– దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ
దేశాయిపేట: వరంగల్ జిల్లా దేశాయిపేటలోని బీరప్ప దేవాలయం నవీకరణ అనంతరం కురుమ కులస్తుల ఆధ్వర్యంలో నిర్వహించిన పూజా కార్యక్రమాల్లో అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ పాల్గొన్నారు. దేవాలయానికి చేరుకున్న మంత్రి కి ప్రజలు డోలుతో ఘనస్వాగతం పలికారు.
అనంతరం మంత్రి సురేఖ బీరప్ప, అక్క మహంకాళి, పోషమ్మ, నాగమయ్య దేవతల విగ్రహావిష్కరణ పూజల్లో పాల్గొన్నారు. పూజా కార్యక్రమాల అనంతరం అర్చకులు మంత్రి సురేఖకు వేదాశీర్వచనం అందించారు. ఆలయ నిర్వాహకులు మంత్రి సురేఖను సత్కరించారు.
ఈ సందర్భంగా మంత్రి సురేఖ మాట్లాడుతూ.. ఉత్పత్తి కులాల సంక్షేమం, ప్రగతికి కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ఎంతో ప్రాధాన్యతనిస్తున్నదని అన్నారు. సబ్బండ వర్గాల వికాసమే ధ్యేయంగా కార్యాచరణను అమలుచేస్తున్నదని తెలిపారు.
ఇచ్చిన మాటకు కట్టుబడి ఒక్కో పథకాన్ని అమలు చేస్తూ ప్రజలకు మేలు చేసే కార్యాచరణతో ముందుకు సాగుతున్నామని మంత్రి సురేఖ అన్నారు. దేవాలయాల్లో కనీస సౌకర్యాలకు ప్రాధాన్యతనిస్తూ, అన్ని వర్గాల ప్రజలను ఆదరించేలా దేవాలయాలను తీర్చిదిద్దుతున్నామని మంత్రి సురేఖ స్పష్టం చేశారు. కురుమ కులస్తుల కోరిక మేరకు దేశాయిపేటలో కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి చర్యలు చేపడుతానని మంత్రి సురేఖ హామీ ఇచ్చారు.