తున్నారని, గతంలో ఈ జిల్లా నుంచి మంత్రిగాపనిచేసిన ఓ నాయకుడితో కలసి వ్యాపారం చేశారన్న ప్రచారం తెలిసిందే.
కాగా బియ్యం రవాణాకు సంబంధించిన వాటాల వ్యవహారంలో.. కాకినాడ-రూరల్ నియోజకవర్గాల ప్రజాప్రతినిధుల మధ్య పంచాయతీ జరుగుతున్నట్లు సమాచారం. ఇందులో తనకూ వాటా ఇవ్వాలంటూ.. రూరల్ నియోజకవర్గానికి చెందిన ఓ జనసేన అగ్రనేత పంచాయతీ పెట్టారని, తర్వాత ఈ విషయం తెలిసిన పవన్ కల్యాణ్.. సదరు నేతను మంద లించారన్న ప్రచారం జరుగుతోంది. ఇక కాకినాడకు చెందిన ఓ టీడీపీ కీలకనేతకు ముడుపులు ఇస్తే, ఎలాంటివాటినయినా అనుమతి ఇస్తారన్న ప్రచారం లేకపోలేదు.