ఆంధ్రప్రదేశ్ ఐటీ చరిత్రలో ఏప్రిల్ 28 ఒక సువర్ణ అధ్యాయంగా నిలిచిపోనుంది. ప్రపంచ ఐటీ దిగ్గజం గూగుల్, విశాఖపట్నంలో సుమారు రూ. 1.35 లక్షల కోట్ల ($15 Billion) భారీ పెట్టుబడితో మెగా డేటా సెంటర్ మరియు ఏఐ (AI) హబ్‌కు శంకుస్థాపన చేయడం రాష్ట్ర పారిశ్రామిక గమనాన్ని మార్చే కీలక పరిణామం.
ఇది కేవలం ఒక భవన నిర్మాణం కాదు. ఉత్తరాంధ్రను అంతర్జాతీయ టెక్నాలజీ పటంలో నిలబెట్టే ఒక “ఇంటిగ్రేటెడ్ ప్రాజెక్ట్”.గూగుల్ సంస్థ విశాఖ మరియు అనకాపల్లి జిల్లాల్లో 1 గిగావాట్ సామర్థ్యంతో మూడు ప్రధాన ప్రాంతాల్లో తన కేంద్రాలను ఏర్పాటు చేస్తోంది. అవి తర్లువాడ: 266.6 ఎకరాలు, అడవివరం: 160 ఎకరాలు, రాంబిల్లి (అనకాపల్లి): 174.80 ఎకరాల్లో ఇవి రానున్నాయి.
ఈ మూడు కేంద్రాలను 2028 నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. దీనికి తోడు రిలయన్స్ సంస్థ కూడా రూ. 1.60 లక్షల కోట్లతో 1,200 మెగావాట్ల ఏఐ డేటా సెంటర్‌ను ఏర్పాటు చేస్తుండటం విశేషం. కేవలం డేటా స్టోరేజీ మాత్రమే కాదు ఇది ఒక ఎకోసిస్టమ్. డేటా సెంటర్ అంటే కేవలం సమాచారాన్ని దాచుకునే సర్వర్ల సమూహం మాత్రమే కాదు.
ఈ ప్రాజెక్టుతో పాటు వచ్చే అనుబంధ వసతులు నగరాన్ని “సిలికాన్ కోస్ట్”గా మారుస్తాయి. సముద్రగర్భ కేబుళ్లతో ఇతర దేశాలతో నేరుగా వేగవంతమైన డేటా అనుసంధానం ఏర్పడుతుంది.అంతర్జాతీయ కనెక్టివిటీని పెంచుకునే అవకాశం లభిస్తుంది. ఏఐ కంప్యూటింగ్: కృత్రిమ మేధ (AI) ఆధారిత సేవలకు అవసరమైన మౌలిక వసతులు అందుబాటులోకి వస్తాయి.క్లస్టర్ డెవలప్మెంట్: గూగుల్ వంటి పెద్ద సంస్థ ఉన్నచోటుకు స్టార్టప్‌లు, సాఫ్ట్వేర్ కంపెనీలు తరలివస్తాయి.
ఈ ప్రాజెక్ట్ ద్వారా ప్రత్యక్షంగా మరియు పరోక్షంగా సుమారు 1.88 లక్షల ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది.ప్లాంట్ల నిర్మాణ సమయంలో సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ విభాగాల్లో సుమారు 60,000 మందికి ఉపాధి లభిస్తుంది.డేటా ఇంజనీర్లు, నెట్వర్క్ స్పెషలిస్టులు, ఏఐ/ఎంఎల్ నిపుణులు, సైబర్ సెక్యూరిటీ అనలిస్టులు అవసరమవుతారు.ట్రాన్స్ఫార్మర్లు, కూలింగ్ సిస్టమ్స్, యూపీఎస్ సరఫరా చేసే MSME పరిశ్రమల ద్వారా వేలమందికి పరోక్షంగా ఉపాధి అవకాశాలు లభిస్తాయి.
ఇందుకోసం విద్యార్థులకు కొన్ని నైపుణ్యాలు అవసరం అవుతాయి. ఈ అవకాశాలను అందుకోవాలంటే విద్యార్థులు అకడమిక్ చదువులతో పాటు ప్రత్యేక శిక్షణ అవసరం అవుతుంది. కోర్ ఐటీ అంటే Linux/Windows Server నిర్వహణ, Networking (CCNA), మరియు Cloud (AWS/Azure/Google Cloud) నేర్చుకోవాలి. అలాగే, అడ్వాన్స్డ్ టెక్ లో Python ప్రోగ్రామింగ్, AI/ML మోడల్స్, మరియు డేటా సైన్స్ అవసరం.
కోర్ ఇంజనీరింగ్ అంటే.. EEE, ECE మరియు మెకానికల్ విద్యార్థులు హార్డ్‌వేర్ మెయింటెనెన్స్, కూలింగ్ సిస్టమ్స్ మరియు విద్యుత్ నిర్వహణలో నైపుణ్యం సాధించాలి.డేటా సెంటర్లలో ఉద్యోగాలు సాధించినవారికి ఎంట్రీ లెవల్ లో ఏడాదికి ₹2.5 లక్షల నుండి ₹5 లక్షల వేతనం లభిస్తుంది. మిడ్ లెవల్ లో వీరి జీతాల స్థాయి ₹6 లక్షల నుండి ₹15 లక్షల వరకూ ఉంటుంది. ఎక్స్పర్ట్ లెవల్ కి మాత్రం మంచి వేతనాలు లభిస్తాయి. క్లౌడ్ & ఏఐ నైపుణ్యం ఉంటే ₹20 లక్షలకు పైగా వేతనం లభించవచ్చు.
హైదరాబాద్, బెంగళూరు, చెన్నై వంటి నగరాల సరసన విశాఖపట్నం నిలబడటానికి ఈ మెగా డేటా సెంటర్ ఒక గేట్-వే అని చెప్పాలి. ఈ “ఉద్యోగ విప్లవం” సాకారం కావాలంటే స్థానిక యువత త్వరితగతిన కొత్త టెక్నాలజీలలో శిక్షణ పొందాలి. ప్రభుత్వ పారిశ్రామిక విధానాలు, విద్యా సంస్థల సహకారం తోడైతే, విశాఖ త్వరలోనే భారత దేశపు కీలక టెక్నాలజీ హబ్‌గా అవతరించడం ఖాయం.
-జి.గాయత్రి, బీటెక్, బీబీఏ
LinkedIn Influencer
9959323934