– అయ్యప్ప భక్తులకు ట్రావన్ కోర్ దేవస్థానం వినతి
శబరి: పవిత్రమైన పంబా నదిని కలుషితం చేయకుండా శబరికి వచ్చే అయ్యప్ప భక్తులు కొన్ని మార్గదర్శకాలను పాటించాలని, సన్నిధానంలో స్వామి దర్శనానికి ఆన్ లైన్ లో టైమ్ స్లాట్ కేటాయించే సదుపాయాన్ని వినియోగించుకోవాలని ట్రావెన్ కోర్ దేవస్థానం బోర్డు ఒక ప్రకటనలో వివరించింది.
మండల- మకరవిళక్కు 2024-25 సందర్బంగా దేవస్థానం ప్రధాన తంత్రీ జారీ చేసిన నియమ నిబంధనలను బోర్డు అన్ని రాష్ట్రాలకు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణా, కర్నాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లోని అయ్యప్ప భక్తులకు ఒక ప్రకటన ద్వారా తెలియచేసింది.
ప్రతిరోజూ సన్నిధానం చేరే భక్తుల సంఖ్య దాదాపు 70 వేల నుంచి 80 వేల వరకు ఉంటుందని అయితే, ఎంట్రీ పాయింట్ (ప్రవేశ ద్వారం) నుంచి కేవలం పది వేల మందికి మాత్రమే సన్నిధానం చేరే అవకాశం ఉన్నందున, భక్తులు ఆన్ లైన్ ద్వారా ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలని దేవస్థానం పేర్కొంది. భక్తులు ఆన్ లైన్ ద్వారా తమకు అనుకూలమైన తేదీ, సమయాన్ని ఎంచుకోవచ్చని దేవస్థానం తెలిపింది.
పంబ ఎంట్రీ పాయింట్ వద్ద బుకింగ్ సౌకర్యాన్ని వినియోగించుకునే భక్తులు ఆధార్ కార్డు తీసుకుని రావాలని, విదేశీ భక్తులైతే తమ పాస్ పోర్టు కాపీలను వెంట తీసుకుని రావాల్సిందిగా పేర్కొంది. పవిత్రమైన పంబా జలాల్లో పర్యావరణాన్ని కాపాడటం కోసం ప్లాస్టిక్ ఇరుముడు కట్లను వినియోగించవద్దని దేవస్థానం తంత్రీ పేర్కొన్నారు. సన్నిధానం పవిత్రతను కాపాడుతూ ప్లాస్టిక్ వినియోగ రహిత వాతావరణాన్ని భక్తులు పాటించాలని తంత్రీ కోరారు.
భక్తులు తమ దీక్షా వస్త్రాలను పంబా నదిలోకి విసిరి వేయరాదని, పంబా పవిత్రతను కాపాడుతూ, నదీ జలాలను పరిశుద్ధంగా ఉంచాలని దేవస్థానం కోరింది. భక్తుల సంఖ్య అధికంగా ఉండే దృష్ట్యా అందరికీ అయ్యప్ప దర్శనం జరిగేలా, ఏ ఒక్క భక్తుడు అయ్యప్ప దర్శనం చేసుకోలేకపోయాననే మాట రాకూడదనే దిశలో చర్యలు తీసుకుంటున్నామని, సహకరించాలని బోర్డు అధ్యక్షుడు పి.ఎస్. ప్రశాంత్ ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేశారు.